ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి - తమ్మోజు

గాయత్రీ విశ్వకర్మలకు సంబంధించి వేదంలో ఎక్కడైనా ప్రస్తావన ఉన్నదా? అని నేను ప్రశ్నిస్తూ ఒక మెసేజ్ ని పెట్టడం జరిగింది.

Oct 26, 2022 - 15:36
Nov 9, 2022 - 09:14
 2
ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి - తమ్మోజు

గాయత్రీ విశ్వకర్మలకు సంబంధించి వేదంలో ఎక్కడైనా ప్రస్తావన ఉన్నదా?

అని నేను ప్రశ్నిస్తూ ఒక మెసేజ్ ని పెట్టడం జరిగింది. అంతో ఇంతో సంస్కృతాన్ని అభ్యసించిన వాడిగా నేనే ఎందుకు పరిశీలించకూడదు అని అత్యంత ప్రామాణికమైన ఋగ్వేద మంత్రాలను పరిశీలించాను.

విశ్వకర్మ సృష్టికర్త అని చెప్పబడిన ఛందోబద్ధమైన సృష్టి సూక్తం ఉన్నది ఋగ్వేదంలోనే కదా! గాయత్రీ పదం వివిధ విభక్తులలో ఋగ్వేదంలో మొత్తం 24 మంత్రాల్లో ఉంది. అన్నిటా ఛందస్సు అర్ధ పరంగానే ఉన్నది.

దేవతా పరంగా లేదు. పదవ మండలం 130వ సూక్తం నాలుగవ మంత్రం లో ఇలా ఉంది: అగ్నేర్గాయత్య భవత్ సయుగ్వా.

దీనికి సాయణుల భాష్యం ఇలా ఉంది: "యష్టవ్యాత్ =ప్రజాపతేర్ముఖాదజాయత . దేవతాసు మధ్యే అగ్నిః ఛన్దః సు గాయత్రీ చ ఉభౌ అవాప్య అజాయత. దేవతలతో పాటు అగ్ని గాయత్రీ చందస్సు రెండు కూడా ప్రజాపతి ముఖము నుండి ఆవిర్భవించాయి.

ఇదే భావం తైత్తిరీయము 8-1-1-4లో ప్రజాపతి రకామయత ప్రజాయేయేతి. తామగ్నిర్దేవతాన్వసృజత గాయత్రీ ఛన్దః. గాయత్రీ ఛందము యొక్క విశిష్టత అనేక మంత్రములలో చెప్పబడ్డది కాబట్టి గాయత్రీ మంత్రమును చందస్సులుకుమాత అని గౌరవించబడినది.

ధ్యావా భూమీన్ జనయన్దేవ ఏకః తానొక్కడే భూమి ఆకాశాదులను సృజించెనని ఋక్.10.81.3 లో కలదు‌కదా!

స్మృతులకు వేదములకు ధర్మ సంకటస్థితి వచ్చినప్పుడు కేవలం వేదంలో చెప్పిన విషయాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి.

అనగా వేదమును మించిన ప్రమాణం లేదు కావున గాయత్రిని దేవతగా భావించి గాయత్రీ విశ్వకర్మలకు కళ్యాణమొనర్చుట అక్షరాల వేద విరుద్ధమేనని నా నిశ్చితఅభిప్రాయము.

అధ్యయనము, బోధనము అనగా వృత్తి ప్రవృత్తులు వేదముగా కలిగిన వారు ఛాందసులు.

వేదమును తప్ప అన్యమును ఏమాత్రమును అంగీకరింపని వారు "పరమ ఛాందసులు" ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి అనువేదమంత్రార్థాన్ని అనుష్ఠించి, వైదికసత్యాన్ని ప్రకటించవలసిన సమయంలో ప్రకటించకపోవటంలో అలసత్వం వహించినా , అలా ప్రకటించినది తప్పైనా అది ప్రజ్ఞాపరాధము అవుతుంది.

అంటే తన ప్రజ్ఞను సత్యబద్ధంగా వినియోగించ కపోవడం.

ఈ భావాన్నే మరో తైత్తిరీయ మంత్రం

స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యమ్ అని శాసిస్తుంది.

నిరంతర అధ్యయనం మరియు అధ్యయనం చేసిన విషయాన్ని లోకానికి అందించడంలోనూ ఈ రెండింటిలోనూ ఏ మాత్రం భ్రమ ప్రమాదములు ,అలసత్వము ఉండరాదు అని శాసించి హెచ్చరించింది.

"సారపు ధర్మమున్ విమలసత్యము " పారము పొందలేనప్పుడు దక్షులైనవారుపేక్ష చేయరాదు. అలా ఉపేక్షిస్తే 'సమర్ధత' అనే పదానికి అర్థం పోతుంది. అది వారి పరిజ్ఞానానికే భంగపాటు అవుతుంది. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి... తద్ వక్తారమవతు

-- తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow