"జాతీయ సముద్ర వారసత్వ సముదాయం అభివృద్ధికి సహకారం" కోసం ఎంవోయూ

నౌకారవాణా మంత్రిత్వ శాఖ. గుజరాత్‌లోని లోథల్‌లో "జాతీయ సముద్ర వారసత్వ సముదాయం అభివృద్ధికి సహకారం" కోసం ఎంవోయూ కుదుర్చుకున్న కేంద్ర నౌకాశ్రయాలు, నౌక రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. మన దేశ బలమైన సముద్ర చరిత్రను, గొప్పదైన తీర సంప్రదాయాన్ని ప్రదర్శించడానికి ఈ ఎంవోయూ ఉపకరిస్తుంది: శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ . మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటడంలో ఈ ఎంవోయూ, మ్యూజియం గొప్ప పాత్ర పోషిస్తాయి: శ్రీ ప్రహ్లాద్‌ సింగ్ పటేల్‌.

Jun 17, 2021 - 05:59
 0
"జాతీయ సముద్ర వారసత్వ సముదాయం అభివృద్ధికి సహకారం" కోసం ఎంవోయూ

గుజరాత్‌లోని లోథల్‌లో "జాతీయ సముద్ర వారసత్వ సముదాయం అభివృద్ధికి సహకారం" (ఎన్‌ఎంహెచ్‌సీ) కోసం, కేంద్ర నౌకాశ్రయాలు, నౌక రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ ‍(ఎంవోపీఎస్‌డబ్ల్యూ), కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (ఎంవోసీ) ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.

కేంద్ర నౌకాశ్రయాలు, నౌక రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. దిల్లీలోని ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఎన్‌ఎంహెచ్‌సీ వంటి ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని, మన దేశ గొప్ప, విభిన్న సముద్ర వైభవాన్ని చాటడానికి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు.

మన దేశ బలమైన సముద్ర చరిత్రను, గొప్పదైన తీర సంప్రదాయాన్ని ఒకేచోట ప్రదర్శించడానికి, భారతదేశ సముద్ర వారసత్వ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా పెంచడానికి ఈ ఎంవోయూ, సాంస్కృతిక శాఖ సహకారం ఉపకరిస్తుందని అన్నారు.

మన దేశ గొప్ప నిధి వంటి సాంస్కృతిక వారసత్వం గురించి మాట్లాడుతూ, ఆ నిధినంతా ఒకే ప్రాంతంలో ప్రదర్శించాల్సిన అవసరం ఉందని శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. ఈ ఎంవోయూ, పురావస్తు ప్రదర్శనశాల కలిసి మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటడంలో గొప్ప పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.

మన సాంస్కృతిక వారసత్వ గొప్పదనాన్ని పురావస్తు ప్రదర్శనశాలల ద్వారా ప్రపంచానికి తెలియజేయగలుగుతున్నామని అన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు 80 కి.మీ. దూరంలో ఉన్న లోథాల్‌లో, ఏఎస్‌ఐ ప్రాంతానికి సమీపంలో ఎంఎంహెచ్‌సీని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. పూర్వకాలం నుంచి ప్రస్తుతకాలం వరకు ఉన్న మన దేశ సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించే ప్రాంతంగా, ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దనున్నారు. భారతదేశ సముద్ర వారసత్వంపై ప్రపంచానికి అవగాహన పెంచడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన "ఎడ్యుటైన్‌మెంట్‌" విధానాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు భూ బదలాయింపు పూర్తయింది.

పర్యావరణ అనుమతి సహా అన్ని భూ సంబంధిత అనుమతులన్నీ వచ్చాయి. ఎంఎంహెచ్‌సీని 400 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. జాతీయ సముద్ర వారసత్వ ప్రదర్శనశాల, లైట్‌హౌస్‌ మ్యూజియం, వారసత్వ అంశాలతో రూపొందించిన పార్కు, మ్యూజియం తరహా హోటళ్లు, సముద్ర తరహా పర్యావరణహిత రిసార్టులు, సముద్ర సంస్థ వంటి విశిష్ఠ నిర్మాణాలను దశలవారీగా ఇక్కడ చేపడతారు.

క్రీ.పూ.2400 కాలంలో ఉన్న సింధు లోయ నాగరికత నాటి ప్రముఖ నగరాల్లో ఒకటైన పురాతన లోథల్ నగరాన్ని పునర్నిర్మించడం ఎన్‌ఎంహెచ్‌సీ ప్రత్యేకత. దీనికితోడు, వివిధ కాలాల్లో వర్ధిల్లిన భారత సముద్ర వారసత్వాన్ని వివిధ గ్యాలరీల ద్వారా ప్రదర్శిస్తారు.

సముద్ర తీర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ సముద్ర సంబంధ కళాఖండాలు/ వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఎన్‌ఎంహెచ్‌సీలో ప్రత్యేక కేటాయింపు ఉంటుంది.

సందర్శకులకు సంపూర్ణ పర్యాటక అనుభవాన్ని అందించేలా, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో, మారీటైమ్&నావల్ థీమ్ పార్కు, స్మారక కట్టడాల పార్కు, వాతావరణ మార్పుల పార్కు, సాహసాలు &వినోదాల పార్కు వంటి వివిధ అంశాలతో ఎంఎంహెచ్‌సీని అభివృద్ధి చేస్తారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow