తప్పుడు వార్త : భర్తను హింసించే భార్యపై గృహ హింస కేసు పెట్టొచ్చు.

Jul 20, 2021 - 07:39
 0
తప్పుడు వార్త : భర్తను హింసించే భార్యపై గృహ హింస కేసు పెట్టొచ్చు.

గృహ హింస చట్టం కింద మహిళలను కూడా విచారించ వచ్చని 2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుగా అర్థం చేసుకున్నారు

ఇక నుంచి భర్తని వేధించే భార్యపై గృహహింస కేసు పెట్టొచ్చని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇక నుంచి భర్తని వేధించే భార్యపై గృహహింస కేసు పెట్టొచ్చు – సుప్రీం కోర్టు.

ఫాక్ట్ (నిజం): గృహ హింస చట్టం, 2005 లోని సెక్షన్ 2(q) కింద పురుషులపై (అడల్ట్ మేల్) మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని 2014లో బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చుతూ 2016లో ఈ చట్టం కింద కేవలం పురుషులను మాత్రమే కాకుండా మహిళలను కూడా విచారించ వచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఐతే సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని ఇక నుంచి భర్తని వేధించే భార్యపై గృహహింస కేసు పెట్టొచ్చు అని తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇప్పటికీ 2005 చట్టం ప్రకారం బాధితులు కచ్చితంగా మహిళ అయ్యుండాలి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

2014లో గృహ హింసకి సంబంధించిన ఒక కేసులో  ‘గృహ హింస చట్టం, 2005లోని సెక్షన్ 2(q) కింద పురుషులపై (అడల్ట్ మేల్) మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని’ చెప్తూ బాంబే హై కోర్టు ఆ కేసులో ఆరోపణలు ఎదురుకొంటున్న మహిళలకు కేసు నుండి విముక్తి కల్పించింది.

ఐతే బాంబే హై కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై బాధిత మహిళ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోగా, బాంబే హై కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని తోసిపుచ్చుతూ 2016లో సుప్రీం కోర్టు గృహ హింస చట్టం కింద కేవలం పురుషులను మాత్రమే కాకుండా మహిళలను కూడా విచారించ వచ్చని తీర్పు చెప్పింది.

2005 చట్టంలో సెక్షన్ 2(q) వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో పేర్కొన్న సమానత్వ సిద్దాంతాన్ని పక్కదారి పట్టించడం ద్వారా, గృహ హింస చట్టం యొక్క లక్ష్యాలను దెబ్బతీస్తుందని సుప్రీం కోర్టు ఈ తీర్పులో అభిప్రాయపడింది. పైగా 2005 చట్టంలో సెక్షన్ 2(q) వల్ల పురుషులు నేరుగా కాకుండా తనకు బదులు ఒక మహిళను ముందుపెట్టి, ఉదాహారణకు భర్త తను నేరుగా భార్యపై గృహ హింసకు పాల్పడకుండా, తన తల్లి లేదా అక్కాచెల్లెళ్ల ద్వారా గృహ హింసకు పాల్పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతూ సెక్షన్ 2(q) లోని ‘అడల్ట్ మేల్’ అనే పదాన్ని తొలగించాలని తీర్పు చెప్పింది.

ఈ తీర్పు ద్వారా కేవలం ‘అడల్ట్ మేల్’ అనే పదాన్ని మాత్రమే తొలిగించి, మిగతా చట్టాన్ని యథాతధంగా ఉంచాలని చెప్పింది. అంటే గృహ హింసా చట్టం, 2005లోని రెస్పాన్డెంట్ (ప్రతివాది) ఇక ముందు నుండి ఎవరైనా (స్త్రీ లేదా పురుషుడు) అవొచ్చని భావించాలి, కాకపోతే అగ్గ్రీవ్డ్ (బాధితులు) మాత్రం మహిళ అయ్యుండాలి.

అంటే ఒక మహిళా బాధితురాలు పురుషులపై లేదా సాటి మహిళలపై ఫిర్యాదు చేయవచ్చు. వాళ్ళందరి మీద (పురుషుడు, మహిళ అనే తేడా లేకుండా) విచారణ జరుగుతుంది. దీని అర్థం, ఒక పురుషుడు ఈ చట్టం కింద భార్య మీద గృహ హింస ఫిర్యాదు ఇవ్వొచ్చని కాదు.

గృహ హింస చట్టం కింద కేవలం పురుషులను మాత్రమే కాకుండా మహిళలను కూడా విచారించ వచ్చని 2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుని ‘భర్తని వేధించే భార్యపై గృహహింస కేసు పెట్టొచ్చని’ తప్పుగా అర్ధం చేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

చివరగా, గృహ హింస చట్టం కింద మహిళలను కూడా విచారించ వచ్చని 2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుగా అర్ధం చేసుకున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow