COVID 19 అత్యవసర : రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధరల్లో భారీ తగ్గుదల, ఏ ఇంజక్షన్ ధర ఎంత

Apr 22, 2021 - 11:22
Apr 23, 2021 - 14:51
 0

దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రెమ్‌డెసివిర్ తాజా ధరలు ఇలా ఉన్నాయి..

దేశంలో కరోనా మొదటి వేవ్ కంటే రెండవ వేవ్ (Corona Second Wave)ప్రమాదకరంగా మారుతోంది. రోజులు 2 లక్షల పై చిలుకు కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గత 24 గంటల్లో అయితే 2 లక్షల 60 వేల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆక్సిజన్ సిలెండర్లు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు భారీ కొరత ఏర్పడింది. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లైతే బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయింది.

4500 లున్న ఒక్కొక్క ఇంజక్షన్ 12000 నుంచి 13000 వరకూ పలుకుతోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ( Central government) జోక్యం చేసుకుని..రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల ధరల్ని(Remdesivir Injections Prices)తగ్గించాలని కోరింది. దాంతో కొన్ని ఫార్మా కంపెనీలు స్వచ్ఛంధంగా రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధరల్ని తగ్గించుకున్నాయని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ తెలిపింది.

మరోవైపు రెమ్‌డెసివిర్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 28 లక్షల్నించి 41 లక్షలకు పెంచాలని నిర్ణయించింది.

కోవిడ్ 19 చికిత్సలో సీరియస్‌గా ఉన్న రోగులకు రెమ్‌డెసివిర్ యాంటీ వైరల్ డ్రగ్ కీలకంగా మారింది. మారిన ధరల ప్రకారం పలు కంపెనీల ఇంజక్షన్ల ధరలిలా ఉన్నాయి. క్యాడిలా హెల్త్‌కేర్ ఇంజక్షన్ ధర 2800 రెండు వేల ఎనిమిది వందల్నించి ఒక్కసారిగా 899 రూపాయలకు దిగింది. సింజెన్ ఇంటర్నేషనల్ ఇంజక్షన్ ధర 3950 రూపాయల్నించి 2450 రూపాయలకు మారింది. అటు రెడ్డి ల్యాబ్స్ ( Reddy Labs) రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర 5400 నుంచి 2700 గా మారింది. ఇక సిప్లా కంపెనీ ఇంజక్షన్ ధర 4000 నుంచి 3000 కు పడిపోయింది. మైలాన్ కంపెనీ ఇంజక్షన్ ధర 4800 లుండగా..ఇప్పుడు 3400 లకు తగ్గింది. జుబిలెంట్ ఫార్మా ఇంజక్షన్ ధర 4700 రూపాయల్నించి 3400 కు తగ్గించారు. ఇక హెటిరో ఫార్మా ( Hetero drugs) కు చెందిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర 5 వేల 4 వందల్నించి 3 వేల 490 రూపాయలకు తగ్గింది.

ఎబోలా చికిత్సలో ఉపయోగించే ఓ ఔషధం కరోనావైరస్ రోగులు కోలుకోవడానికి సహకరిస్తోందని "స్పష్టంగా" తెలుస్తోందని అమెరికా అధికారులు తెలిపారు. రోగిలో వ్యాధి లక్షణాలు కొనసాగే కాలాన్ని రెమ్‌డెసివీర్ ఔషధం 15 రోజుల నుంచి 11 రోజుల వ్యవధికి తగ్గిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

ప్రస్తుతానికి పూర్తి స్థాయి ఫలితాలను ప్రచురించనప్పటికీ, నిపుణులు మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. అంతమాత్రాన వ్యాధిని నివారించడంలో ఇదేమీ 'మ్యాజిక్ బుల్లెట్'లా పని చేయదని కూడా తేల్చి చెప్పారు. ప్రాణాలను కాపాడే శక్తి ఓ ఔషధానికి ఉన్నప్పుడు ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడమే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో కొనసాగుతున్న లాక్ డౌన్ ఎత్తివేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. రెమ్‌డెసివీర్‌గా పిలిచే ఈ మందును ప్రాథమికంగా ఎబోలా వైరస్‌కు చికిత్స చేయడానికి అభివృద్ధి చేశారు.

అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) అనే సంస్థ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మొత్తం 1,063మంది పాల్గొన్నారు. వారిలో కొందరికి ఈ ఔషధాన్ని ఇవ్వగా మరి కొందరికి ప్లేసెబో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. "గణాంకాలు బట్టి చూస్తే రెమ్‌డెసివీర్‌ మందు చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఔషధాన్ని తీసుకున్న కోవిడ్-19 రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది" అని ఎన్ఐఏఐడీ నిర్వాహకులు డాక్టర్ అంథోనీ ఫౌచీ అన్నారు. "పరిశోధన ఫలితాలను గమనిస్తే ఈ డ్రగ్ వైరస్‌ను నిరోధించే అవకాశం ఉంది.

ఓ రకంగా.. ఈ వ్యాధి సోకిన రోగులకు చికిత్స చేసే సామర్థ్యం మనకు ఉందన్న నిజానికి తలుపులు తెరచుకున్నట్టయింది" అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇది మరణాల విషయంలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు.

ప్రస్తుతం రెమ్‌డెసివీర్‌ను ఇచ్చిన వారిలో మరణాల రేటు 8% ఉండగా, ప్లెసిబో ట్రీట్‌మెంట్ ఇచ్చిన వారిలో మరణాల రేటు 11.6% ఉంది. అయితే గణాంకాల పరంగా చూస్తుంటే ఇది చెప్పుకోదగ్గ ప్రభావం చూపిస్తున్నట్టు కనిపించడం లేదు. శాస్త్రవేత్తలు కూడా ఈ తేడా ఎంతవరకు నిజం అన్నది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే కోలుకుంటున్న రోగుల్ని మరింత వేగంగా కోలుకునేలా సహకరిస్తోందా? ఐసీయూ చికిత్స అవసరం లేకుండా రోగుల్ని కాపాడుతోందా? యువకుల్లో లేదా వృద్ధుల్లో ఎవరి విషయంలో ఈ మందు మెరుగ్గా పని చేస్తుంది?

ఇతర వ్యాధులతో బాధపడే వారిలో బాగా పని చేస్తుందా? లేదంటే ఏ వ్యాధి లేని వారిలో బాగా పని చేస్తుందా? శరీరంలో వైరస్ ముదురుతుందని తెలిసినప్పుడు రోగులకు ముందుగానే చికిత్స చేయాలా? ప్రాణాలను కాపాడటంతో పాటు లాక్ డౌన్ ఎత్తివేయడానికి కూడా సాయం చేసే జంట ప్రయోజనాలు ఉన్న ఔషధం గురించి పూర్తి వివరాలు వెల్లడించే ముందు ఈ ప్రశ్నలన్నీ చాలా ముఖ్యమైనవి.

"ఈ ఔషధాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చే ముందు ఆ గణాంకాలను, ఫలితాలను సంబంధిత యంత్రాంగం సమీక్షించి, అసలు ఆ మందు తయారీకి అనుమతి ఇవ్వచ్చా లేదా అన్నది నిర్ణయించాలి. అలాగే, వివిధ దేశాల్లో సంబంధిత ఆరోగ్య శాఖాధికారులు ఆ మందు పనితీరుపై ఓ అంచనాకు రావాలి" అని యూరోపియన్ యూనియన్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఎంఆర్‌సీ క్లినికల్ ట్రయల్స్ యూనిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ మహేశ్ పార్మర్ అభిప్రాయపడ్డారు. ఐసీయూల అవసరాన్ని ఏదైనా మందు ఆపగల్గితే ఆస్పత్రులపై భారం తగ్గుతుంది. క్రమంగా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

"మేం పూర్తి ఫలితాలను ఇంకా పరిశీలించాల్సి ఉంది. కానీ ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కచ్చితంగా తేలితే మాత్రం కోవిడ్-19పై చేస్తున్న పోరాటంలో ఇదో గొప్ప వార్త అని చెప్పవచ్చు" అని కోవిడ్-19 ఔషధాల విషయంలో ప్రపంచంలోనే భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ పీటర్ హార్బీ అన్నారు. పూర్తి స్థాయిలో గణాంకాలను సేకరించి రెమ్‌డెసివీర్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో నిష్పక్షపాతంగా పనిచేయడమే తరువాత చేయాల్సిన పని అని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే అమెరికాలో రెమ్‌డెసివీర్‌ విషయంలో జరిగిన పరిశోధనలు బయటపడిన ఇదే సమయంలో ఈ మందు సరిగ్గా పని చేయడం లేదని ఈ ఔషధంపై ఇప్పటికే పరిశోధనలు నిర్వహించిన చైనాలోని లాన్సెట్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. అయితే వుహాన్‌లో లాక్ డౌన్ విజయవంతం కావడంతో అక్కడ ప్రస్తుతం రోగులెవరూ లేరు. దీంతో ఈ పరిశోధన అసంపూర్తిగా మిగిలిపోయింది. "ఈ గణాంకాలు నమ్మదగ్గవిగానే ఉన్నాయి.

ప్రస్తుతం కోవిడ్-19కు ఎలాంటి కచ్చితమైన చికిత్స లేదు. ఈ సమయంలో రెమ్‌డెసివీర్‌ వినియోగానికి వీలైనంత త్వరగా అనుమతులు పొందితే కరోనావైరస్ చికిత్సకు సహాయపడవచ్చు" అని ప్రొఫెసర్ బాబక్ జావెద్ అన్నారు. ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ హాస్పటల్స్‌కు చెందిన ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు.

"అయితే, రెమ్‌డెసివీర్ మ్యాజిక్ బుల్లెట్ కాదన్న విషయాన్ని కూడా ఇది చెబుతోంది. మొత్తంగా దీనివల్ల 30శాతం వరకూ మాత్రమే ప్రయోజనం ఉండొచ్చు" అని జావెద్ చెప్పుకొచ్చారు. కోవిడ్-19 చికిత్స కోసం పరిశోధనలు చేస్తున్న మందుల్లో మలేరియా, హెచ్ఐవీకి చెందిన ఔషధాలు కూడా ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేసే వైరస్‌పై, దాని సమ్మేళనాలపై దాడి చేయగలవు. వ్యాధిపై మొదటి దశల్లో యాంటీ వైరల్ డ్రగ్స్ ప్రభావవంతంగా పని చేసినా, తర్వాత దశల్లో ఇమ్యూన్ డ్రగ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow