2021-22 బడ్జెట్ సారాంశం

ఆర్థిక మంత్రిత్వ శాఖ

Feb 1, 2021 - 23:21
 0
2021-22 బడ్జెట్ సారాంశం
Summary of the Budget 2021-22 india telugu

కేంద్ర బడ్జెట్ 2021-2022

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2021-22 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఇది ఈ కొత్త దశాబ్దం యొక్క మొదటి బడ్జెట్ మరియు కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో అపూర్వమైన మరియు డిజిటల్ బడ్జెట్‌ కూడా. ఆత్మనిర్భర్ భారత్ సాధనపై దృష్టి పెట్టిన ఆమె..130 కోట్ల మంది భారతీయుల సామర్థ్యాలు, నైపుణ్యాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తీకరణ ఇది అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు సంకల్ప్ ఆఫ్ నేషన్ ఫస్ట్, రైతులకు రెట్టింపు ఆదాయం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన భారతదేశం, సుపరిపాలన, యువతకు అవకాశాలు, అందరికీ విద్య, మహిళా సాధికారత మరియు సమగ్ర అభివృద్ధి వంటివి మరింత బలోపేతం అవుతాయని ఆమె అన్నారు. అదనంగా మరియు వేగంగా అమలు చేసే మార్గంలో కూడా 2015-16 బడ్జెట్ యొక్క 13 వాగ్దానాలు ఉన్నాయి- ఇవి 2022 నాటికి మనదేశానికి  స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్ నాటికి కార్యరూపం దాల్చుతాయి. అలాగే అవి ఆత్మనిర్భర్‌ భారత్‌ను కూడా ప్రతిధ్వనిస్తాయి అని ఆమె తెలిపారు.

6 మూలస్తంభాలపై ఆధారపడి 2021-22 బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి.

1. ఆరోగ్యం మరియు శ్రేయస్సు

2. భౌతిక & ఆర్థిక మూలధనం మరియు మౌలిక సదుపాయాలు

3. యాస్పిరేషనల్ ఇండియా కోసం సమగ్ర అభివృద్ధి

4. మానవ మూలధనాన్ని పునరుజ్జీవింపచేయడం

5. ఆవిష్కరణలు మరియు పరిశోధన, అభివృద్ధి

6. కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలన

1. ఆరోగ్యం మరియు శ్రేయస్సు

ఆరోగ్య మౌలిక సదుపాయాల పెట్టుబడులలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం బడ్జెట్ వ్యయం బిఈ 2021-22లో రూ .2,23,846 కోట్లు. బడ్జెట్ ఇయర్ 94,452 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 137 శాతం పెరుగుదల.

6 సంవత్సరాలలో సుమారు రూ.64,180 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం పిఎం ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజనను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రాధమిక, ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే ఉన్న జాతీయ సంస్థలను బలోపేతం చేస్తుంది. మరియు కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న వ్యాధులను గుర్తించడానికి నయం చేయడానికి కొత్త సంస్థలను సృష్టిస్తుంది. ఇది జాతీయ ఆరోగ్య మిషన్‌కు అదనంగా ఉంటుంది. పథకం కింద ప్రధాన ఆంశాలు:

  • ఎ. 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలకు మద్దతు.
  • బి. అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు, 11 రాష్ట్రాల్లో 3382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేయడం;
  • సి. 602 జిల్లాలు మరియు 12 కేంద్ర సంస్థలలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాకులను ఏర్పాటు చేయడం;
  • డి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి)తో పాటు దాని 5 ప్రాంతీయ శాఖలు మరియు 20 మెట్రోపాలిటన్ హెల్త్ విభాగాల బలోపేతం;
  • ఇ. అన్ని ప్రజారోగ్య ప్రయోగశాలలను అనుసంధానించడానికి అన్ని రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ విస్తరణ;
  • ఎఫ్. 32 కొత్త విమానాశ్రయాలు, 11 నౌకాశ్రయాలు మరియు 7 ల్యాండ్ క్రాసింగ్ల వద్ద ఉన్న 17 కొత్త ప్రజారోగ్య యూనిట్ల నిర్వహణ మరియు ప్రస్తుత ఉన్న 33 పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఎంట్రీ పాయింట్ల వద్ద బలోపేతం చేయడం;
  • జి. 15 ఆరోగ్య అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు మరియు 2 మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం; మరియు
  • హెచ్ . వన్ హెల్త్ కోసం ఒక జాతీయ సంస్థను, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ కోసం ప్రాంతీయ పరిశోధనా వేదిక, 9 బయో-సేఫ్టీ లెవల్ III ప్రయోగశాలలు మరియు 4 ప్రాంతీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైరాలజీల ఏర్పాటు.

టీకాలు

2021-22 బడ్జెట్‌ సంవత్సరంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం రూ .35,000 కోట్లు కేటాయించారు.

ప్రస్తుతం కేవలం 5 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అయిన న్యుమోకాకల్ వ్యాక్సిన్ ఏటా 50,000 మంది పిల్లల మరణాలను నివారించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా విడుదల చేయబడుతుంది.

పోషణ

పోషక ఉత్పత్తుల పెంపుదల, సరఫరా ,ఔట్రీచ్‌ మరియు ఫలితాన్ని బలోపేతం చేయడానికి, ప్రభుత్వం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మరియు పోషాన్ అబియాన్‌ను విలీనం చేస్తుంది. మరియు మిషన్ పోషన్ 2.0 ను ప్రారంభిస్తుంది. 112 జిల్లాలలో పోషక ఫలితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం వ్యూహాన్ని అనుసరిస్తుంది.


నీటి సరఫరా మరియు స్వచ్ఛ భారత్ మిషన్ యూనివర్సల్ కవరేజ్

2.86 కోట్ల నివాసాల్లో కుళాయి కనెక్షన్లతో పాటు మొత్తం 4,378 పట్టణ స్థానిక సంస్థలలో సార్వత్రిక నీటి సరఫరాతో పాటు 500 అమృత్‌ నగరాల్లో ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ కోసం జల్‌జీవన్‌ మిషన్ (పట్టణ) ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.2,87,000 కోట్ల రూపాయలతో ఇది 5 సంవత్సరాలు అమలు చేయబడుతుంది.  అంతేకాకుండా అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2021-2026 నుండి 5 సంవత్సరాల కాలంలో మొత్తం రూ .1,41,678 కోట్ల ఆర్థిక కేటాయింపుతో అమలు చేయబడుతుంది.  వాయు కాలుష్యం కారణంగా తలెత్తున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో 10 లక్షలకు మించి జనాభా ఉన్న 42 పట్టణాలకు 2,217 కోట్లు కేటాయించింది.  పాత మరియు అనర్హమైన వాహనాలను తొలగించడానికి స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానాన్ని కూడా ప్రకటించారు. వ్యక్తిగత వాహనాల విషయంలో 20 సంవత్సరాల తరువాత, మరియు వాణిజ్య వాహనాల విషయంలో 15 సంవత్సరాల తరువాత ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ కేంద్రాల్లో వాటికి ఫిట్‌నెస్ పరీక్షలు ప్రతిపాదించబడ్డాయి.

భౌతిక-ఆర్థిక మూలధనం.. మౌలిక సదుపాయాలు

ఆత్మనిర్భర భారత్ - ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం

   ఆర్థికశాఖ మంత్రి పేర్కొన్న ప్రకారం... భారతదేశం 5 లక్షల కోట్ల అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందాలంటే మన ఉత్పాదక రంగం సుస్థిర ప్రాతిపదికన రెండంకెల స్థాయి వృద్ధితో ఎదగాలి. మన వస్తూత్పత్తి కంపెనీలు అంతర్జాతీయ సరఫరా శృంఖలాల్లో ఒక సమగ్ర భాగం కావాలి. ఇందుకోసం కీలక సామర్థ్యాలు, అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉండాలి. ఇవన్నీ సాధించడానికి, ఆత్మనిర్భర భారత్ దిశగా అంతర్జాతీయ స్థాయి వస్తూత్పత్తి దిగ్గజాలను సృష్టించడానికి 13 రంగాల కోసం ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలు ప్రకటించబడ్డాయి. ఇందుకోసం ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు రమారమి రూ.1.97 లక్షల కోట్లు కేటాయించనుంది. ఈ చొరవతో కీలక రంగాల స్థాయి, పరిమాణం పెరగడానికి, అంతర్జాతీయ స్థాయి దిగ్గజాల సృష్టి, అభివృద్ధిసహా మన యువతరానికి ఉపాధి కల్పించడానికి మార్గం సుగమం కాగలదు.

జౌళిరంగం

   అదేవిధంగా జౌళి రంగం అంతర్జాతీయస్థాయిలో పోటీపడే స్థాయికి ఎదిగి, భారీ పెట్టుబడులను ఆకర్షంచడంతోపాటు ఉపాధి సృష్టికి ఊపునివ్వడం లక్ష్యంగా పీఎల్ఐ పథకాలకు అదనంగా ‘మెగా పెట్టుబడుల జౌళి పార్కులు’ (మిత్ర) పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. అంతర్జాతీయ ఎగుమతి దిగ్గజాల రూపకల్పన దిశగా తక్షణ వినియోగ సౌలభ్యంగల ప్రపంచస్థాయి మౌలిక వసతుల సృష్టి సాధ్యం కాగలదు. ఈ 7 జౌళి పార్కులు మూడేళ్ల వ్యవధిలో ఏర్పాటవుతాయి.

మౌలిక సదుపాయాలు

   ఆర్థికశాఖ మంత్రి 2019 డిసెంబరులో ‘‘జాతీయ మౌలిక సదుపాయాల సమాహారం’’ (ఎన్ఐపీ) గురించి ప్రకటించారు. ఇది ఎన్నడూ ఎరుగనిరీతిలో ప్రభుత్వం మొత్తం పాలుపంచుకునే తొట్టతొలి బృహత్ కార్యక్రమం. ‘ఎన్ఐపీ’కి శ్రీకారం చుట్టినపుడు 6,835 ప్రాజెక్టులు ప్రారంభం కాగా, నేడు 7,400 ప్రాజెక్టులకు అది విస్తరించబడింది. వీటిలో వివిధ మంత్రిత్వశాఖల పరిధిలోగల రూ.1.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి.

మౌలిక సదుపాయాలకు ఆర్థిక తోడ్పాటు - ప్రగతి ఆర్థిక సహాయ సంస్థ (డీఎఫ్ఐ)

   మౌలిక సదుపాయాల రంగంపై శ్రీమతి సీతారామన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ- మౌలిక సదుపాయాల కల్పనకు దీర్ఘకాలిక రుణ సదుపాయం అవసరమని చెప్పారు. ఆ మేరకు ఆర్థిక తోడ్పాటు దిశగా ‘రుణ కల్పన, సుసాధ్యత, ఉత్ప్రేరక’ కర్తవ్యాలను వృత్తి నైపుణ్యంతో నిర్వహించగల ప్రగతి ఆర్థిక సహాయ సంస్థ (డీఎఫ్ఐ) అవసరం. తదనుగుణంగా ‘డీఎఫ్ఐ’ ఏర్పాటు కోసం ఒక బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం దీనికి రూ.20,000 కోట్ల మూలధనం కేటాయిస్తున్నట్లు  ప్రకటించింది. అలాగే రాబోయే మూడేళ్ల కాలంలో డీఎఫ్ఐ కనీసం రూ.5 లక్షల కోట్ల రుణవితరణ సామర్థ్యం సంతరించుకోవాలని ఆకాంక్షిస్తోంది.

ఆస్తుల ద్రవ్యీకరణ

   నవ్య మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటు కోసం వినియోగానికి వీలున్న ప్రభుత్వ మౌలిక సదుపాయ ఆస్తుల ద్రవ్యీకరణ చాలా ముఖ్యం. ఆ మేరకు సద్వినియోగం చేసుకునే వీలున్న మౌలిక వసతుల ఆస్తులను వాడుకునే దిశగా ‘‘జాతీయ ద్రవ్యీకరణ సమాహారం’’ (ఎన్ఎంపీ) పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే దీని పనితీరు ప్రగతిపై పర్యవేక్షణతోపాటు పెట్టుడిదారులకు మార్గదర్శనం కోసం ‘ఆస్తుల ద్రవ్యీకరణ డాష్ బోర్డు’ను ఏర్పాటు చేస్తుంది. ఈ దిశగా కొన్ని ముఖ్యమైన చర్యలు కిందివిధంగా ఉంటాయి:

  • అ. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  (పీజీసీఐఎల్) చెరొక మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ (InvIT-ఇన్విట్)ను ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థాగత పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కృషి చేస్తాయి. ఆ మేరకు ప్రస్తుతంనిర్వహణలోగల రూ.5,000 కోట్ల అంచనా వాణిజ్య విలువగల ఐదు రహదారులు ‘ఎన్‌హెచ్ఏఐ-ఇన్విట్’కు, అలాగే రూ.7,000 కోట్ల విలువైన విద్యుత్ సరఫరా ఆస్తులు ‘పీజీసీఐఎల్-ఇన్విట్’కు బదిలీ చేయబడతాయి.
  • ఆ. ఇదే తరహాలో ‘ప్రత్యేక సరకు రవాణా రైలుమార్గాలు’ పూర్తిచేయడంతోపాటు వాటి నిర్వహణ, కార్యకలాపాల ద్వారా సదరు ఆస్తుల ద్రవ్యీకరణ బాధ్యతను రైల్వేలు స్వీకరిస్తాయి.
  • ఇ. అలాగే తదుపరి దశలో కార్యకలాపాలు, నిర్వహణ రాయితీల కోసం విమానాశ్రయాల ద్రవ్యీకరణ సాగుతుంది.
  • ఈ. ఆస్తుల ద్రవ్యీకరణ కార్యక్రమం కోసం కేటాయించే ప్రధాన మౌలిక సదుపాయాల ఆస్తుల జాబితాలో-
  1. (i) ‘ఎన్‌హెచ్ఏఐ’ టోల్ రహదారులు
  2. (ii) ‘పీజీసీఐఎల్’ విద్యుత్ సరఫరా ఆస్తులు
  3. (iii) ‘గెయిల్, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్‌’కు చెందిన గ్యాస్ పైప్‌లైన్‌లు
  4. (iv) ఏఏఐ పరిధిలోగల 2వ, 3వ అంచె నగరాల్లోని విమానాశ్రయాలు
  5. (v) ఇతర రైల్వే మౌలిక సదుపాయాల ఆస్తులు
  6. (vi) కేంద్ర గిడ్డంగుల సంస్థ, నాఫెడ్ తదితర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకుగల గోదాము సంబంధిత ఆస్తులు
  7. (vii) క్రీడా మైదానాలు వంటివి ఉన్నాయి.

రోడ్లు - ప్రధాన రహదారులు

   మొత్తం రూ.5.35 లక్షల కోట్లతో చేపట్టిన ‘భారతమాల పరియోజన’ ప్రాజెక్టు కింద రూ.3.3 లక్షల కోట్లతో 13,000 కిలోమీటర్లకుపైగా రోడ్ల నిర్మాణ పనులు అప్పగించామని ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. వీటిలో ఇప్పటికే 3,800 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు ఆమె వెల్లడించారు. మరోవైపు 2020 మార్చినాటికి ప్రభుత్వం మరో 8,500 కిలోమీటర్ల పనులను అప్పగించనుండగా, 11,000 కిలోమీటర్ల అదనపు జాతీయ రహదారి కారిడార్లు పూర్తికాగలవని చెప్పారు. దీంతోపాటు రోడ్ల మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఆర్థిక కారిడార్లపై ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రోడ్లు-రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు ఆమె రూ.1,18,101 లక్షల కోట్లదాకా కేటాయింపులు పెంచారు. ఇందులో ఇదివరకెన్నడూ లేనిరీతిలో రూ.1,08,230 కోట్లు మూలధనం కింద కేటాయించబడింది.

రైల్వే మౌలిక సదుపాయాలు

   భారతీయ రైల్వేలు ‘‘భారత జాతీయ రైలు ప్రణాళిక-2030’’ను రూపొందించాయి. దేశంలో 2030కల్లా ‘‘భవిష్యత్ సంసిద్ధ’’ రైల్వే వ్యవస్థ రూపకల్పనే ఈ ప్రణాళిక లక్ష్యం. ముఖ్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’కు తగినట్లుగా పారిశ్రామిక రంగానికి రవాణా వ్యయం తగ్గించడమే ఈ ప్రణాళికలో ప్రధాన వ్యూహం. మరోవైపు 2022 జూన్ నాటికి పశ్చిమ, తూర్పు ‘ప్రత్యేక సరకు రవాణా మార్గాలు’ (డీఎఫ్‌సీ) ప్రారంభం కాగలవని అంచనా.

   ఇక ప్రయాణికుల సదుపాయాలు, భద్రత దిశగా కింది చర్యలు ప్రతిపాదించబడ్డాయి:

  • అ. పర్యాటకులకు మెరుగైన ప్రయాణానుభవం కోసం సుందరంగా రూపొందించిన ‘విస్టా డోమ్ ఎల్‌హెచ్‌బీ’ బోగీలను ప్రవేశపెట్టడం
  • ఆ. రైల్వేశాఖ తీసుకున్న భద్రత చర్యలు కొన్నేళ్లుగా సత్ఫలితాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత పటిష్ఠం చేసేదిశగా అధిక సాంద్రత, అధిక వినియోగంలోగల రైళ్ల రాకపోకల నెట్‌వ‌ర్క్‌ పరిధిలో మానవ తప్పిదం వల్ల రైళ్లు ఢీకొనే ముప్పు నివారణకు చర్యలు చేపడుతుంది. ఈ మేరకు దేశీయంగా అభివృద్ధి చేసిన స్వయంచాలక రక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.
  • ఇ. ప్రస్తుత కేంద్ర బ‌డ్జెట్‌లో రైల్వేశాఖకు రూ.1,10,055 లక్షల కోట్లు కేటాయించగా, ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయించబడింది.

పట్టణ మౌలిక సదుపాయాలు

   పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ రవాణా సదుపాయాల వాటా పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మెట్రోరైలు నెట్‌వర్క్ విస్తరణసహా సిటీ బస్సుల సేవలను పెంచాలని నిర్ణయించింది. తదనుగుణంగా ప్రభుత్వ సదుపాయాలు, సిటీ బస్సుల సేవల పెంపు నిమిత్తం రూ. 18,000 కోట్లతో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.

  దేశంలో ప్రస్తుతం 702 కిలోమీటర్ల మేర సంప్రదాయక మెట్రో రైలు సదుపాయం ఉండగా, మరో 27 నగరాల్లో ఇప్పుడు 1,016 కిలోమీటర్ల మేర మెట్రోసహా ‘ఆర్‌ఆర్‌టీఎస్’ పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. దీంతోపాటు 1వ అంచె నగరాల శివార్లకు, 2వ అంచె నగరాల్లో మరింత తక్కువ ఖర్చుతో ఇదేతరహా ప్రయాణానుభవం కల్పించే మెట్రో రైలు వ్యవస్థలను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ‘మెట్రో లైట్’, ‘మెట్రో నియో’ పేరిట రెండు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల‌ను వినియోగిస్తుంది.

విద్యుత్ మౌలిక సదుపాయాలు

   గడచిన ఆరేళ్లలో విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడంతోపాటు ఎన్నో విజయాలు నమోదయ్యాయి. ఆ మేరకు 139 గిగావాట్ల మేరకు అదనపు ఉత్పాదక సామర్థ్యం జోడించబడింది. అలాగే అదనంగా 1.41 లక్షల కిలోమీటర్ల మేర సరఫరా లైన్లను విస్తరించగా, 2.8 కోట్ల అదనపు నివాసాలకు విద్యుత్ సరఫరా సదుపాయం కల్పించబడింది.

   ఈ నేపథ్యంలో పంపిణీ కంపెనీ (డిస్కమ్)ల నిర్వహణ సాధ్యతపై ఆర్థికశాఖ మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఫలితాలతో అనుసంధానించిన పునర్నవీకృత సంస్కరణలతో కూడిన విద్యుత్ పంపిణీరంగ పథకాన్ని ప్రవేశపెడతామని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఐదేళ్ల కాలానికిగాను రూ.3,05,984 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మెరుగుదలతో ముడిపడిన ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, వ్యవస్థల ఉన్నతీకరణ, ఫీడర్ల విభజన, తదితర మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఈ పథకం డిస్కమ్‌లకు తోడ్పడుతుంది.

రేవులు.. నౌకాయానం.. జలమార్గాలు

   ప్రధాన రేవులు ప్రస్తుతం స్వయంగా నిర్వహణ బాధ్యతలు వహిస్తుండగా, నేడు తమ కోసం ప్రైవేటు భాగస్వాములు ఆ కార్యకలాపాలను నిర్వహించే దిశగా అడుగు వేస్తున్నాయి. ఇందుకోసం 21-22 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన రేవుల ద్వారా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్థతిలో పెట్టుబడుల కోసం బ‌డ్జెట్‌లో రూ.2,000 కోట్లకుపైగా కేటాయించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

   భారతదేశంలో కొత్త వాణిజ్య నౌకల సముద్ర ప్రవేశాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర మంత్రిత్వశాఖలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయ టెండర్లలో పాల్గొనడం కోసం భారతీయ నౌకా కంపెనీలను సబ్సిడీద్వారా ప్రోత్సహించే పథకం ప్రారంభించబడుతుంది. దీనికోసం ఐదేళ్లలో ప్రభుత్వం రూ.1624 కోట్లు కేటాయించనుంది. ఈ చొరవతో భారత నావికా సిబ్బందికి మరింత శిక్షణ, ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు అంతర్జాతీయ నౌకాయానంలో భారతీయ కంపెనీల వాటా పెరుగుతుంది.

పెట్రోలియం - సహజవాయువు

   కోవిడ్-19 దిగ్బంధం సమయంలో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సజావుగా సాగిపోయేలా ప్రభుత్వం కృతకృత్యమైందని శ్రీమతి సీతారామన్ చెప్పారు. ప్రజా జీవనంలో ఈ రంగం ఎంతో కీలకమైనందున కింద పేర్కొన్న కీలక చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు:

  • అ. నేడు 8 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందిన ‘ఉజ్వల’ పథకాన్ని కోటిమందికి విస్తరణ
  • ఆ. రాబోయే మూడేళ్లలో నగర గ్యాస్ పంపిణీ నెట్‌వ‌ర్క్‌ మరో 100 జిల్లాలకు విస్తరణ
  • ఇ. కేంద్రపాలిత జ‌మ్ముక‌శ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్‌ ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతుంది.
  • ఈ. వివక్షకు తావులేని సార్వత్రిక లభ్యత ప్రాతిపదికన అన్ని సహజవాయు పైప్‌లైన్ల పరిధిలో సాధారణ రవాణా సామర్థ్యం బుకింగుకు సౌలభ్యం, సమన్వయం కోసం స్వతంత్ర గ్యాస్ రవాణా వ్యవస్థ నిర్వహణ సంస్థ ఏర్పాటు చేయబడుతుంది.

ఆర్థిక మూలధనం

   సెక్యూరిటీ మార్కెట్లకు సంబంధించి హేతుబద్ధ ఏకరూప ‘సెక్యూరిటీల విపణి స్మృతి’ (సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్)ను తేవాలన ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ‘సెబీ చట్టం-1992, డిపాజిటరీల చట్టం-1996, సెక్యూరిటీల కాంట్రాక్టుల (నియంత్రణ) చట్టం-1956, ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం-2007’లను ఏకీకృతం చేయాలని ఆర్థికశాఖ మంత్రి ప్రతిపాదించారు. తదనుగుణంగా ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సీ’ (GIFT-IFSC)లో అంతర్జాతీయ స్థాయి ‘‘ఆర్థిక-సాంకేతిక’’ కూడలిని అభివృద్ధి చేసేందుకు మద్దతివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.

బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు

   బీమా రంగంలో విదేశీ సంస్థాగత పెట్టుబడి (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంపుసహా కొన్ని జాగ్రత్తలతో విదేశీ యాజమాన్యం/నియంత్రణను అనుమతించేలా ‘బీమా చట్టం-1938’ని సవరించాలని కూడా ఆమె ప్రతిపాదించారు. ఆ మేరకు పాలక మండలిలో డైరెక్టర్లతోపాటు కీలక నిర్వహణ స్థానాల్లో భారతదేశంలో నివసించే పౌరులే అధిక సంఖ్యలో ఉండాలి. అంతేగాక డైరెక్టర్లలో 50 శాతం స్వతంత్రులే ఉండటంసహా లాభాల్లో నిర్దేశిత శాతాన్ని సాధారణ నిధి కింద ఉంచాలి.

పెట్టుబడుల ఉపసంహరణ - వ్యూహాత్మక విక్రయం

   కోవిడ్-19 పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యూహాత్మక విక్రయాలపై ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తూనే ఉంది. ఈ మేరకు ‘బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవనహన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్’ తదితర సంస్థల విక్రయం 2021-22నాటికి పూర్తికాగలదని ఆర్థికశాఖ మంత్రి చెప్పారు. ఇక ఐడీబీఐ బ్యాంకు కాకుండా 2021-22లో మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు.

   మరోవైపు జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో వాటా విక్రయంపై ‘ఐపీఓ’ను కూడా 2021-22లో ప్రభుత్వం అమలు చేస్తుందని, దీనికి సంబంధించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే తగు సవరణలు తెస్తామని ప్రకటించారు.

   ఇవే కాకుండా ఆర్థికశాఖ మంత్రి అత్యంత ముఖ్యమైన ప్రకటన ఒకటి చేశారు. ఈ మేరకు ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానం తీసుకొస్తామని, ఇందుకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. వ్యూహాత్మక/వ్యూహాత్మకేతర రంగాల్లనూ పెట్టుబడుల ఉపసంహరణకు ఈ విధానం విస్పష్ట మార్గ ప్రణాళికను నిర్దేశిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా వ్యూహాత్మకమైన నాలుగు రంగాల్లో కనీస సంఖ్యలో మాత్రమే ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహిస్తూ, మిగిలినవిసహా వ్యూహాత్మేకతర సంస్థలను ప్రైవేటీకరించాలని లేదా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ విధానం అమలును వేగిరపరచడంలో భాగంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల తదుపరి జాబితా రూపకల్పనకు నీతి ఆయోగ్ ఉపక్రమిస్తుందని ఆమె వివరించారు. మొత్తంమీద 2020-21 బడ్జెట్ అంచనాల (బీఈ) మేరకు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్లు రాబట్టగలమని ప్రభుత్వం లెక్కలు వేసింది.

3. ఆకాంక్షల‌ భార‌తావ‌నికై స‌మ్మిళిత అభివృద్ధి..

ఆకాంక్ష భార‌త‌పు స‌మ్మిళిత అభివృద్ధికి గాను వ్య‌వసాయం, అనుబంధ రంగాలు, రైతుల సంక్షేమం, గ్రామీణ భారతదేశం, వలస కార్మికులు, శ్రమ, ఆర్థిక చేరికలకు త‌గిన‌ ర‌క్ష‌ణ క‌ల్పించేలా ఆర్థిక మంత్రి ప్రకట‌నలు చేశారు.

వ్య‌వ‌సాయం

వ్యవసాయ‌మే ఆధారంగా నివ‌సిస్తున్న‌ రైతుల సంక్షేమానికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర (ఎంఎస్‌పీ) అందించే విష‌య‌మై ఇటీవ‌ల కాలంలో గ‌ణనీయ‌మైన మార్పులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దేశఃలో వ్య‌వ‌సాయోత్ప‌త్తుల ఎంఎస్‌పీ వ్య‌యం కంటే కనీసం 1.5 రెట్లు మేర‌ అధికంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మైంది. వ్య‌వ‌సాయోత్ప‌త్తుల సేక‌ర‌ణ కూడా స్థిర వేగంతో పెరుగుతూ వ‌స్తోంది. దీంతో మ‌న‌ రైతులకు చెల్లింపులు కూడా గణనీయంగా పెరిగాయి. గోధుమల సేక‌ర‌ణ విష‌యమే తీసు‌కుంటే 2013-2014లో ఈ రైతులకు చెల్లించిన మొత్తం రూ.33,874 కోట్లు. 2019-2020 వ‌చ్చేస‌రికి ఇది రూ.62,802 కోట్ల‌కు చేరింది. 2020-2021లో ఇది మ‌రింత మెరుగుప‌డి రైతులకు చెల్లించిన మొత్తం రూ.75,060 కోట్ల‌కు చేరుకుంది. 2019-20లో 35.57 లక్షలతో పోలిస్తే 2020-21లో లబ్ధి పొందిన గోధుమల రైతుల సంఖ్య 43.36 లక్షలకు పెరిగింది.

వరి పంట‌ విష‌యానికి వ‌స్తే ..

ఈ పంట వేసిన రైతుల‌కు 2013-14లో చెల్లించిన మొత్తం రూ.63,928 కోట్లుగా ఉంది. 2019-2020లో ఇది దాదాపు రూ.1,41,930 కోట్లకు పెరిగింది. 2020-2021లో ఇది మరింతగా పెరిగి రూ.172,752 కోట్ల‌కు చేరింది. రైతుల ప్రయోజనం 2019-20లో 1.24 కోట్ల నుండి 2020-21లో 1.54 కోట్లకు పెరిగింది. అదే పంథాలో, పప్పు ధాన్యాల విషయానికి వ‌స్తే..  2013-2014లో చెల్లించిన మొత్తం రూ.236 కోట్ల నుంచి 2019-20 నాటికి రూ.8,285 కోట్ల‌కు చేరింది. ఇప్పుడు, తాజాగా 2020-2021లో ఇది రూ.10,530 కోట్లుగా నిలిచింది. 2013-14తో పోలిస్తే ఇది దాదాపు 40 రెట్లు ఎక్కువ. పత్తి రైతులకు చెల్లింపులు 2013-14లో రూ.90 కోట్లుగా ఉండ‌గా ఇది ప్ర‌స్తుతం (2021 జనవరి 27 నాటికి) గ‌ణ‌నీయంగా పెరిగి రూ.25,974కోట్ల‌కు చేరుకుంది.

ఈ సంవత్సరం ఆరంభంలో గౌరవ ప్రధానమంత్రి స్వామిత్వా పథకాన్ని ప్రారంభించారు. దీని కింద గ్రామాల్లోని ఆస్తి యజమానులకు రికార్డు హక్కులివ్వ‌నున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,241 గ్రామాల్లో సుమారు 1.80 లక్షల మంది ఆస్తి యజమానులకు కార్డులు అందించారు.

2021- 2022 ఆర్థిక సంవ‌త్స‌ర‌ మధ్యకాలంలో దీనిని అన్ని రాష్ట్రాలు/ కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను కవర్ చేయడానికి వీలుగా విస్తరించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. మన రైతులకు తగిన రుణ స‌దుపాయాన్ని అందుబాటులో ఉంచేందుకు గాను , ప్రభుత్వం వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2022 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.16.5 లక్షల కోట్లుగా నిర్ధారించింది. దీనికి తోడు కేంద్రం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధికి కేటాయింపుల‌ను రూ.30,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల‌కు పెంచింది. నాబార్డ్ కింద రూ.5 వేల కోట్ల కార్పస్‌తో ఏర్పాటు చేసిన మైక్రో ఇరిగేషన్ ఫండ్‌ను రెట్టింపు చేయాల‌ని నిర్ణ‌యించారు. వ్యవసాయం, అనుబంధ ఉత్పత్తులు మరియు వాటి ఎగుమతుల్లో విలువ పెరుగుదలను పెంచేలా ఒక కీల‌క‌ ప్రకటన చేయ‌డ‌మైంది.

ప్రస్తుతం టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలకు వర్తింప చేస్తున్న‌ ‘ఆపరేషన్ గ్రీన్ స్కీమ్’ పరిధిని మ‌రో 22 త్వ‌ర‌గా పాడైపోయే స్వ‌భావం క‌లిగిన ఉత్పత్తులకూ వ‌ర్తింపజేసేలా విస్తరించబడ‌నుంది. ఈ-నామ్‌లో సుమారు 1.68 కోట్ల మంది రైతులు నమోదు అయ్యారు, రూ.1.14 లక్షల కోట్ల మేర వాణిజ్యం జ‌రుగ‌నుంది. వ్యవసాయ మార్కెట్లోకి ఈ-నామ్ తెచ్చిన పారదర్శకత మరియు పోటీతత్వాన్ని దృష్టిలో ఉంచుకుని.. మరో 1,000 మండిలు ఈ-నామ్‌తో అనుసంధానం చేస్తాం. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధులు ఏపీఎంసీలకు వారి మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం అందుబాటులో ఉంచబడతాయి.

మత్స్య సంప‌ద‌

దేశంలో ఆధునిక ఫిషింగ్ హార్బర్స్, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల అభివృద్ధికి త‌గిన పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్, పెటుఘాట్ల‌ను తొల‌త 5 ప్రధాన ఫిషింగ్ నౌకాశ్రయాలుగా చేసి వాటిని ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా అభివృద్ధి చేయబడతాయి.

వలస కార్మికులు, ప‌నివారు..

దేశంలో ఎక్క‌డైనా ల‌బ్ధిదారులు త‌మ రేష‌న్‌ను క్ల‌యిమ్ చేసుకొనేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ప‌థ‌కం 32 రాష్ట్రాలు, యుటీల‌లో అమలులో ఉంది. 69 కోట్ల మంది లబ్ధిదారులకు చేరువైంది. అంటే ఇది మొత్తం లబ్ధిదారుల‌లో 86 శాతానికి స‌మానం. మిగిలిన 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ రాబోయే కొద్ది నెలల్లో ఈ ప‌థ‌కంలో విలీనం చేయబడతాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నాలుగు లేబర్ కోడ్‌ల అమలు ప్రక్రియనిక ముగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటిసారిగా సామాజిక భద్రత ప్రయోజనాలు జ‌ట్కాబండ్లు, ప్లాట్‌ఫాం కార్మికులకు విస్త‌రించ‌నున్నాము. అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనం వర్తిస్తుంది. దీనికి తోడు అంద‌రికీ కార్మిక రాజ్య బీమా ర‌క్ష‌ణ క‌ల్పించ‌బ‌డుతుంది. మహిళలకు అన్ని విభాగాల‌లో మ‌హిళ‌లు ప‌ని చేసేలా అనుమ‌తించ‌బ‌డుతుంది. రాత్రి షిఫ్టులలో తగిన రక్షణతో పనిచేయడానికి వీలుగా అనుమతి ఉంటుంది. అదే సమయంలో ఒకే రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్ మరియు ఆన్‌లైన్ రాబడితో యజమానులపై సమ్మతి భారం తగ్గుతుంది.

ఆర్థిక స‌మ్మిళిత‌త్వం..

ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు స్టాండ్ అప్ ఇండియా పథకం కింద రుణ ప్రవాహాన్ని మరింత సులభతరం చేయడానికి గాను మార్జిన్ డబ్బు అవసరాన్ని 25% నుండి 15% కు తగ్గించాలని వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలకు రుణాలు ఇవ్వ‌డాన్ని చేర్చాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించింది. అంతేకాకుండా ఎంఎస్‌ఎంఈ రంగానికి త‌గిన తోడ్పటును అందించేందుకు అనేక ర‌కాల చర్యలు తీసుకున్నారు. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ రంగానికి రూ.15,700 కోట్ల‌ను అందించింది. ఈ సంవత్సరం బీఈ కంటే కూడా ఇది రెట్టింపు.

 4. మానవ వనరుల పునరుజ్జీవనం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానానికి (ఎన్‌ఈపీ) మంచి ఆదరణ లభించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఎన్‌ఈపీలోని అన్ని అంశాలను చేర్చడానికి 15 వేలకు పైగా పాఠశాలలు నాణ్యతతో బలోపేతం అవుతాయని చెప్పారు. ఎన్జీవోలు/ప్రైవేటు పాఠశాలలు/రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రామాణాల ఏర్పాటు, గుర్తింపు, క్రమబద్ధీకరణ, నిధుల కోసం నాలుగు విభాగాలతో కూడిన అత్యున్నత సంస్థగా 'భారత ఉన్నత విద్య కమిషన్‌'ను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. లద్దాఖ్‌లోని వారికి ఉన్నత విద్య అందేలా, లేహ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.

షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమం

గిరిజన ప్రాంతాల్లో 750 "ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల"లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పాఠశాల వ్యయాన్ని రూ.20 కోట్ల నుంచి రూ.38 కోట్లకు, కొండలు, కష్టతర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు రూ.48 కోట్లకు పెంచింది. పునరుద్ధరించిన "పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం" కింద కేంద్ర సాయాన్ని పెంచాం. ఈ పథకం కింద 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా, 2025-2026 వరకు, ఆరు సంవత్సరాలకు రూ.35,219 కోట్లు కేటాయించాం. 

నైపుణ్యాభివృద్ధి

ప్రతిభావంత శ్రామిక శక్తి మోహరింపుతోపాటు, నైపుణ్య అర్హతలు, అంచనాలు, ధృవీకరణను పెంచడానికి యూఏఈ భాగస్వామ్యంతో ఒక కార్యక్రమం తీసుకొస్తున్నాం. జపాన్‌ దేశ పారిశ్రామిక, వృత్తిగత నైపుణ్యాలు, సాంకేతికతలు, జ్ఞానాన్ని భారత్‌కు తీసుకురావడానికి రెండు దేశాల మధ్య "ట్రైనింగ్‌ ఇంటర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌" (టీఐటీపీ) కూడా ఉంది. మరెన్నో దేశాలతోనూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం.

5.ఆవిష్కరణలు, ఆర్‌&డీ

జులై, 2019లో తాను చేసిన బడ్జెట్ ప్రసంగంలో, "నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌" ప్రకటించానని, దాని వ్యయం ఐదేళ్లకు రూ.50 వేల కోట్లు ఉంటుందని వెల్లడించానని ఆర్థిక మంత్రి చెప్పారు. గుర్తించిన జాతీయ ప్రాధాన్యత అంశాలపై దృష్టితో, దేశ పరిశోధన వ్యవస్థను అది బలోపేతం చేస్తుందని చెప్పానని ఆమె తెలిపారు.
 
"జాతీయ భాష అనువాద మిషన్‌"ను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని నిర్మల సీతారామన్‌ తన ప్రసంగంలో వెల్లడించారు. పరిపాలన, విధాన సంబంధిత జ్ఞాన సంపద ఇంటర్నెట్‌ ద్వారా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులో ఉండేలా ఇది చేస్తుందన్నారు.
 
పీఎస్‌ఎల్‌వీ-సీఎస్‌51 ప్రయోగాన్ని, అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో పనిచేసే న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేపడుతుందని, బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా ఉపగ్రహంతో పాటు మన దేశానికి చెందిన కొన్ని చిన్న ఉపగ్రహాలను ఈ రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్తుందని శ్రీమతి నిర్మల వెల్లడించారు.
 
గగన్‌యాన్‌ కార్యక్రమాల్లో భాగంగా, జెనరిక్ స్పేస్ ఫ్లైట్ అంశాలపై నలుగురు భారతీయ వ్యోమగాములు రష్యాలో శిక్షణ పొందుతున్నారు.  భారత్‌ చేపడుతున్న ఈ మొట్టమొదటి మానవసహిత ప్రయోగం ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగుతుంది.

6. క‌నీస ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న‌

బ‌డ్జెట్‌కు గ‌ల ఆరుస్తంబాల‌లో చివ‌రిదానిని వివ‌రిస్తూ, వేగ‌వంతంగా న్యాయాన్ని అందించేందుకు  ట్రిబ్యూన‌ళ్ళ‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డానికి గ‌త కొద్ది ఏళ్ళ‌లో ఆర్థిక మంత్రి  కొన్ని చ‌ర్య‌ల‌ను ప్ర‌తిపాదించిన విష‌యాన్ని గుర్తు చేస్తూ, ట్రిబ్యూన‌ళ్ళ ప‌నితీరును హేతుబ‌ద్ధం చేసేందుకు మ‌రిన్ని చ‌ర్య‌ల‌ను ప్ర‌తిపాదించారు. ప్ర‌భుత్వం 56 ఆరోగ్య సంర‌క్ష‌ణ వృత్తుల‌ను పార‌ద‌ర్శ‌కంగా‌, స‌మ‌ర్ధ‌వంతంగా నియంత్రించేందుకు నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ ఆలీడ్ హెల్త్ కేర్ ప్రొఫెష‌నల్స్ బిల్లును పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టింది. అంతేకాదు, రానున్న సెన్సెస్ (జ‌న గ‌ణ‌న‌) భార‌త చరిత్ర‌లోనే తొలి డిజిట‌ల్ సెన్సెస్ కానుందని, ఈ మ‌హ‌త్త‌ర‌మైన మైలురాయి ప‌ని కోసం 2021-2022లో రూ. 3,768 కోట్ల‌ను కేటాయించిన‌ట్టు మంత్రి ప్ర‌క‌టించారు. 

ఆర్థిక ప‌రిస్థితి గురించి మాట్లాడుతూ, ఆర్ధిక వ్య‌వ‌స్థ‌పై క‌రోనా మ‌హ‌మ్మారి చూపిన ప్ర‌భావం బ‌ల‌హీన ఆదాయ ప్ర‌వాహానికి దారితీసింద‌ని నొక్కి చెప్పారు. ఆరోగ్య ప‌రిస్థితి స్థిర‌ప‌డి, నెమ్మ‌దిగా లాక్ డౌన్‌ను ఎత్తివేస్తున్న‌ప్పుడు, దేశీయ డిమాండ్‌ను పున‌రుద్ధ‌రించేందుకు ప్ర‌భుత్వ ఖ‌ర్చును పెంచిన‌ట్టు చెప్పారు. ఫ‌లితంగా,  2020-2021 కోసం తొలుత అనుకున్న బిఇ ఖ‌ర్చు రూ.30.42 ల‌క్ష‌ల కోట్ల‌కు వ్య‌తిరేకంగా అంచ‌నాలు రూ. 34.50 కోట్ల ఆర్ ఇ అంచ‌నాలు ఉన్నాయ‌ని, అంతేకాకుండా వ్య‌య నాణ్య‌త‌ను సాధించామ‌న్నారు. మూల ధ‌న వ్య‌యం 2020-21లో బిఇ 2020-21లో రూ.4.12 ల‌క్ష‌ల కోట్ల‌కు వ్య‌తిరేకంగా ఆర్ ఇ లో అంచ‌నా వేసిన రూ. 4.39 ల‌క్ష‌ల కోట్ల‌గా ఉంది.

ఆర్ ఇ 2020-21కి ఆర్థిక లోటును జిడిపిలో 9.5% అదుపు చేశామ‌ని, దాని ప్ర‌భుత్వ రుణాలు, బ‌హువిధ రుణాలు, చిన్న పొదుపు నిధులు, స్వ‌ల్ప‌కాలిక రుణాల రూపంలో నిధులు స‌మ‌కూర్చామ‌ని ఆర్థిక మంత్రి చెప్పారు. ప్ర‌భుత్వానికి ఇంకో రూ. 80,000 కోట్లు అవ‌స‌ర‌మ‌ని, అందుకోసం రెండు నెల‌ల్లో  అది మార్కెట్ల‌ను చేరుకోనుంద‌ని ఆమె చెప్పారు. బిఇ 2021-2022లో విత్త లోటు జిడిపిలో 6.8% ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రానున్న సంవ‌త్స‌రానికి మార్కెట్ నుంచి తీసుకోనున్న స్థూల రుణాలు సుమారు రూ. 12 ల‌క్ష‌ల కోట్లు.

ఆర్థిక స్థిరీక‌ర‌ణ మార్గాన్ని కొన‌సాగించేందుకు ప్ర‌భుత్వం యోచిస్తోంద‌ని, క్ర‌మంగా లోటును త‌గ్గించుకుంటూ, 2025-26 నాటికి విత్త లోటు జిడిపిలో 4.5% తీసుకురావాల‌ని భావిస్తోంద‌ని శ్రీ‌మ‌తి సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. మొద‌ట‌గా, మెరుగైన స‌మ్మ‌తి ద్వారా ప‌న్ను ఆదాయాల‌ను పెంచడం, రెండ‌వ‌ది ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, భూములు స‌హా ఆస్తుల ద్ర‌వ్యీక‌రించ‌డం ద్వారా పెరిగిన ఆదాయం ద్వారా ఆర్థిక ప‌రిస్థితిని స్థిరీక‌రించాల‌ని ఆశిస్తున్నామ‌ని ఆమె చెప్పారు. 

15వ ఆర్థిక క‌మిష‌న్ అభిప్రాయాల‌కు అనుగుణంగా, 2021-2022లో రాష్ట్రాల నిక‌ర రుణాల‌ను జిఎస్‌డిపిలో 4%న్ని సాధార‌ణ సీలింగ్‌గా ప్ర‌భుత్వం అనుమ‌తిస్తోంది. 

మార్చి 31, 2020-201 నాటికి జిడిపిలో 3%  విత్త లోటును సాధించాల‌ని ఎఫ్ ఆర్ బిఎం చ‌ట్టం నిర్దేశిస్తోంది. ఈ ఏడాది ఎన్న‌డూలేని, ఇంత‌కు పూర్వం సంభ‌వించని ప‌రిస్థితులు, ఎఫ్ ఆర్‌బిఎం చ‌ట్టంలోని  సెక్ష‌న్ 4 (5), 7 (3) కింద డీవియేష‌న్ స్టేట్‌మెంట్ల‌ను స‌మ‌ర్పించే అవ‌స‌రాన్ని క‌ల్పించాయి. ఆర్థిక మంత్రి ఎఫ్ ఆర్‌బిఎం పత్రాల‌లో భాగంగా వీటిని కూడా స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. 
15వ ఆర్థిక క‌మిష‌న్ 9 డిసెంబ‌ర్ 2020న త‌న అంతిమ నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తికి స‌మ‌ర్పించింది. ఈ నివేదిక‌లో 2021-2026 కాలాన్ని క‌వ‌ర్ చేసింది. క‌మిష‌న్ నివేదిక‌ను, రాష్ట్రాల వెర్టిక‌ల్ షేర్ల‌ను 41%గా ఉంచుతూ వివ‌ర‌ణాత్మ‌క మెమొరాండంను ప్ర‌భుత్వం స‌మ‌ర్పించింది. క‌మిష‌న్ సిఫార్సుల మేర‌కు బ‌డ్జెట్ రూ. 1,18,452 కోట్ల‌ను ఆదాయ లోటు గ్రాంటుగా 2021-2022 కాలంలో 17 రాష్ట్రాల‌కు  కేటాయించింది. 

పార్ట్ -బి

కేంద్ర ఆర్ధిక‌మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలోని పార్ట్ -బిలో  ప‌న్ను నిర్వ‌హ‌ణ‌, లిటిగేష‌న్ మేనేజ్‌మెంట్ , ప్ర‌త్య‌క్ష ప‌న్నుపాల‌నను సుల‌భ‌త‌రం  చేయ‌డం వంటి అంశాల‌ను ప్ర‌స్తావించారు. పరోక్ష ప్ర‌తిపాద‌న‌లు ప్రధానంగా క‌స్ట‌మ్స్ సుంకం హేతుబ‌ద్ధం చేయ‌డం తోపాటు వివిధ ప్ర‌క్రియ‌ల‌ను హేతుబ‌ద్ధం చేయ‌డం, వాటి అమ‌లును సుల‌భ‌త‌రం చేయ‌డంపై దృష్టిపెట్ట‌డం జ‌రిగింది.

ప్ర‌త్య‌క్ష ప‌న్ను ప్ర‌తిపాద‌న‌లు:

కేంద్ర ఆర్ధిక‌మంత్రి త‌మ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లో ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించారు. ఆదాయ‌ప‌న్ను ప్రొసీడింగ్స్‌కు సంబంధించి కాల ప‌రిమితిని త‌గ్గించారు. వివాదాల ప‌రిష్కార క‌మిటీ ఏర్పాటును ప్ర‌క‌టించారు. ముఖాముఖి క‌లిసే అవ‌స‌రం లేకుండా ఐటిఎటి విధానం, ఎన్‌.ఆర్‌.ఐల కు మినహాయింపు, ఆటిట్‌నుంచి మిన‌హాయింపు ప‌రిమితి పెంపు, డివిడెండ్ ఆదాయానికి రాయితీలు ప్ర‌క‌టించడం జ‌రిగింది. మౌలిక స‌దుపాయాల రంగంలోకి , స‌ర‌స‌మైన ధ‌ర‌కు గృహ‌నిర్మాణం చేప‌ట్టే రంగంలోకి , అద్దె గృహ నిర్మాణ రంగంలోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు ఐఎఫ్ ఎస్ సిల‌కు ప‌న్ను రాయితీలు ప్ర‌క‌టించేందుకు , చిన్న దాతృత్వ సంస్థ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు దేశంలోని స్టార్ట‌ప్‌ల‌కు ఇన్సెంటివ్ లు క‌ల్పించేందుకు ఈ బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌లో ప్ర‌క‌టించారు. 

పరోక్ష పన్నుల ప్రతిపాదనలు 

 ప్రతిపాదిత పరోక్ష పన్నుల అంశాన్ని ప్రస్తావించిన మంత్రి గత కొన్ని నెలలుగా 

జిఎస్టి పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో జరిగాయని అన్నారు.  జిఎస్టి ని మరింత సులభతరం చేయడానికి అనేక చర్యలను తీసుకుంటున్నామని అన్నారు.  జీఎస్టీఎన్ వ్యవస్థ సామర్థ్యం వెల్లడయింది తెలిపారు. లోతుగా విశ్లేషణ చేయడం కృత్రిమ మేధస్సును వినియోగించడం ద్వారా  పన్ను ఎగవేతదారులను గుర్తించడం, తప్పుడు బిల్లులను గుర్తించి అక్రమాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశామని  అన్నారు.  జిఎస్టి ని మరింత సులభతరం చేయడానికి, గుర్తించిన లోపాలను సరిదిద్దడానికి చర్యలను తీసుకుంటామని మంత్రి సభకు హామీ ఇచ్చారు. 

దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ప్రపంచ వ్యవస్థకు అనుగుణంగా భారతదేశ ఆర్ధిక వ్యవస్థను తీర్చిదిద్ది ఎగుమతులను ఎక్కువ చేయాలన్న రెండు లక్షాలతో కస్టమ్స్ డ్యూటీ విధానాన్ని రూపొందించామని మంత్రి తెలిపారు. ముడిపదార్ధాల లభ్యత, విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. దీనికోసం కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు వున్న 400 అంశాలను ఈ ఏడాది సమీక్షిస్తామని మంత్రి అన్నారు. విస్తృత స్థాయిలో     సంప్రదింపులను  ప్రారంభించి  2021 అక్టోబర్ ఒకటవ తేదీ నాటికి లొసుగులు లేని కస్టమ్స్ డ్యూటీ వ్యవస్థను అమలులోకి తీసుకుని వస్తామని అన్నారు. ఇకపై కస్టమ్స్ మినహాయింపులు అవి అమలులోకి వచ్చిన రెండు సంవస్త్సరాలపాటు ఆ తరువాతి సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు అమలులో వుంటాయని మంత్రి ప్రపాదించారు. 

మొబైల్ చార్జర్ల భాగాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలపై ఇస్తున్న కొన్ని మినహాయింపులను ఉపసంహరిస్తునట్టు ప్రకటించిన మంత్రి మరికొన్ని భాగాలను 'నిల్' నుంచి తొలగించి 2.5 శాతం పరిధిలోకి తెస్తామని అన్నారు. 

నాన్ అల్లోయ్, స్టెయిన్ లెస్ స్టీల్ కి చెందిన సెమీస్, ఫ్లాట్, లాంగ్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన మంత్రి ఇనుప రద్దుపై 2022 మార్చి 31వ తేదీ వరకు సుంకాన్ని మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. 

చేతితో నేసే వస్త్రాలపై సుంకాన్ని హేతుబద్దీకరించవలసి ఉందని అన్న మంత్రి  పాలిస్టర్ చేతితో నేసే వస్త్రాలపై సమాన స్థాయికి నైలాన్ చైన్ ను తీసుకువస్తునట్టు తెలిపారు. కాప్రోలాక్టమ్, నైలాన్ చిప్స్ మరియు నైలాన్ ఫైబర్ మరియు నూలుపై బిసిడి రేట్లను 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన మంత్రి దీనివల్ల వస్త్ర పరిశ్రమ, స్మూక్ష చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా ఎగుమతులను చేయడానికి వీలవుతుందని వివరించారు. విలువ ఆధారిత దేశీయ ఎగుమతులను ప్రోత్సహించడానికి, అంతరాలను తగ్గించడానికి రసాయనాలపై కస్టమ్స్ సుంకం రేటును హేతుబద్దీకరిస్తున్నటు మంత్రి తెలిపారు. బంగారం, వెండిపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని హేతుబద్దీకరిస్తామని మంత్రి తెలిపారు. 

దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి సౌర ఘటాలు మరియు సౌర ఫలకాల కోసం దశలవారీగా తయారీ ప్రణాళికను ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.  సోలార్ ఇన్వర్టర్‌పై 5 శాతం నుంచి 20 శాతానికి, సౌర లాంతర్లపై 5 శాతం నుంచి 15 శాతానికి సుంకాన్ని పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు.

దేశంలో భారీ మూల పరికరాలను ఉత్పత్తి చేయడానికి దేశంలో సౌకర్యాలు ఉన్నాయని తన ప్రసంగంలో తెలిపిన ఆర్ధికమంత్రి దీనిపై విధిస్తున్న సుంకాల విధానాన్నిత్వరలో సమీక్షిస్తామని తెలిపారు. సొరంగాలు తవ్వకాల బోరింగ్ యంత్రాలు కొన్ని ఆటో భాగాలపై సుంకం రేట్లను సవరిస్తునట్టు మంత్రి ప్రకటించారు. 

MSME లకు ప్రయోజనం కలిగించే విధంగా స్టీల్ స్క్రూలు, ప్లాస్టిక్  వస్తువులు మరియు రొయ్యల మేతపై సుంకాన్ని పెంచాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. 

వస్త్ర,తోలు హస్తకళ ఎగుమతిదారులను ప్రోత్సహించడానికి .సుంకం లేని వస్తువుల దిగుమతి పై విధిస్తున్న సుంకాన్ని హేతు బద్ధీకరించడానికి బడ్జెట్ లో ప్రతిపాదించారు.  కొన్ని రకాల తోలు దిగుమతులపై మినహాయింపును ఉపసంహరించుకోవడం మరియు పూర్తయిన సింథటిక్ రత్నాల రాళ్లపై కస్టమ్ డ్యూటీని పెంచడం కూడాప్రతిపాదించారు

 రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి పత్తి, ముడి పట్టు మరియు పట్టు నూలుపై కస్టమ్ సుంకాన్ని పెంచినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.డీ నేచుర్డ్  ఇథైల్ ఆల్కహాల్‌పై ఇస్తున్న తుది వినియోగ ఆధారిత రాయితీలను ఉపసంహరించనున్నట్టు ఆమె ప్రకటించారు. తక్కువ సంఖ్యలో వస్తువులపై వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ విధింపును కూడా మంత్రి ప్రతిపాదించారు. “ఎక్కువ వస్తువులు  వినియోగదారులపై అదనపు భారం పడకుండా సెస్‌ను వర్తింపజేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాం' అని మంత్రి హామీ ఇచ్చారు.

విధానాల యొక్క హేతుబద్ధీకరణ మరియు సమ్మతిని సులభతరం చేయడానికి సంబంధించి, ఆర్థిక మంత్రి యాడ్ మరియు సివిడి లెవీలకు సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులను ప్రతిపాదించారు.  కస్టమ్స్ దర్యాప్తును పూర్తి చేయడానికినిర్ణీత కాలవ్యవధిని నిర్ణయిస్తామని ఆమె చెప్పారు. 2020 లో ప్రారంభించిన ‘టురాంట్ కస్టమ్ ఇనిషియేటివ్’ ఎఫ్‌టిఎల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సహాయపడిందని మంత్రి చెప్పారు.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow