లలితా సహస్తనామ స్తోత్రము: లోని నామములకు : సంక్షిప్త వివరణ

లలితా సహస్తనామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది. 700 నామములు

Jul 31, 2021 - 09:43
Jul 31, 2021 - 09:52
 0
లలితా సహస్తనామ స్తోత్రము: లోని  నామములకు : సంక్షిప్త వివరణ
lalitha sahasra nama sthothram in telugu with meaning.

శ్లోకం 01

  1. శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి.
  2. శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి.
  3. శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
  4. చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.
  5. దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది.

శ్లోకం 02

  1. ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.
  2. చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
  3. రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
  4. క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.

శ్లోకం 03

  1. మనో రూపేక్షు కోదండా : మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.
  2. పంచతన్మాత్ర సాయకా : ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.
  3. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.

శ్లోకం 04

  1. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా : సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.
  2. కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా : పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది.

శ్లోకం 05

  1. అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.
  2. ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.

శ్లోకం 06

  1. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : ముఖమనెడు మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.
  2. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : ముఖదీప్తి అనెడు సంపదప్రథమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు కలిగినది.

శ్లోకం 07

  1. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా : క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది
  2. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.

శ్లోకం 08

  1. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా నున్నది.
  2. తాటంక యుగళీభూత తపనోడుప మండలా : చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.

శ్లోకం 09

  1. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది.
  2. నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా - కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.

శ్లోకం 10

  1. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా - శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.
  2. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా - కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది.

శ్లోకం 11

  1. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ - తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది.
  2. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మనసా - చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.

శ్లోకం 12

  1. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా - లభ్యము గాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.
  2. కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా - పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.

శ్లోకం 13

  1. కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా - బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.
  2. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా - రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది.

శ్లోకం 14

  1. కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ - కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది.
  2. నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ - బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.

శ్లోకం 15

  1. లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా - కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది.
  2. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా - వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలౌ గలది.

శ్లోకం 16

  1. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ - ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
  2. రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా - రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది.

శ్లోకం 17

  1. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా - కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది.
  2. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా - మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది.

శ్లోకం 18

  1. ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా - ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
  2. గూఢగుల్ఫా - నిండైన చీలమండలు గలది.
  3. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా - తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.

శ్లోకం 19

  1. నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా - గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.
  2. పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా - పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.

శ్లోకం 20

  1. శింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజా - ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది.
  2. మరాళీ మందగమనా - హంసవలె ఠీవి నడక కలిగినది.
  3. మహాలావణ్య శేవధిః - అతిశయించిన అందమునకు గని లేదా నిధి.

శ్లోకం 21

  1. సర్వారుణా - సర్వము అరుణ వర్ణంగా భాసించునది.
  2. అనవద్యాంగీ - వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.
  3. సర్వాభరణ భూషితా - సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
  4. శివకామేశ్వరాంకస్థా - శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.
  5. శివా - వ్యక్తమైన శివుని రూపము కలది.
  6. స్వాధీన వల్లభా - తనకు లోబడిన భర్త గలది.

శ్లోకం 22

  1. సుమేరు శృంగమధ్యస్థా - మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.
  2. శ్రీమన్నగర నాయికా - శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరంనకు అధిష్ఠాత్రి.
  3. చింతామణి గృహాంతఃస్థా - చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.
  4. పంచబ్రహ్మాసనస్థితా - ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.

శ్లోకం 23

  1. మహాపద్మాటవీ సంస్థా - మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉంది.
  2. కదంబ వనవాసినీ - కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.
  3. సుధాసాగర మధ్యస్థా - చక్కగా గుర్తించుకొని తనయందు ధరించి అవసరమైనపుడు వ్యక్తము చేయగలుగునది.
  4. కామాక్షీ - అందమైన కన్నులు గలది.
  5. కామదాయినీ - కోరికలను నెరవేర్చునది.

శ్లోకం 24

  1. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.
  2. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.

శ్లోకం 25

  1. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా - సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది.
  2. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా - అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.

శ్లోకం 26

  1. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా - చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.
  2. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా - గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.

శ్లోకం 27

  1. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా - కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది.
  2. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా - జ్వాలా మాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.

శ్లోకం 28

  1. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా - భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది.
  2. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా - నిత్యాదేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.

శ్లోకం 29

  1. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా - భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.
  2. మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా - మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.

శ్లోకం 30

  1. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా - విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.
  2. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా - కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.

శ్లోకం 31

  1. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.
  2. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ - రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.

శ్లోకం 32

  1. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.
  2. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా - మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది.

శ్లోకం 33

  1. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా - కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన శూన్యకా నగరం గలది.
  2. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవా - బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది.

శ్లోకం 34

  1. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః - శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.
  2. శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా - మంగళకరమైన లేదా మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.

శ్లోకం 35

  1. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ - కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట స్వరూపముగా గలది.
  2. శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ - శక్తికూటముతో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.

శ్లోకం 36

  1. మూలమంత్రాత్మికా - మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.
  2. మూలకూట త్రయకళేబరా - మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.
  3. కులమృతైక రసికా - కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.
  4. కులసంకేత పాలినీ - కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.

శ్లోకం 37

  1. కులాంగనా - కుల సంబంధమైన స్త్రీ.
  2. కులాంతఃస్థా - కులము యొక్క మద్యములో ఉంది.
  3. కౌలినీ - కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.
  4. కులయోగినీ - కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.
  5. అకులా - అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.
  6. సమయాంతఃస్థా - సమయాచార అంతర్వర్తిని.
  7. సమయాచార తత్పరా - సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.

శ్లోకం 38

  1. మూలాధారైక నిలయా - మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.
  2. బ్రహ్మగ్రంథి విభేదినీ - బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.
  3. మణిపూరాంతరుదిరా - మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.
  4. విష్ణుగ్రంథి విభేదినీ - విష్ణుగ్రంథిని విడగొట్టునది.

శ్లోకం 39

  1. ఆజ్ఞాచక్రాంతళస్థా - ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది.
  2. రుద్రగ్రంథి విభేదినీ - రుద్రగ్రంథిని విడగొట్టునది.
  3. సహస్త్రారాంభుజారూఢా - వెయ్యి దళములు గల పద్మమును అధిష్టించి యున్నది.
  4. సుధాసారాభివర్షిణీ - అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.

శ్లోకం 40

  1. తటిల్లతా సమరుచిః - మెఱపుతీగతో సమానమగు కాంతి గలది.
  2. షట్చక్రోపరి సంస్థితా - ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క పైభాగమందు చక్కగా నున్నది.
  3. మహాసక్తిః - బ్రహ్మమునందు ఆసక్తి గలది.
  4. కుండలినీ - పాము వంటి ఆకారము గలది.
  5. బిసతంతు తనీయసీ - తామరకాడలోని ప్రోగువలె సన్నని స్వరూపము గలది.

శ్లోకం 41

  1. భవానీ - భవుని భార్య.
  2. భావనాగమ్యా - భావన చేత పొంద శక్యము గానిది.
  3. భవారణ్య కుఠారికా - సంసారమనెడు అడవికి గండ్రగొడ్డలి వంటిది.
  4. భద్రప్రియా - శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.
  5. భద్రమూర్తిః - శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.
  6. భక్త సౌభాగ్యదాయినీ - భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది.

శ్లోకం 42

  1. భక్తప్రియా - భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది.
  2. భక్తిగమ్యా - భక్తికి గమ్యమైనటువంటిది.
  3. భక్తివశ్యా - భక్తికి స్వాధీనురాలు.
  4. భయాపహా - భయములను పోగొట్టునది.
  5. శాంభవీ - శంభుని భార్య.
  6. శారదారాధ్యా - సరస్వతిచే ఆరాధింపబడునది.
  7. శర్వాణీ - శర్వుని భార్య.
  8. శర్మదాయినీ - శాంతిని, సుఖమును ఇచ్చునది.

శ్లోకం 43

  1. శాంకరీ - శంకరుని భార్య.
  2. శ్రీకరీ - ఐశ్వర్యమును ఇచ్చునది.
  3. సాధ్వీ - సాధు ప్రవర్తన గల పతివ్రత.
  4. శరచ్చంద్ర నిభాననా - శరత్కాలము లోని చంద్రునితో సమానమైన వదనము గలది.
  5. శాతోదరీ - కృశించిన లేదా సన్నని పొట్ట గలిగినది.
  6. శాంతిమతీ - శాంతి గలది.
  7. నిరాధారా - ఆధారము లేనిది.
  8. నిరంజనా - మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది.

శ్లోకం 44

  1. నిర్లేపా - కర్మ బంధములు అంటనిది.
  2. నిర్మలా - ఏ విధమైన మలినము లేనిది.
  3. నిత్యా - నిత్య సత్య స్వరూపిణి.
  4. నిరాకారా - ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది.
  5. నిరాకులా - భావ వికారములు లేనిది.
  6. నిర్గుణా - గుణములు అంటనిది.
  7. నిష్కలా - విభాగములు లేనిది.
  8. శాంతా - ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్రుపాటు లేనిది.
  9. నిష్కామా - కామము, అనగా ఏ కోరికలు లేనిది.
  10. నిరుపప్లవా - హద్దులు ఉల్లంఘించుట లేనిది.

శ్లోకం 45

  1. నిత్యముక్తా - ఎప్పుడును సంగము లేనిది.
  2. నిర్వికారా - ఏ విధమైన వికారములు లేనిది.
  3. నిష్ప్రపంచా - ప్రపంచముతో ముడి లేనిది.
  4. నిరాశ్రయా - ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది.
  5. నిత్యశుద్ధా - ఎల్లప్పుడు శుద్ధమైనది.
  6. నిత్యబుద్ధా - ఎల్లప్పుడు జ్ఞాన స్వరూపురాలు.
  7. నిరవద్యా - చెప్పరానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకూ ఏదీ లేనిది.
  8. నిరంతరా - ఏ మాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది.

శ్లోకం 46

  1. నిష్కారణా - ఏ కారణము లేనిది.
  2. నిష్కళంకా - ఎటువంటి దోషము లేదా పాపము లేనిది.
  3. నిరుపాధిః - ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది.
  4. నిరీశ్వరా - ఇంకా తనను పైన ప్రభువు అనువారెవరూ లేనిది.
  5. నిరాగా - రాగము అనగా కోరికలు లేనిది.
  6. రాగమథనీ - రాగమును పోగొట్టి, వైరాగ్యమును కలుగుజేయునది.
  7. నిర్మదా - మదము లేనిది.
  8. మదనాశినీ - మదమును పోగొట్టునది.

శ్లోకం 47

  1. నిశ్చింతా - ఏ చింతలూ లేనిది.
  2. నిరహంకారా - ఏ విధమైన అహంకారము లేనిది.
  3. నిర్మోహా - అవగాహనలో పొరపాటు లేనిది.
  4. మోహనాశినీ - మోహమును పోగొట్టునది.
  5. నిర్మమా - మమకారము లేనిది.
  6. మమతాహంత్రీ - మమకారమును పోగొట్టునది.
  7. నిష్పాపా - పాపము లేనిది.
  8. పాపనాశినీ - పాపములను పోగొట్టునది.

శ్లోకం 48

  1. నిష్క్రోధా - క్రోధము లేనిది.
  2. క్రోధశమనీ - క్రోధమును పోగొట్టునది.
  3. నిర్లోభా - లోభము లేనిది.
  4. లోభనాశినీ - లోభమును పోగొట్టునది.
  5. నిస్సంశయా - సందేహములు, సంశయములు లేనిది.
  6. సంశయఘ్నీ - సంశయములను పోగొట్టునది.
  7. నిర్భవా - పుట్టుక లేనిది.
  8. భవనాశినీ - పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా చేయునది.

శ్లోకం 49

  1. నిర్వికల్పా - వికల్పములు లేనిది.
  2. నిరాబాధా - బాధలు, వేధలు లేనిది.
  3. నిర్భేదా - భేదములు లేనిది.
  4. భేదనాశినీ - భేదములను పోగొట్టునది.
  5. నిర్నాశా - నాశము లేనిది.
  6. మృత్యుమథనీ - మృత్యు భావమును, మృత్యువును పోగొట్టునది.
  7. నిష్క్రియా - క్రియలు (చేయవలసిన, చేయకూడని) లేనిది.
  8. నిష్పరిగ్రహా - స్వీకరణ, పరిజనాదులు లేనిది.

శ్లోకము 50

  1. నిస్తులా - సాటి లేనిది.
  2. నీలచికురా - చిక్కని, చక్కని, నల్లని, ముంగురులు గలది.
  3. నిరపాయా - అపాయములు లేనిది.
  4. నిరత్యయా - అతిక్రమింప వీలులేనిది.
  5. దుర్లభా - పొందశక్యము కానిది.
  6. దుర్గమా - గమింప శక్యము గానిది.
  7. దుర్గా - దుర్గాదేవి.
  8. దుఃఖహంత్రీ - దుఃఖములను తొలగించునది.
  9. సుఖప్రదా - సుఖములను ఇచ్చునది.

శ్లోకము 51

  1. దుష్టదూరా - దుష్టత్వము అంటనిది. దుష్టులకు అంటనిది.
  2. దురాచార శమనీ - చెడు నడవడికను పోగొట్టునది.
  3. దోషవర్జితా - దోషములచే విడిచి పెట్టబడింది.
  4. సర్వజ్ఞా - అన్నిటినీ తెలిసింది.
  5. సాంద్రకరుణా - గొప్ప దయ గలది.
  6. సమానాధిక వర్జితా - ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది.

శ్లోకము 52

  1. సర్వశక్తిమయీ - సర్వశక్తి స్వరూపిణి.
  2. సర్వమంగళా - సర్వమంగళ స్వరూపిణి.
  3. సద్గతి ప్రదా - మంచి మార్గమును ఇచ్చునది.
  4. సర్వేశ్వరీ - జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.
  5. సర్వమయీ - సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.
  6. సర్వమంత్ర స్వరూపిణీ - అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.

శ్లోకం 53

  1. సర్వయంత్రాత్మికా - అన్ని యంత్రములకు స్వరూపముగా గలది.
  2. సర్వతంత్రరూపా - అన్ని తంత్రములను తన రూపముగా గలది.
  3. మనోన్మనీ - మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.
  4. మాహేశ్వరీ - మహేశ్వర సంబంధమైనది.
  5. మహాదేవీ - మహిమాన్వితమైన ఆధిపత్యము కలది.
  6. మహాలక్ష్మీ - గొప్పవైన లక్ష్మలు గలది.
  7. మృడప్రియా - శివుని ప్రియురాలు.

శ్లోకం 54

  1. మహారూపా - గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది.
  2. మహాపూజ్యా - గొప్పగా పూజింపబడునది.
  3. మహాపాతక నాశినీ - ఘోరమైన పాతకములను నాశనము చేయునది.
  4. మహామాయా - మహిమాన్వితమైన మాయా లక్షణం కలది.
  5. మహాసత్వా - మహిమాన్వితమైన ఉనికి గలది.
  6. మహాశక్తిః - అనంతమైన శక్తి సామర్థ్యములు గలది.
  7. మహారతిః - గొప్ప ఆసక్తి గలది.

శ్లోకం 55

  1. మహాభోగా - గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది.
  2. మహైశ్వర్యా - విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది.
  3. మహావీర్యా - అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది.
  4. మహాబలా - అనంతమైన బలసంపన్నురాలు.
  5. మహాబుద్ధిః - అద్వితీయమైన బుద్ధి గలది.
  6. మహాసిద్ధిః - అద్వితీయమైన సిద్ధి గలది.
  7. మహాయోగేశ్వరేశ్వరీ - గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి.

శ్లోకం 56

  1. మహాతంత్రా - గొప్పదైన తంత్ర స్వరూపిణి.
  2. మహామంత్రా - గొప్పదైన మంత్ర స్వరూపిణి.
  3. మహాయంత్రా - గొప్పదైన యంత్ర స్వరూపిణి.
  4. మహాసనా - గొప్పదైన ఆసనము గలది.
  5. మహాయాగ క్రమారాధ్యా - గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది.
  6. మహాభైరవ పూజితా - ఆదిత్య మండలంలో మధ్యనవుండే మహాభైరవుడు (నారాయణుడు) చేత పూజింపబడింది.

శ్లోకం 57

  1. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ - సదాశివునిచే మహాప్రళయ సమయమునందు చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి.
  2. మహా కామేశ మహిషీ - మహేశ్వరుని పట్టపురాణి.
  3. మహాత్రిపుర సుందరీ - గొప్పదైన త్రిపురసుందరి.

శ్లోకం 58

  1. చతుష్షష్ట్యుపచారాఢ్యా - అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది.
  2. చతుష్షష్టి కళామయీ - అరువది నాలుగు కళలు గలది.
  3. మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా - గొప్పదైన అరువది కోట్ల యోగినీ బృందముచే సేవింపబడునది.

శ్లోకం 59

  1. మనువిద్యా - మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
  2. చంద్రవిద్యా - చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.
  3. చంద్రమండలమధ్యగా - చంద్ర మండలములో మధ్యగా నుండునది.
  4. చారురూపా - మనోహరమైన రూపము కలిగినది.
  5. చారుహాసా - అందమైన మందహాసము కలది.
  6. చారుచంద్రకళాధరా - అందమైన చంద్రుని కళను ధరించునది.

శ్లోకం 60

  1. చరాచర జగన్నాథా - కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు.
  2. చక్రరాజ నికేతనా - చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది.
  3. పార్వతీ - పర్వతరాజ పుత్రి.
  4. పద్మనయనా - పద్మములవంటి నయనములు కలది.
  5. పద్మరాగ సమప్రభా - పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.

శ్లోకం 61

  1. పంచప్రేతాసనాసీనా - పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.
  2. పంచబ్రహ్మస్వరూపిణీ - పంచబ్రహ్మల స్వరూపమైనది.
  3. చిన్మయీ - జ్ఞానముతో నిండినది.
  4. పరమానందా - బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.
  5. విజ్ఞానఘనరూపిణీ - విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది.

శ్లోకం 62

  1. ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా - ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క, ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది.
  2. ధర్మాధర్మ వివర్జితా - విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది.
  3. విశ్వరూపా - విశ్వము యొక్క రూపమైనది.
  4. జాగరిణీ - జాగ్రదవస్థను సూచించునది.
  5. స్వపంతీ - స్వప్నావస్థను సూచించునది.
  6. తైజసాత్మికా - తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి.

శ్లోకం 63

  1. సుప్తా - నిద్రావస్థను సూచించునది.
  2. ప్రాజ్ఞాత్మికా - ప్రజ్ఞయే స్వరూపముగా గలది.
  3. తుర్యా - తుర్యావస్థను సూచించునది.
  4. సర్వావస్థా వివర్జితా - అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
  5. సృష్టికర్త్రీ - సృష్టిని చేయునది.
  6. బ్రహ్మరూపా - బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది.
  7. గోప్త్రీ - గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది.
  8. గోవిందరూపిణీ - విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది.

శ్లోకం 64

  1. సంహారిణీ - ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ గావించి, లీనము చేసుకొనునది.
  2. రుద్రరూపా - రుద్రుని యొక్క రూపు దాల్చింది.
  3. తిరోధానకరీ - మఱుగు పరచుటను చేయునది.
  4. ఈశ్వరీ - ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది.
  5. సదాశివా - సదాశివ స్వరూపిణి.
  6. అనుగ్రహదా - అనుగ్రహమును ఇచ్చునది.
  7. పంచకృత్య పరాయణా - సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు కృత్యముల యందు ఆసక్తి కలది.

శ్లోకం 65

  1. భానుమండల మధ్యస్థా - సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది.
  2. భైరవీ - భైరవీ స్వరూపిణి.
  3. భగమాలినీ - వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది.
  4. పద్మాసనా - పద్మమును నెలవుగా కలిగినది.
  5. భగవతీ - భగశబ్ద స్వరూపిణి.
  6. పద్మనాభ సహోదరీ - విష్ణుమూర్తి యొక్క సహోదరి.

శ్లోకం 66

  1. ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళి - తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.
  2. సహస్రశీర్షవదనా - వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.
  3. సహస్రాక్షీ - వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది
  4. సహస్రపాత్ - అనంతమైన పాదములు కలది.

శ్లోకం 67

  1. ఆ బ్రహ్మకీటజననీ - బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి.
  2. వర్ణాశ్రమ విధాయినీ - వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది.
  3. నిజాజ్ఞారూపనిగమా - తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.
  4. పుణ్యాపుణ్యఫలప్రదా - మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన ఫలములను చక్కగా ఇచ్చునది.

శ్లోకం 68

  1. శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా - వేదములనెడు స్త్రీలయొక్క పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మము యొక్క ధూళిని కలిగినది.
  2. సకలాగమ సందోహశుక్తి సంపుటమౌక్తికా - అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము.

శ్లోకం 69

  1. పురుషార్థప్రదా - పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది.
  2. పూర్ణా - పూర్ణురాలు.
  3. భోగినీ - భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది.
  4. భువనేశ్వరీ - చతుర్దశ భువనములకు అధినాథురాలు.
  5. అంబికా - తల్లి.
  6. అనాదినిధనా - ఆది, అంతము లేనిది.
  7. హరిబ్రహ్మేంద్ర సేవితా - విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత సేవింపబడునది.

శ్లోకం 70

  1. నారాయణీ - నారాయణత్వ లక్షణము గలది.
  2. నాదరూపా - నాదము యొక్క రూపము అయినది.
  3. నామరూపవివర్జితా - పేరు, ఆకారము లేనిది
  4. హ్రీంకారీ - హ్రీంకార స్వరూపిణి.
  5. హ్రీమతీ - లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.
  6. హృద్యా - హృదయమునకు ఆనందము అయినది.
  7. హేయోపాదేయవర్జితా - విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.

శ్లోకం 71

  1. రాజరాజార్చితా - రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.
  2. రాజ్ఞఈ - రాణి.
  3. రమ్యా - మనోహరమైనది.
  4. రాజీవలోచనా - పద్మములవంటి కన్నులు కలది.
  5. రంజనీ - రంజింప చేయునది లేదా రంజనము చేయునది.
  6. రమణీ - రమింపచేయునది.
  7. రస్యా - రస స్వరూపిణి.
  8. రణత్కింకిణి మేఖలా - మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది.

శ్లోకం 72

  1. రమా - లక్ష్మీదేవి.
  2. రాకేందువదనా - పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.
  3. రతిరూపా - ఆసక్తి రూపమైనది.
  4. రతిప్రియా - ఆసక్తి యందు ప్రీతి కలది.
  5. రక్షాకరీ - రక్షించునది.
  6. రాక్షసఘ్నీ - రాక్షసులను సంహరించునది.
  7. రామా - ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.
  8. రమణ లంపటా - రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.

శ్లోకం 73

  1. కామ్యా - కోరదగినటువంటిది.
  2. కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది.
  3. కదంబకుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.
  4. కళ్యాణీ - శుభ లక్షణములు కలది.
  5. జగతీకందా - జగత్తుకు మూలమైనటువంటిది.
  6. కరుణా రససాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది.

శ్లోకం 74

  1. కళావతీ -కళా స్వరూపిణీ.
  2. కలాలాపా - కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.
  3. కాంతా - కామింపబడినటువంటిది.
  4. కాదంబరీ ప్రియా - పరవశించుటను ఇష్టపడునది.
  5. వరదా - వరములను ఇచ్చునది.
  6. వామనయనా - అందమైన నేత్రములు గలది.
  7. వారుణీమదవిహ్వలా - వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.

శ్లోకం 75

  1. విశ్వాధికా - ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.
  2. వేదవేద్యా - వేదముల చేత తెలియదగినది.
  3. వింధ్యాచలనివాసినీ - వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.
  4. విధాత్రీ - విధానమును చేయునది.
  5. వేదజననీ - వేదములకు తల్లి.
  6. విష్ణుమాయా - విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.
  7. విలాసినీ - వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.

శ్లోకం 76

  1. క్షేత్రస్వరూపా - క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.
  2. క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.
  3. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ - స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.
  4. క్షయవృద్ధివినిర్ముక్తా - తరుగుదల, పెరుగుదల లేనిది.
  5. క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.

శ్లోకం 77

  1. విజయా - విశేషమైన జయమును కలిగినది.
  2. విమలా - మలినములు స్పృశింపనిది.
  3. వంద్యా - నమస్కరింపతగినది.
  4. వందారుజనవత్సలా - నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.
  5. వాగ్వాదినీ - వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.
  6. వామకేశీ - వామకేశ్వరుని భార్య.
  7. వహ్నిమండవాసినీ - అగ్ని ప్రాకారమునందు వసించునది.

శ్లోకం 78

  1. భక్తిమత్కల్పలతికా - భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.
  2. పశుపాశ విమోచనీ - వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.
  3. సంహృతాశేషపాషండా - సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.
  4. సదాచారప్రవర్తికా - సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.

శ్లోకం 79

  1. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా - ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.
  2. తరుణీ - ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.
  3. తాపసారాధ్యా - తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.
  4. తనుమధ్యా - కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.
  5. తమో పహా - చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.

శ్లోకం 80

  1. చితిః - కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.
  2. తత్పదలక్ష్యార్థా - తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.
  3. చిదేకరసరూపిణీ - జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.
  4. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః - తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.

శ్లోకం 81

  1. పరా - పరాస్థితిలోని వాగ్రూపము.
  2. ప్రత్యక్చితీరూపా - స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.
  3. పశ్యంతీ - రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు
  4. పరదేవతా - పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.
  5. మధ్యమా - పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.
  6. వైఖరీరూపా - స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.
  7. భక్తమానసహంసికా - భక్తుల యొక్క, మనస్సులందు విహరించు ఆడు హంస.

శ్లోకం 82

  1. కామేశ్వరప్రాణనాడీ - శివుని ప్రాణనాడీ స్వరూపిణి.
  2. కృతజ్ఞా - చేయబడే పనులన్నీ తెలిసింది.
  3. కామపూజితా - కామునిచే పూజింపబడునది.
  4. శృంగారరససంపూర్ణా - శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను కూడి నిండుగా ఉంది.
  5. జయా - జయస్వరూపిణి.
  6. జాలంధరస్థితా - జాలంధరసూచిత స్థానము నందున్నది.

శ్లోకం 83

  1. ఓడ్యాణపీఠనిలయా - ఓడ్యాణ పీఠమునందు ఉంది.
  2. బిందుమండలవాసినీ - బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.
  3. రహోయాగక్రమారాధ్యా - ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది.
  4. రహస్తర్పణతర్పితా - రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది.

శ్లోకం 84

  1. సద్యఃప్రసాదినీ - తక్షణములోనే అనుగ్రహించునది.
  2. విశ్వసాక్షిణీ - విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి.
  3. సాక్షివర్జితా - సాక్షి లేనిది.
  4. షడంగదేవతాయుక్తా - ఆరు అంగదేవతలతో కూడి ఉంది.
  5. షాడ్గుణ్య పరిపూరితా - ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి యుండునది.

శ్లోకం 85

  1. నిత్యక్లిన్నా - ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడి యుండునది.
  2. నిరుపమా - పోల్చిచెప్పుటకు ఉపమానము ఏమియు లేనిది.
  3. నిర్వాణసుఖదాయినీ - సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చునది.
  4. నిత్యాషోడాశికారూపా - నిత్యాదేవతలగానున్న పదహారు కళల రూపము.
  5. శ్రీకంఠార్థశరీరిణీ - శివుని సగము శరీరముగా నున్నది.

శ్లోకం 86

  1. ప్రభావతీ - వెలుగులు విరజిమ్ము రూపము గలది.
  2. ప్రభారూపా - వెలుగుల యొక్క రూపము.
  3. ప్రసిద్ధా - ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.
  4. పరమేశ్వరీ - పరమునకు అధికారిణి.
  5. మూలప్రకృతిః - అన్ని ప్రకృతులకు మూలమైనది.
  6. అవ్యక్తా - వ్యక్తము కానిది.
  7. వ్యక్తావ్యక్తస్వరూపిణీ - వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.

శ్లోకం 87

  1. వ్యాపినీ - వ్యాపనత్వ లక్షణము కలది.
  2. వివిధాకారా - వివిధములైన ఆకారములతో నుండునది.
  3. విద్యావిద్యాస్వరూపిణీ - విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
  4. మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ - మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెలవెల్లువ.

శ్లోకం 88

  1. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః - భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.
  2. శివదూతీ - శివుని వద్దకు పంపిన దూతిక.
  3. శివారాధ్యా - శివునిచే ఆరాధింపబడునది.
  4. శివమూర్తిః - శివునియొక్క స్వరూపము.
  5. శివంకరీ - శుభములు చేకూర్చునది.

శ్లోకం 89

  1. శివప్రియా - శివునికి ఇష్టమైనది.
  2. శివపరా - శివుని పరమావధిగా కలిగినది.
  3. శిష్టేష్టా - శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.
  4. శిష్టపూజితా - శిష్టజనుల చేత పూజింపబడునది.
  5. అప్రమేయా - ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.
  6. స్వప్రకాశా - తనంతట తానే ప్రకాశించునది.
  7. మనోవాచామగోచరా - మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలుకానిది.

శ్లోకం 90

  1. చిచ్ఛక్తిః - చైతన్య శక్తి.
  2. చేతనారూపా - చలించు తెలివి యొక్క రూపము.
  3. జడశక్తిః - ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.
  4. జడాత్మికా - జడశక్తి యొక్క స్వరూపము.
  5. గాయత్రీ - గానము చేసిన వారిని రక్షించునది.
  6. వ్యాహృతిః - ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది.
  7. సంధ్యా - చక్కగా ధ్యానము చేయబడునది.
  8. ద్విజబృంద నిషేవితా - ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది.

శ్లోకం 91

  1. తత్త్వాసనా - తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది.
  2. తత్ - ఆ పరమాత్మను సూచించు పదము.
  3. త్వమ్‌ - నీవు.
  4. అయీ - అమ్మవారిని సంబోధించు పదము.
  5. పంచకోశాంతరస్థితా - ఐదు కోశముల మధ్యన ఉండునది.
  6. నిస్సీమ మహిమా - హద్దులు లేని మహిమ గలది.
  7. నిత్యయౌవనా - సర్వకాలములందును యవ్వన దశలో నుండునది.
  8. మదశాలినీ - పరవశత్వముతో కూడిన శీలము కలది.

శ్లోకం 92

  1. మదఘూర్ణితరక్తాక్షీ - పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన కన్నులు గలది.
  2. మదపాటల గండభూః - ఆనంద పారవశ్యము వలన తెలుపు, ఎరుపుల సమిశ్ర వర్ణములో ప్రకాంశించు చెక్కిళ్లు కలది.
  3. చందనద్రవదిగ్ధాంగీ - మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది.
  4. చంపేయకుసుమప్రియా - సంపెంగ పుష్పములందు ప్రీతి కలది.

శ్లోకం 93

  1. కుశలా - క్షేమము, కౌశల్యమును గలది.
  2. కోమలాకారా - సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది.
  3. కురుకుల్లా -
  4. కులేశ్వరీ - కులమార్గమునకు ఈశ్వరి.
  5. కులకుండలయా - కులకుండమును నిలయముగా గలది.
  6. కులమార్గతత్పరసేవితా - కౌలమార్గమును అనుసరించువారిచే సేవింపబడునది.

శ్లోకం 94

  1. కుమార గణనాథాంబా - కుమారస్వామికి, గణపతికి తల్లి అయినది.
  2. తుష్టిః - తృప్తి, సంతోషముల రూపము.
  3. పుష్టిః - సమృద్ధి స్వరూపము.
  4. మతిః - బుద్ధి
  5. ధృతిః - ధైర్యము.
  6. శాంతిః - తొట్రుపాటు లేని నిలకడతనము గలది.
  7. స్వస్తిమతీ - మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది.
  8. కాంతిః - కోరదగినది.
  9. నందినీ = ఆనందిని అంటే ఆనందమును అనుభవించునది.
  10. విఘ్ననాశినీ - విఘ్నములను నాశము చేయునది.

శ్లోకం 95

  1. తేజోవతీ - తేజస్సు కలది.
  2. త్రినయనా - మూడు కన్నులు కలది.
  3. లోకాక్షీ కామరూపిణీ - స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది.
  4. మాలినీ - మాలికారూపము చెల్లునది. లేదా మాల గలది.
  5. హంసినీ - హంసను (శ్వాసను) గలిగినది.
  6. మాతా - తల్లి.
  7. మలయాచలవాసినీ - మలయపర్వమున వసించునది.

శ్లోకం 96

  1. సుముఖీ - మంగళకరమైన ముఖము కలది.
  2. నళినీ - నాళము గలిగినది.
  3. సుభ్రూః - శుభప్రధమైన కనుబొమలు కలిగినది.
  4. శోభనా - సౌందర్యశోభ కలిగినది.
  5. సురనాయికా - దేవతలకు నాయకురాలు.
  6. కాలకంఠీ - నల్లని కంఠము గలది.
  7. కాంతిమతీ - ప్రకాశవంతమైన శరీరము కలది.
  8. క్షోభిణీ - క్షోభింపచేయునది అనగా మథించునది.
  9. సూక్ష్మరూపిణీ - సూక్ష్మశక్తి స్వరూపిణి.

శ్లోకం 97

  1. వజ్రేశ్వరీ - వజ్రేశ్వరీ నామంగల ఒక అతిరహస్యశక్తి.
  2. వామదేవీ - అందముగా నున్న దేవత.
  3. వయోవస్థావివర్జితా - వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థా ప్రభావం గాని లేనిది.
  4. సిద్ధేశ్వరీ - సిద్ధులకు అధికారిణి.
  5. సిద్ధవిద్యా - సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి.
  6. సిద్ధమాతా - సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది.
  7. యశస్వినీ - యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు.

శ్లోకం 98

  1. విశుద్ధి చక్రనిలయా - విశుద్ధి చక్రములో వసించునది.
  2. ఆరక్తవర్ణా - రక్తవర్ణములో నుండునది.
  3. త్రిలోచనా - మూడు లోచనములు కలది.
  4. ఖట్వంగాది ప్రహరణా - ఖట్వాంగాది ఆయుధములు ధరించునది.
  5. వదనైక సమన్వితా - ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది.

శ్లోకం 99

  1. పాయసాన్న ప్రియా - పాయసాన్నములో ప్రీతి గలది.
  2. త్వక్ స్థా - చర్మధాతువును ఆశ్రయించి ఉండునది.
  3. పశులోక భయంకరీ - పశుప్రవృత్తికి భయమును కలుగచేయునది.
  4. అమృతాది మహాశక్తి సంవృతా - అమృతా మొదలైన మహాశక్తులచేత పరివేష్టింపబడి యుండునది.
  5. ఢాకినీశ్వరీ - ఢాకినీ అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత.

శ్లోకం 100

  1. అనాహతాబ్జ నిలయా - అనాహత పద్మములో వసించునది.
  2. శ్యామభా - శ్యామల వర్ణములో వెలుగొందునది.
  3. వదనద్వయా - రెండు వదనములు కలది.
  4. దంష్ట్రోజ్వలా - కోరలతో ప్రకాశించునది.
  5. అక్ష్మమాలాదిధరా - అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది.
  6. రుధిర సంస్థితా - రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది.

శ్లోకం 101

  1. కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా - కాళరాత్రి మొదలైన పన్నెండి మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
  2. స్నిగ్థౌదన ప్రియా - నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.
  3. మహావీరేంద్ర వరదా - శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.
  4. రాకిణ్యంబా స్వరూపిణీ - రాకిణీ దేవతా స్వరూపిణి.

శ్లోకం 102

  1. మణిపూరాబ్జనిలయా - మణిపూర పద్మములో వసించునది.
  2. వదనత్రయ సంయుతా - మూడు ముఖములతో కూడి యుండునది.
  3. వజ్రాదికాయుధోపేతా - వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
  4. డామర్యాదిభిరావృతా - డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.

శ్లోకం 103

  1. రక్తవర్ణా - ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.
  2. మాంసనిష్ఠా - మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.
  3. గుడాన్నప్రీతమానసా - గుడాన్నములో ప్రీతి కలది.
  4. సమస్త భక్త సుఖదా - అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది.
  5. లాకిన్యంబా స్వరూపిణీ - లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.

శ్లోకం 104

  1. స్వాధిష్ఠానాంబుజగతా - స్వాధిష్ఠాన పద్మములో వసించునది.
  2. చతుత్వక్త్ర మనోహరా - నాలుగు వదనములతో అందముగా నుండునది.
  3. శూలాధ్యాయుధ సంపన్నా - శూలము మొదలైన ఆయుధములు ధరించి యుండునది.
  4. పీతవర్ణా - పసుపు పచ్చని రంగులో ఉండునది.
  5. అతిగర్వితా - మిక్కిలి గర్వంతో నుండునది.

శ్లోకం 105

  1. మేదోనిష్ఠా - మేదస్సు ధాతువును ఆశ్రయించి యుండునది.
  2. మధుప్రీతా - మధువులో ప్రీతి కలిగినది.
  3. బందిన్యాది సమన్వితా - బందినీ మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది.
  4. దధ్యన్నాసక్త హృదయా - పెరుగు అన్నం ఇష్టపడునది.
  5. కాకినీ రూపధారిణీ - కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది.

శ్లోకం 106

  1. మూలాధారాంభుజారూఢా - మూలాధార పద్మములో అధివసించునది.
  2. పంచ వక్త్రా - ఐదు ముఖములతో నుండునది.
  3. అస్థి సంస్థితా - ఎముకలను ఆశ్రయించి ఉండునది.
  4. అంకుశాది ప్రహరణా - అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
  5. వరదాది నిషేవితా - వరదా మొదలైన నలుగురు పరివార దేవతలచే సేవింపబడునది.

శ్లోకం 107

  1. ముద్గౌదనాసక్తచిత్తా - పులగములో ప్రీతి కలది.
  2. సాకిన్యంబా స్వరూపిణీ - సాకినీ దేవతా స్వరూపముగా నుండునది.
  3. ఆజ్ఞా చక్రాబ్జనిలయా - ఆజ్ఞాచక్ర పద్మంలో వసించునది.
  4. శుక్లవర్ణా - తెలుపురంగులో ఉండునది.
  5. షడాసనా - ఆరు ముఖములు కలది.

శ్లోకం 108

  1. మజ్జా సంస్థా - మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది.
  2. హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా - హంసవతీ, క్షమావతీ ముఖ్య శక్తులతో కూడి ఉండునది.
  3. హరిద్రాన్నైక రసికా - పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది.
  4. హాకినీ రూపధారిణీ - హాకినీ దేవతా రూపమును ధరించి ఉండునది.

శ్లోకం 109

  1. సహస్రదళ పద్మస్థా - సహస్రార కమలములో ఉండునది.
  2. సర్వవర్ణోప శోభితా - అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు, వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లునది.
  3. సర్వాయుధ ధరా - అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది.
  4. శుక్ల సంస్థితా - శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండునది.
  5. సర్వతోముఖీ - సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది.

శ్లోకం 110

  1. సర్వౌదన ప్రీత చిత్తా - అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించునది.
  2. యాకిన్యంబా స్వరూపిణీ - యాకినీ దేవతా స్వరూపములో ఉండునది.
  3. స్వాహా - చక్కగా ఆహ్వానించునది.
  4. స్వధా - శరీర ధారణ ప్రక్తియకు సంబంధించిన స్వాగత వచనము.
  5. అమతిః - మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి.
  6. మేధా - ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది.
  7. శ్రుతిః - చెవులతో సంబంధము కలిగినది.
  8. స్మృతిః - మరల మరల గుర్తుకు తెచ్చుకొను లక్షణము.
  9. అనుత్తమా - తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది.

శ్లోకం 111

  1. పుణ్యకీర్తి - మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది.
  2. పుణ్యలభ్యా - సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.
  3. పుణ్య శ్రవణ కీర్తనా - పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయునది.
  4. పులోమజార్చితా - పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది.
  5. బంధమోచనీ - అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది.
  6. బంధురాలకా - అందమైన చిక్కనైన ముంగురులు కలది.

శ్లోకం 112

  1. విమర్శరూపిణీ - జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపము కలది.
  2. విద్యా - జ్ఞాన రూపిణి.
  3. వియదాది జగత్ప్రసూ - ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది.
  4. సర్వవ్యాధి ప్రశమనీ - అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది.
  5. సర్వమృత్యు నివారిణీ - సకల మృత్యుభయాలను పోగొట్టునది.

శ్లోకం 113

  1. అగ్రగణ్యా - దేవతలందరిలో ముందుగా గణింపబడేది.
  2. అచింత్యరూపా - చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవికానిది.
  3. కలికల్మషనాశినీ - కలియుగ మలినములను పోగొట్టునది.
  4. కాత్యాయనీ - కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది.
  5. కాలహంత్రీ - కాలమును హరించునది.
  6. కమలాక్ష నిషేవితా - విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడునది.

శ్లోకం 114

  1. తాంబూల పూరితముఖీ - తాంబూలము చేత నిండి పండిన నోరు కలది.
  2. దాడిమీ కుసుమప్రభా - దానిమ్మపువ్వు ప్రభతో విరాజిల్లునది.
  3. మృగాక్షీ - ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలుగల కళ్ళు కలది.
  4. మోహినీ - మోహనమును కలుగజేయునది.
  5. ముఖ్యా - ముఖ్యురాలు.
  6. మృడానీ - మృడుని పత్ని.
  7. మిత్రరూపిణీ - మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది.

శ్లోకం 115

  1. నిత్యతృప్తా - నిత్యసంతుష్టి స్వభావము కలది.
  2. భక్తనిధిః - భక్తులకు నిధి వంటిది.
  3. నియంత్రీ - సర్వమును నియమించునది.
  4. నిఖిలేశ్వరీ - సమస్తమునకు ఈశ్వరి.
  5. మైత్ర్యాది వాసనాలభ్యా - మైత్రి మొదలైన వాసనా చతుష్టయము గలవారిచే పొందబడునది.
  6. మహాప్రళయ సాక్షిణీ - మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా ఉండునది.

శ్లోకం 116

  1. పరాశక్తిః - అన్ని శక్తులకు అతీతంగా ఉండి, వాటన్నిటికీ నేపథ్యంలో వర్తించే శక్తి.
  2. పరానిష్ఠా - సర్వాంతర్యామిని సర్వమునందు చూడగలుగు నిష్ఠను సూచించునది.
  3. ప్రజ్ఞాన ఘనరూపిణీ - ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం.
  4. మాధ్వీపానాలసా - మధుసంబంధిత పానము వలన అలసత్వము చెందినది.
  5. మత్తా - నిత్యము పరవశత్వములో ఉండునది.
  6. మాతృకావర్ణరూపిణీ - అన్ని రంగులకు తల్లివంటి రంగు యొక్క రూపంలో ఉండునది.

శ్లోకం 117

  1. మహాకైలాస నిలయా - గొప్పదైన కైలసమే నిలయముగా గలది.
  2. మృణాల మృదుదోర్లతా - తామరతూడులవంటి మృదువైన బాహువులు గలది.
  3. మహనీయా - గొప్పగా ఆరాధింపబడునది.
  4. దయామూర్తిః - మూర్తీభవించిన దయాలక్షణము గలది.
  5. మహాసామ్రాజ్యశాలినీ - పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వసామ్రాజ్యమునకు అధినాయకురాలు.

శ్లోకం 118

  1. ఆత్మవిద్యా - ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు.
  2. మహావిద్యా - గొప్పదైన విద్యా స్వరూపురాలు.
  3. శ్రీవిద్యా - శ్రీ విద్యా స్వరూపిణి.
  4. కామసేవితా - కాముని చేత సేవింపబడునది.
  5. శ్రీ షోడశాక్షరీ విద్యా - సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి.
  6. త్రికూటా - మూడు కూటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి.
  7. కామకోటికా - కామమునకు పై అంచునగలదాని స్వరూపిణి.

శ్లోకం 119

  1. కటాక్షకింకరీ భూతకమలాకోటిసేవితా - అనుగ్రహ వీక్షణ మాత్రముచే భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహముచేత సేవింపబడునది.
  2. శిరఃస్థితా - తలమిద పెట్టుకోవలసినది.
  3. చంద్రనిభా - చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడు యుండినది.
  4. ఫాలస్థా - ఫాల భాగమునందు ఉండునది.
  5. ఇంద్రధనుఃప్రభా - ఇంద్రధనుస్సు లోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది.

శ్లోకం 120

  1. హృదయస్థా - హృదయమునందు ఉండునది.
  2. రవిప్రఖ్యా - సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది.
  3. త్రికోణాంతర దీపికా - మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క మద్యమున వెలుగుచుండునది.
  4. దాక్షాయణీ - దక్షుని కుమార్తె.
  5. దైత్యహంత్రీ - రాక్షసులను సంహరించింది.
  6. దక్షయజ్ఞవినాశినీ - దక్షయజ్ఞమును నాశము చేసినది.

శ్లోకం 121

  1. దరాందోళితదీర్ఘాక్షీ - కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.
  2. దరహాసోజ్జ్వలన్ముఖీ - మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.
  3. గురుమూర్తిః - గురువు యొక్క రూపముగా నున్నది.
  4. గుణనిధిః - గుణములకు గని వంటిది.
  5. గోమాతా - గోవులకు తల్లి వంటిది.
  6. గుహజన్మభూః - కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది.

శ్లోకం 122

  1. దేవేశీ - దేవతలకు పాలకురాలు.
  2. దండనీతిస్థా - దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.
  3. దహరాకాశరూపిణి - హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది.
  4. ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజితా - పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.

శ్లోకం 123

  1. కళాత్మికా - కళల యొక్క రూపమైనది.
  2. కళానాథా - కళలకు అధినాథురాలు.
  3. కావ్యాలాపవినోదినీ - కావ్యముల ఆలాపములో వినోదించునది.
  4. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా - వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.

శ్లోకం 124

  1. ఆదిశక్తిః - ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.
  2. అమేయా - కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.
  3. ఆత్మా - ఆత్మ స్వరూపిణి.
  4. పరమా - సర్వీత్కృష్టమైనది.
  5. పావనాకృతిః - పవిత్రమైన స్వరూపము గలది.
  6. అనేకకోటి బ్రహ్మాండజననీ - అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.
  7. దివ్యవిగ్రహా - వెలుగుచుండు రూపము గలది.

శ్లోకం 125

  1. క్లీంకారీ - ' క్లీం ' అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
  2. కేవలా - ఒకే ఒక తత్వమును సూచించునది.
  3. గుహ్యా - రహస్యాతి రహస్యమైనది.
  4. కైవల్యపదదాయినీ - మోక్షస్థితిని ఇచ్చునది.
  5. త్రిపురా - మూడు పురములను కలిగి ఉంది.
  6. త్రిజగద్వంద్యా - మూడు లోకములచే పూజింపబడునది.
  7. త్రిమూర్తిః - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది.
  8. త్రిదశేశ్వరీ - దేవతలకు ఈశ్వరి.

శ్లోకం 126

  1. త్ర్యక్షరీ - మూడు అక్షరముల స్వరూపిణి.
  2. దివ్యగంధాడ్యా - దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.
  3. సిందూర తిలకాంచితా - పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.
  4. ఉమా - ఉమా నామాన్వితురాలు.మూడు లోకములచే పూజింపబడునది.
  5. శైలేంద్రతనయా - హిమవత్పర్వతము యొక్క కుమార్తె.
  6. గౌరీ - గౌర వర్ణములో ఉండునది.
  7. గంధర్వసేవితా - గంధర్వులచేత పూజింపబడునది.

శ్లోకం 127

  1. విశ్వగర్భా - విశ్వమును గర్భమునందు ధరించునది.
  2. స్వర్ణగర్భా - బంగారు గర్భము గలది.
  3. అవరదా - తనకు మించిన వరదాతలు లేనిది.
  4. వాగధీశ్వరీ - వాక్కునకు అధిదేవత.
  5. ధ్యానగమ్యా - ధ్యానము చేత పొందబడునది.
  6. అపరిచ్ఛేద్యా - విభజింప వీలులేనిది.
  7. జ్ఞానదా - జ్ఞానమును ఇచ్చునది.
  8. జ్ఞానవిగ్రహా - జ్ఞానమును మూర్తిగా దాల్చింది.

శ్లోకం 128

  1. సర్వవేదాంత సంవేద్యా - అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడునది.
  2. సత్యానంద స్వరూపిణీ - నిత్యసత్యమైన ఆనందమును స్వరూపముగా గలది.
  3. లోపాముద్రార్చితా - లోపాముద్రచే అర్చింపబడింది.
  4. లీలాక్లుప్త బ్రహ్మాండమండలా - క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది.

శ్లోకం 129

  1. అదృశ్యా - చూడబడనిది.
  2. దృశ్యరహితా - చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.
  3. విజ్ఞాత్రీ - విజ్ఞానమును కలిగించునది.
  4. వేద్యవర్జితా - తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది.
  5. యోగినీ - యోగముతో కూడి ఉంది.
  6. యోగదా - యోగమును ఇచ్చునది.
  7. యోగ్యా - యోగ్యమైనది.
  8. యోగానందా - యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.
  9. యుగంధరా - జంటను ధరించునది.

శ్లోకం 130

  1. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ - స్వేచ్ఛాసంకల్పశక్తి, జ్ఞానకారకమైన శక్తి, కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉంది.
  2. సర్వాధారా - సమస్తమునకు ఆధారమైనది.
  3. సుప్రతిష్ఠా - చక్కగా స్థాపించుకొనినది.
  4. సదసద్రూపధారిణీ - వ్యక్తమైనదిగాను, వ్యక్తముకాని దానిగాను రూపమును ధరించునది.

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow