జనవరి 12నాటి 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

Jan 11, 2021 - 04:49
 0
జనవరి 12నాటి 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి
PM Narendra modi : File Photo

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకల ముగింపు సభనుద్దేశించి జనవరి 12న ఉదయం 10:30 గంటలకు దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రసగిస్తారు. ఈ వేడుకలలో జాతీయస్థాయి విజేతలు ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. లోక్‌స‌భాపతి, కేంద్ర విద్యాశాఖ మంత్రి, యువజన వ్యవహారాలు-క్రీడల శాఖ సహాయ మంత్రి (ఇన్‌చార్జి) కూడా ఇందులో పాల్గొంటారు.

జాతీయ యువజన పార్లమెంటు వేడుకలు

   దేశవ్యాప్తంగా భవిష్యత్తులో పలు వృత్తులుసహా ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టే అవకాశంతోపాటు ఓటుహక్కుగల 18 నుంచి 25 ఏళ్ల యువజన గళానికి ప్రాధాన్యమివ్వడమే ‘జాతీయ యువజన పార్లమెంటు వేడుక’ (NYPF) లక్ష్యం. ప్రధానమంత్రి 2017 డిసెంబరు 31న తన ‘‘మన్ కీ బాత్’’ కార్యక్రమంలో వెల్లడించిన మనోభావాల స్ఫూర్తితో ఈ జాతీయ యువజన పార్లమెంటు వేడుకలకు నాంది పలికారు. ఇందులో భాగంగా ‘‘నవభారత గళంగా నిలవండి... పరిష్కారాన్వేషణతో విధాన నిర్ణయాలకు తోడ్పడండి’’ అనే ఇతివృత్తంతో 2019 జనవరి 12 నుంచి ఫిబ్రవరి 27దాకా తొలి యువజన పార్లమెంటు సమావేశాలు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 88,000 మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

   ఈ నేపథ్యంలో 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకలకు 2020 డిసెంబరు 23 నుంచి వాస్తవిక సాదృశ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల తొలిదశ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రదేశాలనుంచి 2.34 లక్షల మంది యువత పాల్గొన్నారు. అటుపైన 2021 జనవరి 1 నుంచి 5వ తేదీవరకూ రాష్ట్రస్థాయి యువజన పార్లమెంటు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం ఈ 2వ జాతీయ యువజన పార్లమెంటు తుది సమావేశాలు పార్లమెంటు సెంట్రల్ హాలులో 2021 జనవరి 11న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 29 మంది జాతీయస్థాయి విజేతలకు జాతీయ జ్యూరీ సమక్షంలో మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఈ జ్యూరీలో రాజ్యసభ సభ్యులు రూపా గంగూలీ, లోక్‌స‌భ సభ్యులు శ్రీ పర్వేష్ సాహిబ్ సింగ్, ప్రముఖ పాత్రికేయులు శ్రీ ప్రఫుల్ల కేత్కర్ సభ్యులుగా ఉన్నారు. కాగా, అగ్రస్థానంలో నిలిచిన ముగ్గురు విజేతలకు 12వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి సమక్షాన ప్రసంగించే అవకాశం లభిస్తుంది.

జాతీయ యువజనోత్సవాలు

   జాతీయ యువజన ఉత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి 12 నుంచి 16వ తేదీవరకూ సాగుతాయి. స్వామి వివేకానంద జయంతి కావడంతో ఏటా జనవరి 12ను జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తారు. కాగా, ఈ సంవత్సరం జాతీయ యువ జనోత్సవాలతో పాటు జాతీయ యువజన పార్లమంటు వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు. దేశ యువతరం ప్రతిభాపాటవాలను వెలుగులోకి తెచ్చేదిశగా వారికి ఒక వేదికను సమకూర్చడం జాతీయ యువజనోత్సవాల లక్ష్యం. ఇందులో భాగంగా ఒక సూక్ష్మ భారత దేశాన్ని సృష్టించి యువ జనుల మధ్య అధికార, అనధికార స్థాయిలో పరస్పర సంభాషణలు, సంప్రదింపులకు వీలు కల్పిస్తారు. తదనుగుణంగా వారు తమ సామాజిక, సాంస్కృతిక విశిష్టతలను పరస్పర మార్పిడి చేసుకుంటారు. తద్వారా ఈ కార్యక్రమం జాతీయ సమగ్రతను ప్రోత్సహించడంతో పాటు సామాజిక సామరస్యం, సౌభ్రాత్రాల స్ఫూర్తి నింపడమేగాక ధైర్యంతో సాహసాలవైపు నడిపేలా చేస్తుంది. మొత్తంమీద ఒకే భారతం- శ్రేష్ఠ భారతం స్ఫూర్తి, సారాంశం, భావనలకు ప్రాచుర్యం తేవడమే ఈ యువజనోత్సవాల ప్రాథమిక ధ్యేయం.

   కోవిడ్-19 మహమ్మారి కారణంగా 24వ జాతీయ యువజనోత్సవాలను వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా నిర్వహిస్తున్నారు. ఈసారి ఉత్సవాలకు ‘‘నవభారతానికి యువజనోత్సాహం’’ ఇతివృత్తంగా ఉంది. నవభారత స్వప్నాన్ని యువజనులే సాకారం చేయగలరన్నది ఈ నినాదానికి అర్థం. ఈ నేపథ్యంలో 24 వ జాతీయ యువజనోత్సవాల ప్రారంభోత్సవంతోపాటు 2వ జాతీయ యువజన పార్లమెంట్ వేడుకల ముగింపు కార్యక్రమం రెండూ 2021 జనవరి 12న పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరుగుతాయి. అటుపైన 24వ జాతీయ యువ జనోత్సవాల ముగింపు కార్యక్రమం 2021 జనవరి 16న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహిస్తారు.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow