అతి పెద్ద వరమిచ్చినా.... ఊహించని షాక్... ?

Source:- W Forward - Suresh reddy Sr.Journalist.

Feb 3, 2022 - 15:06
 0
అతి పెద్ద వరమిచ్చినా.... ఊహించని షాక్... ?

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె కాదు కానీ వైసీపీకి కొత్త రాజకీయ పాఠాలు చాలానే చెబుతున్నట్లుగా ఉంది. అందులో ముఖ్యమైనవి ఏంటి అంటే ఎవరైనా ఎవరికైనా కూడా  అడిగినవి ఇవ్వాలి. అడగనివి ఇవ్వకూడదు ఇక మనం అనుకున్నవి మనకు ముచ్చట అయినవి మనకు తోచినవి చేసినవి ఎదుటి వారికి వరాలు కావు వారు అడిగితే ఇవ్వకపోతే ఎంతటి వరమైనా శాపమే అవుతుంది. ఇలాంటివి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకు అంటే ఏపీలో ఇపుడు ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె బాట పడుతున్నారు. దాంతో వైసీపీ సర్కార్ కి అదే ఇపుడు గట్టి షాక్ గా ఉందిట. ప్రభుత్వ  ఉద్యోగులు సమ్మె లోకి వెళ్తారని ఎపుడూ ఏ రోజూ కూడా వైసీపీ  పెద్దలు అనుకోలేదు అందుకే వారి సమస్యలను అడ్రెస్ చేసే విషయంలో కావల్సినంత టైమ్ తీసుకున్నారు. వారిలో వెల్లువెత్తుతున్న అసంతృప్తిని కూడా ఏ కోశానా  గమనించలేకపోయారు. ఇక తామేమి చెబితే అదే ప్రసాదం అనుకుని వారు స్వీకరిస్తారు అని కూడా అంచనా కట్టారు.

ఇక జగన్ తో ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా జగన్ వారు కోరకుండానే కొన్ని వరాలు ఇచ్చారు. ఆ వరాలలో అతి ముఖ్యమైనది ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లకు పెంచడం. మరోటి ఏంటి అంటే జగనన్న స్మార్ట్ కాలనీల్లో వారికి రాయితీ మీద ఇళ్ళ స్థలాలు రిజర్వేషన్లు ఇవ్వడం. దీంతో ఉద్యోగులు మిగిలిన వాటి మీద  తగ్గుతారని ఆ తరువాత  అన్నీ కూడా మరచిపోతారని అనుకున్నారు. కానీ సరిగ్గా చూస్తే  ఇక్కడే కధ అడ్డం తిరిగింది.

ప్రభుత్వ ఉద్యోగులు తమకు తక్షణం రావాల్సిన  అర్ధిక ప్రయోజనాల మీదనే  దృష్టి పెడతారు అన్న చిన్న లాజిక్ ని సర్కార్ మిస్ కావడం వల్ల వాళ్లకు ఎంతో చేశామని చెప్పుకోవడానికే ఆ వరాలు అన్నీ కూడా  పరిమితం అయ్యాయి. 

ఇక ఉద్యోగులకు అన్నీ చేసేశామనుకోవడం వారు చంద్రబాబుకు టీడీపీకి బద్ధ వ్యతిరేకులుగా ఎప్పటికీ  ఉంటారు కాబట్టి మద్దతు తమకు కాక మరెవరికి అన్న వైసీపీ పెద్దల  ధీమా ఇవన్నీ కలసి చివరికి ఏపీలో అతి పెద్ద సమ్మెని వైసీపీ సర్కార్ చవిచూడబోయేలా చేస్తున్నాయి. సరే ఈ సమ్మెలో ఆర్టీసీ కార్మికులు అసలు పాల్గొనరు అని ప్రభుత్వం భావించిందిట. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో కలపమని చిరకాలంగా డిమాండ్ ఉంటే దాన్ని ఏ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు.

జగన్ సర్కార్ అధికారంలోకి వస్తూనే అమలు చేసి చూపించింది. ఆ కృతజ్ఞత వారికి ఉంటుంది కాబట్టి సమ్మెకు దూరం అని లెక్కలేశారు. కానీ ఇపుడు ఆర్టీసీ కూడా సమ్మె సైరన్ మోగించడంతో సర్కార్ పెద్దలు తల్లడిల్లుతున్నారు. దీని మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాటలు చూస్తే ప్రభుత్వ పెద్దల ఆవేదన ఎలా ఉందో అర్ధమవుతుంది. మేము అర్టీసీని ప్రభుత్వంలో కలిపాము అయినా కూడా వారూ సమ్మె అంటున్నారు ఆయన చెప్పడం విశేషం. నిజానికి ఆర్టీసీని ప్రభుత్వంతో కలపకపోతే ఈపాటికి వారు వేరేగా ఉండేవారు సెపరేట్ కార్పోరేషన్ గా వారి సమస్యలు చర్చకు వచ్చేవి.

ఇంత పెద్ద సమ్మెలో వారు ముఖ్య భాగం అయి ఉండేవారు కానే కాదు మొత్తానికి జగన్ సర్కార్ కి ఆర్టీసీ షాక్ అలా ఇలా లేదు అంటున్నారు. ఇవన్నీ పక్కకు పెట్టి చూస్తే ఇప్పటికైనా ప్రభుత్వం ఒక విషయం అర్ధం చేసుకోవాలని అంటున్నారు. మనం జనాలకు ఎన్నో మేళ్ళు చేస్తున్నాం విచ్చలవిడిగా అప్పులు చేసి మరీ  సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని ధీమాతో ఉన్నారు.

కానీ ప్రభుత్వం పది పనులు చేసినా జనాలు కోరుకోని ఆ ఒక్కటీ చేయకపోయినా అదే అతి పెద్ద మైనస్ అవుతుంది. అదే విధంగా ఎన్ని అమలు చేసినా జనాల్లో మార్పు వచ్చిందంటే ఇవేమీ లెక్కలోకి కూడా రావు.

అందువల్ల ఓట్ల కోసం పధకాలు అంటూ ఇప్పటిదాకా తెచ్చి పెడుతున్న అప్పులతో సర్కార్ బ్యాలన్స్ తప్పేసింది అన్న విశ్లేషణలు ఉన్న నేపధ్యంలో పునరాలోచన చేసి రానున్న  రెండేళ్ళ కాలంలో అన్ని వర్గాలకు ఏమేమి కావాలో చూస్తూ ఆ దిశగా నిధుల సర్దుబాటు చేసుకోవాలని చెబుతున్నారు.

అలాగే  అభివృద్ధి వైపు కూడా చూడాలి. అంతే తప్ప తాము వారికి వరాలు ఇచ్చాం మనకే ఓట్లు అన్నీ అనుకుంటే అది చివరికి రాజకీయ  ఇబ్బందే అవుతుంది అని చెప్పడానికి ఈ సమ్మె ఒక అతి పెద్ద ఉదాహరణ అని విశ్లేషిస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow