1946 ఎన్నికలు, క్యాబినెట్ మిషన్, డైరెక్ట్ యాక్షన్ డే, విభజన కోసం ప్రణాళిక, స్వాతంత్ర్యం: 1946-1947

Aug 14, 2021 - 22:53
 0
1946 ఎన్నికలు, క్యాబినెట్ మిషన్, డైరెక్ట్ యాక్షన్ డే, విభజన కోసం ప్రణాళిక, స్వాతంత్ర్యం: 1946-1947

1946 జనవరిలో సాయుధ సేనల్లో తిరుగుబాట్లు జరిగాయి. బ్రిటనుకు చెందిన RAF సైనికులు తమను స్వదేశానికి తిరిగి పంపడం నెమ్మదిగా జరగడంతో నిరాశ చెందారు. వారితో తిరుగుబాట్లు మొదలయ్యాయి.[33] 1946 ఫిబ్రవరిలో బొంబాయిలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుతో పుంజుకున్నాయి. కలకత్తా, మద్రాస్, కరాచీలలో కూడా అందుకున్నాయి. తిరుగుబాట్లను వేగంగా అణచివేసినప్పటికీ, అవి అట్లీ ప్రభుత్వాన్ని చర్యకు ప్రేరేపించాయి.

లేబర్ పార్టీ ప్రధాన మంత్రి క్లెమెంట్ అట్లీకి 1920 ల నుండి భారత స్వాతంత్ర్యం పట్ల ఆసక్తి ఉంది. అనేక సంవత్సరాలుగా దీనికి మద్దతు ఇస్తూ వచ్చాడు. అతను ఇప్పుడు ప్రభుత్వ పదవిని చేపట్టాడు, ఈ సమస్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు.

భారత విదేశాంగ కార్యదర్శి లార్డ్ పెథిక్ లారెన్స్ నేతృత్వంలో ఒక క్యాబినెట్ మిషన్ భారతదేశానికి పంపాడు. ఇందులో సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ కూడా ఉన్నాడు. క్రిప్స్ అంతకు నాలుగేళ్ళ ముందు కూడా భారతదేశాన్ని సందర్శించాడు. స్వాతంత్ర్యానికి క్రమబద్ధమైన బదిలీకి ఏర్పాట్లు చేయడమే మిషన్ యొక్క లక్ష్యం.

1946 ప్రారంభంలో, భారతదేశంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ప్రకటించడంతో ముస్లిం ఓటర్లు ఐక్య భారత దేశం, లేదా విభజన - ఈ రెంటిలో ఒకదాన్ని ఎన్నుకోవలసి వచ్చింది. 1945 లో యుద్ధం ముగింపులో, దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొన్న సుభాస్ చంద్రబోస్కు చెందిన భారత జాతీయ సైన్యం లోని ముగ్గురు సీనియర్ అధికారులపై బహిరంగ విచారణను వలస ప్రభుత్వం ప్రకటించింది.

విచారణలు ప్రారంభమైనప్పుడు, అంతకు ముందు ఎప్పుడూ ఐఎన్‌ఎకు మద్దతు ఇవ్వని కాంగ్రెసు నాయకత్వం, నిందితులైన అధికారులను రక్షించాలని తలపెట్టింది. అధికారులపై నేరారోపణలు, దానికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం, చివరికి శిక్షల నుండి ఉపశమనం వలన కాంగ్రెస్‌కు సానుకూల ప్రచారం లభించింది.

తదుపరి జరిగిన ఎన్నికల్లో పదకొండు ప్రావిన్సులలో ఎనిమిదింటిలో పార్టీ విజయాలను గెలుచుకోవడానికి ఇది దోహదపడింది. కాంగ్రెసు, ముస్లిం లీగ్ మధ్య చర్చలు విభజన సమస్యపై తడబడ్డాయి.

చాలా మంది హిందువులకు సంబంధించి, బ్రిటిషు పాలన చట్టబద్ధతను కోల్పోయింది. దీనికి నిశ్చయాత్మకమైన రుజువు 1946 ఎన్నికల రూపంలో వచ్చింది. ముస్లిమేతర నియోజకవర్గాలలో కాంగ్రెసు 91 శాతం ఓట్లను గెలుచుకుంది. తద్వారా కేంద్ర శాసనసభలో మెజారిటీ సాధించింది. ఎనిమిది ప్రావిన్సుల్లోప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

చాలా మంది హిందువులకు బ్రిటిషు ప్రభుత్వానికి చట్టబద్ధమైన వారసుడు కాంగ్రెస్సే. ఒకవేళ, బ్రిటిషు వారు భారతదేశాన్నీ వదలకుండా పాలిస్తూనే ఉండాలని అనుకుని ఉంటే, రాజకీయంగా చురుకైన భారతీయులను బ్రిటిషు పాలనకు అంగీకరింపజేయడం ఈ ఎన్నికల ఫలితాల తరువాత వారికి కష్టమయ్యేది. అయితే, చాలా మంది గ్రామీణ భారతీయుల అభిప్రాయాలు ఆ సమయంలో కూడా అనిశ్చితంగానే ఉన్నాయి.

ముస్లిం లీగ్ ముస్లిం ఓట్లతో పాటు ప్రాంతీయ అసెంబ్లీలలో రిజర్వు చేసిన ముస్లిం సీట్లలోఎక్కువ భాగాన్ని గెలుచుకుంది. ఇది కేంద్ర అసెంబ్లీలో ముస్లిం సీట్లన్నిటినీ దక్కించుకుంది. చివరకు ముస్లిం లీగ్, జిన్నాలు మాత్రమే భారతదేశ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తారనే వాదనను లీగ్ పటిష్ఠం చెయ్యగలిగింది జిన్నా ఈ ఓటును ప్రత్యేక మాతృభూమి కోసం ప్రజాదరణ పొందిన డిమాండ్‌గా చిత్రించాడు.

అయితే, సింధ్, బెంగాల్ రెండు ప్రావిన్సుల వెలుపల ముస్లిం లీగ్ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయలేకపోగా, కాంగ్రెసు NWFP లో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సిక్కులు యూనియనిస్టులతో కలిసి కాంగ్రెస్, పాంజాబులో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బ్రిటిషు వారు ప్రత్యేక ముస్లిం మాతృభూమిని ఆమోదించ లేదు గానీ, భారత ముస్లింల తరపున మాట్లాడటానికి ఒకే స్వరం ఉండడంలోని వీలు వారికి నచ్చింది. భారతదేశాన్ని తన 'సామ్రాజ్య రక్షణ' వ్యవస్థలో ఉంచాలంటే భారతదేశం, దాని సైన్యం ఐక్యంగా ఉండాలని బ్రిటన్ కోరుకుంది.

భారతదేశంలోని రెండు రాజకీయ పార్టీలు దీన్ని అంగీకరించక పోవడంతో, బ్రిటన్ క్యాబినెట్ మిషన్ ప్రణాళికను రూపొందించింది. ఈ మిషన్ ద్వారా, బ్రిటన్, కాంగ్రెసులు రెండూ కోరుకున్న ఐక్య భారతదేశాన్ని కాపాడాలని భావించారు.

అదే సమయంలో పాకిస్తాన్ కోసం జిన్నా చేస్తున్న డిమాండ్ లోని సారాన్ని 'సమూహాల' ద్వారా సాధించదలచారు.

క్యాబినెట్ మిషన్ పథకంలో, ప్రావిన్సులన్నీ మూడు సమూహాలుగా ఉండే సమాఖ్య ఏర్పాటు ఉంది. ఈ సమూహాలలో రెండిట్లో ప్రధానంగా ముస్లిం ప్రావిన్సులు ఉంటాయి. మూడవ సమూహం ప్రధానంగా హిందూ ప్రాంతాలతో ఉంటుంది. ప్రావిన్సులు స్వయంప్రతిపత్తి కలిగివుంటాయి.

అయితే రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార మార్పిడిపై కేంద్రం నియంత్రణను కలిగి ఉంటుంది. ఇవి స్వతంత్ర పాకిస్తాన్‌ను అందించనప్పటికీ, ముస్లిం లీగ్ ఈ ప్రతిపాదనలను అంగీకరించింది.

భారతదేశపు ఐక్యత పదిలంగానే ఉన్నా, ఇది కేంద్రాన్ని బలహీనపరుస్తుందని కాంగ్రెసు నాయకులు, ముఖ్యంగా నెహ్రూ, భావించారు. 1946 జూలై 10 న నెహ్రూ "రెచ్చగొట్టే ప్రసంగం" చేస్తూ, ప్రావిన్సులను సమూహపరచాలనే ఆలోచనను తిరస్కరించాడు. క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ను, ఐక్య భారతదేశం అవకాశాలు రెండింటినీ "సమర్థవంతంగా తుత్తునియలు చేసేసాడు".

కేబినెట్ మిషన్ విఫలమైన తరువాత, బ్రిటిషు ఇండియాలో ముస్లిం మాతృభూమికి ఉన్న డిమాండ్‌ను శాంతియుతంగా ఎత్తిచూపే లక్ష్యంతో జిన్నా 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవాన్ని ప్రకటించారు.

అయితే, 16 వ తేదీ ఉదయం, కలకత్తాలోని ఓక్టర్లోనీ మాన్యుమెంట్ వద్ద ముస్లిం లీగ్‌కు చెందిన బెంగాల్ ముఖ్యమంత్రి హుస్సేన్ షాహీద్ సుహ్రావార్ది ప్రసంగం వినడానికి సాయుధ ముస్లిం ముఠాలు సమావేశమయ్యాయి.

చరిత్రకారుడు యాస్మిన్ ఖాన్ మాటల్లో చెప్పాలంటే, "అతను హింసను స్పష్టంగా ప్రేరేపించకపోయి ఉండవచ్చు, కానీ అతడి మాటల్లో మాత్రం - వారు ఏంచేసినా శిక్ష పడకుండా తప్పించుకోగలరని, పోలీసులను గానీ, మిలిటరీని గానీ పిలవరనీ, నగరంలో వారు చేసే ఏపనులనైనా ప్రభుత్వం పట్టించుకోదనీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులకు కలిగించింది".

అదే రోజు సాయంత్రం, కలకత్తాలో, ఈ సమావేశం నుండి తిరిగి వస్తున్న ముస్లింలు హిందువులపై దాడి చేసారు. వారి చేతుల్లో అంతకుముందు పంచిన కరపత్రాలున్నాయి. ఈ హింసకు, పాకిస్తాన్ డిమాండుకూ మధ్య ఉన్న స్పష్టమైన సంబంధాన్ని ఈ కరపత్రాలు చూపించాయి. హింసకు మూలం ప్రత్యక్ష చర్యా దినోత్సవమేనని సూచించింది. ఈ హింసనే "1946 ఆగష్టు కలకత్తా నరమేధం" అని పిలిచారు.

మరుసటి రోజు, హిందువులు తిరగబడ్డారు. హింస మూడు రోజులు కొనసాగింది, ఇందులో హిందువులు ముస్లింలు సుమారు 4,000 మంది మరణించారు (అధికారిక లెక్కల ప్రకారం). భారతదేశంలో ఇంతకుముందు హిందూ ముస్లింల మధ్య మత హింసలు జరిగినప్పటికీ, కలకత్తా హత్యలు " జాతి ప్రక్షాళన " లక్షణాలను ప్రదర్శించిన మొదటి కలహాలివి.

హింస ప్రజా రంగానికి మాత్రమే పరిమితం కాలేదు, ఇళ్ళల్లోకి ప్రవేశించి నాశనం చేసారు, మహిళలు పిల్లలపై దాడి చేశారు. భారత ప్రభుత్వం, కాంగ్రేస్ పార్టీ రెండూ ఈ ఘటనలతో క్రక్కదలి పోయినప్పటికీ, సెప్టెంబరులో జవహర్ లాల్ నెహ్రూ ఐక్య భారత ప్రధానిగా, కాంగ్రెసు నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.

మత హింస బీహార్ (హిందువులు ముస్లింలపై దాడి చేసారు), బెంగాల్‌లోని నోఖాలి (ముస్లింలు హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు), యునైటెడ్ ప్రావిన్స్‌లోని గర్హ్ముక్తేశ్వర్ (హిందువులు ముస్లింలపై దాడి చేసారు) లకూ వ్యాపించింది. 1947 మార్చిలో రావల్పిండిలో హిందువులపై దాడి చేసి, తరిమేసారు.

బ్రిటిషు ప్రధాన మంత్రి అట్లీ, లార్డ్ లూయిస్ మౌంట్ బాటెన్ను భారతదేశపు చివరి వైస్రాయ్ గా నియమించాడు. విభజనను నివారించడానికీ, యునైటెడ్ ఇండియాను కాపాడటానికీ సూచనలతో 1948 జూన్ నాటికి బ్రిటిషు ఇండియా స్వాతంత్ర్యాన్ని పర్యవేక్షించే పని అతనికి ఇచ్చారు.

కనీసమాత్రపు ఎదురుదెబ్బలతో అతడు ఈ పని నిర్వహించాలి. భారతదేశంలో సమాఖ్య ఏర్పాట్ల కోసం క్యాబినెట్ మిషన్ పథకాన్ని పునరుద్ధరించాలని మౌంట్ బాటన్ భావించాడు. కేంద్రాన్ని పరిరక్షించాలన్న ఆసక్తి అతనికి మొదట్లో ఉన్నప్పటికీ, ఉద్రిక్తమైన మతతత్వ పరిస్థితి వలన అధికారాన్ని త్వరగా బదిలీ చేయడం కోసం విభజన అతడికి తప్పనిసరైంది.

ముహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో పెరుగుతున్న ముస్లిం వేర్పాటువాద ఉద్యమానికి పరిష్కారం భారతదేశ విభజనేనని అంగీకరించిన మొదటి కాంగ్రెసు నాయకులలో వల్లభాయ్ పటేల్ ఒకరు.

భారతదేశం అంతటా మత హింసను రేకెత్తించిన జిన్నా యొక్క ప్రత్యక్ష కార్యాచరణ ప్రచారం, రాజ్యాంగ ప్రాతిపదికన హింసను ఆపడానికి తన హోం శాఖ ప్రతిపాదనలను వైస్రాయ్ వీటో చెయ్యడం అతడికి ఆగ్రహం తెప్పించింది.

వైస్రాయ్, లీగ్ మంత్రులను ప్రభుత్వంలోకి ప్రవేశపెట్టడాన్ని, కాంగ్రెసు అనుమతి లేకుండా బ్రిటిషు వారు సమూహ పథకాన్ని తిరిగి ధ్రువీకరించడాన్నీ పటేల్ తీవ్రంగా విమర్శించాడు. ముస్లిం లీగ్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగమైనప్పటికీ అసెంబ్లీని బహిష్కరించడం, మే 16 నాటి ప్రణాళికను అంగీకరించకపోవడం లపై పటేల్‌కు మరింత ఆగ్రహం కలిగింది.

కానీ, జిన్నాకు ముస్లింలలో మద్దతు ఉందని, అతడికీ జాతీయవాదులకూ మధ్య బహిరంగ వివాదం తలెత్తితే పరిస్థితి క్షీణించి, హిందూ-ముస్లిం అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనీ పటేల్ భావించాడు.

కేంద్ర ప్రభుత్వం బలహీనంగా, భిన్నాభిప్రాయాలతో కొనసాగితే, 600 కి పైగా రాచరిక సంస్థానాలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని, దేశం ముక్కలైపోయే ప్రమాదముందని పటేల్ మనస్సులో ఉంది.1946 1947 డిసెంబరు జనవరి కాలంలో పటేల్, ప్రభుత్వ అధికారి విపి మీనన్‌తో కలిసి పనిచేశాడు. ముస్లిం-మెజారిటీ ప్రావిన్సుల నుండి పాకిస్తాన్ ను సృష్టించాలనే మీనన్ ప్రతిపాదనపై వాళ్ళిద్దరూ పనిచేసారు.

1947 జనవరి, మార్చి ల్లో బెంగాల్, పంజాబ్‌లలో జరిగిన మతహింస వలన, విభజన ప్రతిపాదన లోని ప్రయోజకత్వం పటేల్‌కు మరింతగా అర్థమైంది. పంజాబ్, బెంగాల్ లోని హిందూ-మెజారిటీ ప్రాంతాలను ముస్లిం రాజ్యంలో చేర్చాలని జిన్నా చేసిన డిమాండును తీవ్రంగా విమర్శించిన పటేల్, ఆ ప్రావిన్సుల విభజనను సాధించి, తద్వారా వాటిని పాకిస్తాన్లో చేర్చే అవకాశం లేకుండా చేసాడు. పంజాబ్, బెంగాల్ ల విభజనపై పటేల్ చూపించిన నిర్ణయాత్మకత, లీగ్ వ్యూహాలతో విసిగిపోయిన భారత ప్రజలకు చాలా నచ్చింది. అతనికి మద్దతు దారులను, ఆరాధకులనూ సంపాదించి పెట్టింది.

అయితే, విభజన కోసం ఆత్రుతగా ఉన్నాడంటూ అతన్ని గాంధీ, నెహ్రూ, లౌకిక ముస్లింలు, సోషలిస్టులు విమర్శించారు. 1947 జూన్ 3 న లార్డ్ మౌంట్ బాటన్ అధికారికంగా ఈ ప్రణాళికను ప్రతిపాదించినప్పుడు, పటేల్ తన అనుమతి ఇచ్చి, నెహ్రూను ఇతర కాంగ్రెసు నాయకులనూ ఈ ప్రతిపాదనను అంగీకరించమని నచ్చచెప్పాడు.

విభజన ప్రతిపాదనలకు సంబంధించి గాంధీ యొక్క తీవ్ర వేదనను తెలుసుకున్న పటేల్, కాంగ్రెస్-లీగ్ సంకీర్ణ ప్రభుత్వం ఏ విధంగా ఆచరణాత్మకం కాదో, హింస ఎలా పెరుగుతోందో, అంతర్యుద్ధపు ముప్పు ఎలా పొంచి ఉందో.. ప్రైవేట్ సమావేశాల్లో గాంధీతో చర్చించాడు. ఈ ప్రతిపాదనపై ఓటు వేయాలని పిలిచిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశంలో పటేల్ ఇలా అన్నాడు:

[ముస్లిం-మెజారిటీ ప్రాంతాల] లోని మా సోదరుల భయాలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. భారతదేశ విభజన ఎవరికీ ఇష్టం లేదు. నాకూ గుండె భారంగా ఉంది. కానీ, ఒక్క విభజనా, అనేక విభజనలా అనేది మనమిప్పుడు ఎంచుకోవాల్సి ఉంది. మనం వాస్తవాలను ఎదుర్కోవాలి. భావోద్వేగాలకూ మనోభావాలకూ లొంగిపోకూడదు. వర్కింగ్ కమిటీ భయంతో వ్యవహరించలేదు.

కానీ నేను ఒక విషయానికి భయపడుతున్నాను, ఇన్ని సంవత్సరాలుగా మనం పడ్డ శ్రమ, కృషి అంతా వృథాగా పోవచ్చు లేదా నిష్ఫలమై పోవచ్చు. నా తొమ్మిది నెలల పదవీకాలంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ యోగ్యతల పట్ల నాకున్న భ్రమలు తొలగిపోయాయి. ఏవో కొన్ని గౌరవనీయమైన మినహాయింపులు తప్పించి, పైనుండి క్రిందికి - చప్రాసీల దాకా ముస్లిం అధికారులంతా లీగ్ కోసమే పనిచేస్తున్నారు.

మిషన్ ప్లాన్‌లో లీగ్‌కు ఇచ్చిన మతపరమైన వీటో ప్రతి దశలో భారతదేశ పురోగతిని అడ్డుకునేది. మనకు నచ్చినా నచ్చకపోయినా, పంజాబ్, బెంగాల్‌లలో ఇప్పటికే డీ ఫ్యాక్టో పాకిస్తాన్ ఉంది. ఈ పరిస్థితులలో, నేను డి జ్యూర్ పాకిస్తాన్‌ను ఇష్టపడతాను.

ఇది లీగ్‌ను మరింత బాధ్యతాయుతంగా చేస్తుంది. స్వేచ్ఛ వచ్చేస్తోంది. 75 నుండి 80 శాతం భారతదేశం మనకే ఉంది. మన తెలివితేటల్తో దీన్ని బలోపేతం చేసుకోవచ్చు. మిగిలిన దేశాన్ని లీగ్ అభివృద్ధి చేసుకుంటుంది.

ప్రణాళికను గాంధీ తిరస్కరించడం కాంగ్రెసు ఆమోదించడం జరిగాక, పటేల్ విభజన మండలిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అక్కడ అతను ప్రజా ఆస్తుల విభజనను పర్యవేక్షించాడు. నెహ్రూతో కలిసి భారత మంత్రుల మండలిని ఎంచుకున్నాడు. ఏదేమైనా, విభజనతో జరిగే తీవ్రమైన హింస, జనాభా బదిలీని అతను గాని, మరే ఇతర భారతీయ నాయకుడు గానీ ఊహించలేదు.

1946 చివరిలో, బ్రిటన్‌లోని లేబర్ ప్రభుత్వం, ఇటీవల ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధంతో దాని ఖజానా ఖాళీ అయిపోవడంతో, భారతదేశంలో బ్రిటిషు పాలనను ముగించాలని నిర్ణయించుకుంది.

1948 జూన్ లోపు అధికారాన్ని బదిలీ చేయాలనే ఉద్దేశ్యాన్ని 1947 ప్రారంభంలో ప్రకటించింది. అయితే, హింస పెరిగితే, బ్రిటిషు సైన్యం సన్నద్ధంగా లేనందువల్ల, కొత్త వైస్రాయ్, లూయిస్ మౌంట్ బాటెన్, అధికార బదిలీ తేదీని ముందుకు తెచ్చాడు. స్వాతంత్ర్యం కోసం పరస్పరం అంగీకరించిన ప్రణాళికకు ఆరు నెలల కన్నా తక్కువ సమయం ఇచ్చాడు.

1947 జూన్ లో, కాంగ్రెసు తరపున నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, ముస్లిం లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జిన్నా, దళిత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బిఆర్ అంబేద్కర్, సిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాస్టర్ తారా సింగ్ సహా జాతీయవాద నాయకులందరూ గాంధీ అభిప్రాయాలకు పూర్తిగా వ్యతిరేకంగా మతపరమైన దేశ విభజనకు అంగీకరించారు.

ప్రధానంగా హిందువులు సిక్కులూ ఉన్న ప్రాంతాలను కొత్త భారతదేశానికీ, ప్రధానంగా ముస్లిం ప్రాంతాలను కొత్త దేశం పాకిస్తాన్‌కూ కేటాయించారు.

ఈ ప్రణాళికలో పంజాబ్, బెంగాల్ ముస్లిం-మెజారిటీ ప్రావిన్సుల విభజన ఉంది. విభజన రేఖ అయిన రాడ్‌క్లిఫ్ లైన్ ప్రకటనతో జరిగిన మత హింస మరింత భయంకరమైనది. భారత విభజనతో పాటు జరిగిన హింసను వివరిస్తూ, చరిత్రకారులు ఇయాన్ టాల్బోట్ గురుహర్‌పాల్ సింగ్ ఇలా వ్రాస్తున్నారు:

బాధితులను నరకడం, అవయవాలు తెగ్గొయ్యడం గురించి అనేక ప్రత్యక్ష సాక్షుల కథనాలు ఉన్నాయి. భయానక చర్యల్లో గర్భిణీ స్త్రీల గర్భవిచ్ఛిత్తి, ఇటుక గోడలపై శిశువుల తలలు పగల కొట్టడం, బాధితుల అవయవాలు, జననేంద్రియాలను కోసెయ్యడం, తలలూ మొండేలను ప్రదర్శించడం వంటివి ఉన్నాయి. మునుపటి మత అల్లర్లు ఘోరమైనవే అయినప్పటికీ, విభజన నాటి ఊచకోతలోని క్రూరత్వం, ఆ స్థాయీ మున్నెన్నడూ ఎరగనిది.

విభజన ఊచకోతలకు సంబంధించి ' మారణహోమం ' అనే పదాన్ని ఉపయోగించడాన్ని కొందరు పండితులు ప్రశ్నించినప్పటికీ, చాలా చోట్ల జాతిహింస ధోరణులు కనిపించాయి. ఇప్పటికే ఉన్న తరాన్ని తుడిచెయ్యడానికీ, భవిష్యత్ పునరుత్పత్తిని నిరోధించడానికీ ఈ హింసను రూపొందించారు. "

1947 ఆగస్టు 14 న, పాకిస్తాన్ అనే కొత్త డొమినియన్ ఉనికిలోకి వచ్చింది. ముహమ్మద్ అలీ జిన్నా కరాచీలో మొదటి గవర్నర్ జనరల్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. మరుసటి రోజు, 1947 ఆగస్టు 15 న, భారతదేశం - ఇప్పుడు చిక్కిపోయిన యూనియన్ ఆఫ్ ఇండియా - న్యూ ఢిల్లీలో అధికారిక వేడుకల మధ్య, జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, వైస్రాయ్ మౌంట్ బాటెన్ మొదటి గవర్నర్‌ జనరల్‌గా స్వాతంత్ర్యం పొందింది. విభాజిత ఉపఖండంలోని కొత్త శరణార్థులతో కలిసి పనిచేయడానికి గాంధీ బెంగాల్‌లోనే ఉండిపోయాడు.

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Donate. Buy Us Coffee  

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow