విశ్వబ్రాహ్మణులు/ విశ్వకర్మలు- జయంతి వృత్తులు

Sep 3, 2021 - 06:38
 0
విశ్వబ్రాహ్మణులు/ విశ్వకర్మలు- జయంతి వృత్తులు

విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు

 ఒక సామాజిక వర్గం, కులం

విశ్వకర్మ ఎవరు ?

విశ్వకర్మ భగవాన్ రూపాలు ఎన్ని రకాలు..?

అసలు ఈ జయంతి ఏ విశ్వకర్మది ...?

జయంతిలేని విశ్వకర్మకు జయంతి చేస్తున్నాము. జన్మించిన విశ్వకర్మకు జయంతి చేయటం లేదు.

1 ) పరమాత్మ విశ్వకర్మ.:- ఐదు ముఖాలు, పది హస్తాలు కలిగిన రూపం. ఇతను ప్రధాన దేవతలకు కనిపించును ( ఇతనికి జయంతి (పుట్టుక) లేదు ).

2). భువన పుత్ర విశ్వకర్మ :- ఒక తల, నాలుగు హస్తాలు ( ఇతనికి జయంతి (పుట్టుక) లేదు ).

3). దేవశిల్పి విశ్వకర్మ :- ఒక తల రెండు హస్తాలు ( ఇతని జయంతి సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినపుడు ఇంచుమించుగా సెప్టేంబర్ 17 న ).

1. పరమాత్మ విశ్వకర్మ

ఋగ్వేద దశమ మణ్డల సూక్త ౮౧ । ౧౦.౮౧ సస్వర

వి॒శ్వత॑శ్చక్షురు॒త వి॒శ్వతో॑ముఖో వి॒శ్వతో॑బాహురు॒త వి॒శ్వత॑స్పాత్ । సం బా॒హుభ్యాం॒ ధమ॑తి॒ సం పత॑త్రై॒ర్ద్యావా॒భూమీ॑ జ॒నయ॑న్దే॒వ ఏకః॑ ॥ ౩॥

తా॥ ఆ పరమాత్మ అంతటా కన్నులు కలవాడు, అన్ని వైపులా పాదములు కలవాడు, అంతటా బాహువులును, అంతటా నిండియున్న స్వయం ప్రకాశుడునూ, అద్వితీయుడును అయిన ఆ విశ్వబ్రహ్మ ఒక్కడే స్వర్గ, మార్త్యలోకములను సృజించుచూ ధర్మాధర్మములనేడి బాహువులచే పతనశీలములకు ఉపాదానకారణములచే జగత్తును స్వాదీనము చేసికొనుచున్నాడు.


మాగశుద్ధ త్రయొదశి నాడు పరమాత్మ విశ్వకర్మను పూజిస్తారు.

శ్లో॥ నభూమి నజలం చైవ నతేజో నచ వాయవ:
  నచబ్రహ్మ నచవిష్ణు నచ రుద్రస్య తారకః
  సర్వశూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ:

-మూల స్తంభ పురాణం

(తా||భూమి, జలము, అగ్ని, వాయువు ఆకాశము, బ్రహ్మ , విష్ణు , మహేశ్వర ,ఇంద్ర ;సూర్య ; నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను. భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ తనంతట తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు.)

గమనిక: పంచభూతములు పుట్టక ముందే విశ్వకర్మ ఉన్నటైతే అతని ఆ స్వరూపము ఎలా వచ్చింది ?,

సమాధానం : మనము మననము చేసుకొనేందుకు, గుర్తుకు ఆ విధంగా విగ్రహాన్ని రూపొందిచారు.

శ్లో॥ పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః

తా॥ తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖములో సనాతన ఋషి, పశ్చిమ ముఖములో అహభూన ఋషి, ఉత్తర ముఖములో బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖములో సుపర్ణ ఋషులుద్బవించిరి.విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతములో సానగబ్రహ్మర్షి మకుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవములో సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషములో ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానములో సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినై.

ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్టను గుర్తిస్తారు.

2.భౌవనపుత్ర విశ్వకర్మ

ఏనుగు వాహనంగా కలవాడు భౌవనపుత్ర విశ్వకర్మ (ఏనుగు నల్లదా తెల్లదా అనేది ముఖ్యము కాదు) హిరణ్యగర్భమును పాలించు భౌవన ప్రభువు కుమారుడు భౌవనపుత్ర విశ్వకర్మ.

భౌవన పుత్ర విశ్వకర్మావతారము:-

శ్లో॥ ఏతేనహవా ఐంద్రేణ మహీభిషేకేణ కశ్యపో విశ్వకర్మణం భౌవన
 మభిషిషేచ। తస్మాదు విశ్వకర్మా భౌవనః సమస్తం సర్వతః
 పృధ్వివీం జయ ౯ పరియాశ్వై రుచమేద్వైరీజే ॥

హిరణ్యగర్బము పాలించు భౌవన ప్రభువు కుమారుడు భౌవన పుత్ర విశ్వకర్మ ధరణి యందు జన్మించి కశ్యపుడు(భౌవనుడు) సర్వోత్కృష్టమైన సార్వభౌమ పట్టాభిషిక్తుండచేసేను. భౌవన పుత్ర విశ్వకర్మ సామ్రాజ్యము (వేదపురము) భూప్రపంచమెలాగుననగా, ఇది మొదలు భూప్రభువు ఒక్కడేనే చతుస్సముద్ర ముద్రితమై, భూమండంలం మంతయు పరిపాలన చేయుచున్నవాడు.

ఒక శిరస్సు నాలుగు హస్తములు, ఏనుగు వాహనంగా కలవాడు భౌవనపుత్ర విశ్వకర్మ. జనులకు మొట్ట మొదటి గురువులైయిన భౌవన పుత్ర విశ్వకర్మ యోక్క పూజ ప్రతి సంవత్సరం చైత్రశుక్ల పంచమి నాడు పూజ జరుపుకొందురు. ముఖ్యంగా కర్మాగారాముల యందు, పారిశ్రామిక ప్రాంతాముల యందు ఈ పూజ తప్పక జరుపుకొందురు. వారి పనిముట్లను భౌవన పుత్ర విశ్వకర్మ ముందుంచి పూజించెదరు. భౌవన పుత్ర విశ్వకర్మను పూజించువారు విశిష్టజ్ఞానమును పొందుదురు

కశ్యపమహాఋషి గూర్చి హరిదత్తాచార్యుల బాష్యం : కశ్యపోయాస్వింద్రః కశ్యప ఇ త్యాదిత్య స్వాభిదానం, పశ్యతి సర్వమితి పశ్యః, పశ్య ఏవపశ్యః తత్రాద్యంత విపరయ్యయెణ కశ్యపో భవతి. కించ దృశ్యతే చారణ్యకేచ కశ్యపః పశ్యకో భవతి యత్సర్వం పరిపశ్యతీతి.

సర్వమూ చూచువాడు, సర్వాంతర్యామి, పశ్యుడు, ఆద్యంతవిపర్యయము వలన కశ్యపుడైనాడని, అతడే పరమాత్మని యజురారణ్యకము (యజుర్వేదం)నందుండి. గశ్యపో విరాట్స్వరూప మని స్కందపురాణం లో నాల్గవ అద్యాయం చేప్పబడుచున్నది. అంటే కశ్యపమహర్షే ఆ విరాఠ్ విశ్వకర్మ. ఈ భౌవన పుత్రవిశ్వకర్మ జగత్పాలన కర్త, యజ్ఞకర్త, అశేషసృష్టికర్త:

శ్లో॥ భువనో నామ యోదేవో విశ్వకర్మాథ తత్సుతః

ప్రసిద్ధో యస్స శాస్ర్తేషు భౌవనః సురవర్ధకీ

విశ్వకర్మా స్వయం తత్ర చిత్రా ౯ లోకా ౯ వినిర్మమే

ప్రాసాదాశ్చ విమానాని వాప్యుద్యానా న్యలంకృతిః

వస్త్ర వాద్యాది వస్తూని విచిత్రాణీ పృథక్పృథక్॥

తా॥ భువనుడను పేరుగల దేవునికి శాస్త్ర ప్రసిద్ధుడగు విశ్వకర్మ అని పిలువబడే కుమారుడు గలడు, భౌవన దేవ దేవుడు, స్వయముగా చిత్రమైన లోకములను సృష్టించినవాని కుమారుడు భౌవనపుత్ర విశ్వకర్మ, ప్రాసాదములు, విమానములు, బావులు, ధాన్యములు, భూషణములు, విచిత్రములగు వస్త్రములు, వాద్యములు, అలాంటి వస్తువులు అనేకమైనవి సృష్టించేను అటులనే పరమేశ్వరుని యోక్క అవతారమరూపమై, భౌవన పుత్రవిశ్వకర్మ లోకపాలన, లోక సృష్టి కర్తవ్యముల కొరకు అవతరించారని తెలియుచున్నది.

శ్లో॥ సమస్త భువనాధారం, మత్వా బ్రహ్మండ మధ్యతః

విశ్వకర్మ మహామేరుం, విశ్వశంకుం నిధాయ సః

పద్మకోశంనిభం మేరుం, కృత్వా తస్మి న్మహూన్నాతే,

అసృజ ద్విశ్వకర్మాయం, భువనాని చతుర్ధశ.

తా॥ ఆ విశ్వకర్మ గొప్పదైన మేరు పర్వతము(లాంటి) ఎల్లలోకములకు ఆధరమైన విశ్వశంకువుగా భావింపబడిన బ్రహ్మండమునకు నడుమ తామర మొగ్గవంటి మేరువును ఉంచి పదునాలుగు భువనములను సృష్టించినాడు. ఆలాంటి ఒక భువనమునకు ప్రభువు భౌవన విశ్వకర్మ అని తెలియుచున్నది. భౌవన పుత్ర విశ్వకర్మ, శిల్పి విశ్వకర్మ తపఃశక్తితో సాక్షాత్కరింపబడి తన సర్వశక్తులను దేవశిల్పివిశ్వకర్మకొసంగి భవిష్యమానవులకు ఉద్దరింప మనెను. అటు పిమ్మట మానవులందరూ దేవశిల్పివిశ్వకర్మను స్మరించుచూ తమతమ నైపుణ్యమును చూపుతున్నవారై జీవనమును సాగించుచున్నారు.

పరబ్రహ్మ విశ్వకర్మని సాక్షాత్ కారం చేసుకున్నా మొట్ట మొదటి గురువులైయిన భౌవన పుత్ర విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం చైత్రశుక్ల పంచమి నాడు పూజ జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు, పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.


3. దేవశిల్పి విశ్వకర్మ :-

దేవశిల్పి విశ్వకర్మ అష్టవసువుల వంశము నుండి   ఉద్బవించిన వాడు
హంసవాహనంగా కలవాడు దేవశిల్పి విశ్వకర్మ

దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు, మానవులకు ఇతడు శిల్ప గురువైయున్నాడు. పురాణముల ప్రకారం ప్రభాసుడైన మనువుకు, బృహస్పతి చెల్లెలైన యోగసిద్ధికి జన్మించిన వాడు దేవశిల్పి విశ్వకర్మ. యోగసిద్ధి ప్రభాసుని భార్య. ప్రభాసుడు వసువులలో ఎనిమిదవవాడు. ప్రభాసుడు వశిష్టమహాముని ఆశ్రమము లోని నందిని అనే ఆవును యోగసిద్ధి కోరిక మేరకు అపహరించిన వాడైనందున శాపగ్రస్తుడై మానవ జన్మనెత్తి (దేవపుత్రుడు) భీష్మాచార్యునిగా శంతనుడికి, గంగకు జన్నించేను. అంగీరసుడు, అంగిరుడు అను ఈ ఇద్దరు ఒక్కరే వేరు వేరు కాదు, బ్రహ్మమానసపుత్రులలో అంగీరసుడు ఒక్కఁడు. అంగీరసుని భార్య స్మృతి. ఇతనికి బృహస్పతి, ఉతథ్యుఁడు లేక సంవర్తుఁడు అను నిరువురు కొడుకులును, యోగసిద్ధి అను నొక కూఁతురును కలిగిరి. ఈ యోగసిద్ధిని అష్టవసువులలో ఒక్కఁడగు ప్రభాసుని వివాహము చేసికొనెను.

దేవశిల్పివిశ్వకర్మయను ప్రజాపతి వేలశిల్పములకాయన కర్త. భౌవన పుత్ర విశ్వకర్మ, దేవశిల్పి విశ్వకర్మ తపఃశక్తితో సాక్షాత్కరింపబడి తన సర్వశక్తులను దేవశిల్పివిశ్వకర్మకొసంగినాడు. త్రిదశలకు (దేవతలకు) అతడు వర్ధకి (శిల్పి). సర్వభూషణ శిల్పకల్పనము చేయువాడు. దేవతా విమాననిర్మాత యాతడు. దేవశిల్పి విశ్వకర్మ యోక్క భార్య ఆకృతి (Bhagavatam 6.6.15). దేవశిల్పి విశ్వకర్మ యోక్క కుమార్తె సంజ్ఞ ఈమె సూర్యుని భార్య. సూర్యుని వేడికి సంజ్ఞ తట్టుకోనలేకపోవుటచే శిల్పివిశ్వకర్మ సూర్యూని సానబెట్టి, అతని వేడిని కొద్దిగా తగ్గించినాడు. సూర్యుని సానబెట్టగావచ్చినటువంటి పొడి నుంచి తయారు చేసినటువంటి సుదర్శన చక్రము విష్ణుమూర్తి ఆయుధమై శోభిల్లుతున్నది.

దేవశిల్పి విశ్వకర్మ అష్టవసువుల వంశమునుండి ఉద్బవించిన మహర్షి, దేవతలకు, మానవులకు ఇతడు శిల్ప గురువై దేవతలలో ఒకడై యున్నాడు. ఒక శిరస్సు రెండు భుజములు, హంసవాహనముగా కలవాడు, ఇతని జయంతి సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినపుడు ఇంచుమించుగా సెప్టేంబర్ (September 17th) న జరుపుకుందురు

హిందువుల పురాణముల ప్రకారం శిల్పి విశ్వకర్మ ఎన్నో పట్టణాలను 
నాలుగు యుగాలలోనూ నిర్మించినారు.

సత్యయుగములో దేవతల నివాసం కోరకు స్వర్గలోకమును నిర్మించినారు.
త్రేతాయుగములో అయోధ్యను, శివుని కొరకు సువర్ణ లంకను నిర్మించినారు.
ద్వాపర యుగములో ద్వారకానగరాన్ని,
కలియుగములో హస్తినాపురమును, వారణావతి (లక్కభవనము), ఇంద్రప్రస్థము నిర్మించినారు.
వాస్తుగ్రంధాములను (12000 – ప్రస్తుతము అన్నిలేవు) రచించిన ఋషి దేవశిల్పి విశ్వకర్మ.
యజ్ఞకుండము. యజ్ఞాయుధములు సృష్టించినారు.

విశ్వకర్మ ధ్వజము [ పరమాత్మ విశ్వకర్మ ధ్వజ నిర్మాణము]

శ్లో|| గగనం నీల వర్ణం చ మారుతం ధూమ్ర వర్ణకం
పావకో రక్త వర్ణం చ సలిలం శుభ్ర వర్ణకం
హరిద్రా వర్ణకం పృధ్వి పఞ్చ భూతాని ఇతి క్రమాత్||

1. ఆకాశము - నీలం రంగు

2. వాయువు - గచ్చకాయ రంగు

3. అగ్ని - ఎరుపు రంగు

4. నీరు - తెలుపు రంగు

5. భూమి - పసుపు రంగు

6. ఓం - బంగారు రంగు

ఇది పంచభుత సహిత పరమాత్ముని యొక్క ధ్వజము (జెండా), దీనిని ప్రతీ మానవుడు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయు ముందు ఈ ధ్వజమును ప్రతిస్ధాపన చేయవలెను. మన ప్రాచీన శాస్త్రముల ప్రకారము ఈ పరమాత్మ ధ్వజమును ప్రతీ మానవుడు తమ తమ ఇండ్ల పై, కార్యాలయముల పై, పనిచేయు కర్మాగారముల పై, దేవాలయముల పై ప్రతిస్ధాపన చేయవలెనని బుుషులు, జ్యోతీష్య పండితులు తెలియజేయుచున్నారు. ఈ విధముగా ధ్వజ స్ధాపన చేయుట వలన గ్రహముల నుండి వచ్చు దుష్ట ప్రభావము జీవజాలములపై (మనపై) చూపవు. పరమాత్మ నిరాకారుడు (ఆకారము లేనివాడు అని అర్ధము) అందుచేత ధ్వజము యొక్క మధ్యభాగములో ఉన్న చిహ్నం ఏ జీవమున్న రూపము గాని, జంతు రూపము గాని, మానవాకారం గాని పొందు పరచబడలేదు. ఓం కారం కూడా ఒక ఆకారము ఐనప్పటికిని మానవుని నిర్మితం కాదు. ఓం కారం కేవలం ఒక శబ్ధము. పరమాత్ముని యొక్క చిహ్నం. పరమాత్మునిని ఏ మానవుడు వర్ణింపజాలడు. పరమాత్ముని ఉనికిని తెలుసుకొనుటకు మాత్రమే ఈ ధ్వజములో పంచభుతములు, ఓం కారం సాక్షీభుతములు.

విశ్వకర్మ

ప్రధాన వ్యాసం: విశ్వకర్మ విశ్వకర్మ ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడినాడు. అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. కానీ కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొంటాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి. ఇది వేద విరుద్ధం. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొనాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు కనుకనే ఈయన భగవంతుడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది. మహాభరతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది. ఈతని అర్చామూర్తిని విశ్వకర్మ పురాణము పంచ శీర్షుడుగా వర్ణించింది. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు.

వరుస సంఖ్య వృత్తి చేయుపని
1. కమ్మరి అయోకారుడు - ఇనుము పని
2. సూత్రకారుడు (వడ్రంగి ) వర్ధకుడు - కొయ్య పని
3. కాంస్యకారి (కంచరి) తామ్ర కారుడు - రాగి, కంచు, ఇత్తడి పని
4. స్తపతి ( శిల్పి) శిల్ప కారుడు - రాతి పని
5. స్వర్ణకారి స్వర్ణకారుడు - బంగారు పని

విశ్వబ్రాహ్మణులు (విశ్వకర్మలు) చేయు వృత్తులు

విరాట్ విశ్వకర్మ భగవానుడు (పంచముఖుడు) ఐదు ముఖములు కలవాడు. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు, ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు (సనగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సుపర్ణస.) పంచార్షేయబ్రాహ్మణులు(విశ్వబ్రాహ్మణులు)ఉద్భవించారు వీరి ద్వారా చేయు శాస్త్రం, వృత్తులు నిర్ధేశింపబడినవి.వీటితో పాటు పౌరోహిత్యం కూడా వారి వృత్తులలో భాగమే.

వరుస సంఖ్య మూలాఆధారం విశ్వకర్మ ముఖము మహర్షి / గోత్రరిషి శాస్త్రం వృత్తి ప్రోఫిషన్
1. శివుడు మను సానగ బ్రహ్మర్షి తర్కం అయో శిల్పి - కమ్మరి Blacksmith
2. విష్ణువు మయ సనాతన బ్రహ్మర్షి వ్యాకరణం దారు శిల్పి - వడ్రంగి/సూత్రకారుడు Woodsmith ( Carpentar )
3. బ్రహ్మ త్వష్ట అహభునస బ్రహ్మర్షి ధర్మశాస్త్రం తామ్ర శిల్పి - కాంస్య కారి - కంచరి Bronzesmith
4. ఇంద్ర దైవజ్ఞ ప్రత్నస బ్రహ్మర్షి మీమాంస శిలా శిల్పి – స్తపతి (శిల్పి) Stonesmith
5. సూర్య విశ్వజ్ఞ సుపర్ణస బ్రహ్మర్షి వైద్యం, జ్యోతిష్యం స్వర్ణ శిల్పి - స్వర్ణకారి Goldsmith

పూర్వం వృత్తి సమాజంలోని ప్రజలకును, ప్రభువులకును ఉపయోగానికి, తమవిజ్ఞానాన్ని తమదైన శైలిలో ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉపయోగపడే విధానం, అవి క్రమేణా జీవనభృతి కొరకు చేపట్టే పనులు. ఈ వృత్తులు, ప్రజల, ప్రభువుల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి. ప్రాచీన విజ్ఞానానికి నిలువుటద్దం ఈ వృత్తులు.

శిల్పముల రకములు

శిల్పం అంటే చెక్కిన లేక పోతపోసిన ప్రతిమ, ఇవి ముఖ్యంగా మూడు విధములుగా చెప్పవచ్చు. ఏశిల్పమైనా వేదాలలో నుండి వచ్చేవే.ఐదు రకముల శిల్ప విద్యలూ వైదకవిద్యలే.

రాళ్ళతో చేసిన శిల్పాలు

ఇవి నల్ల రాళ్ళ తోనూ పాలరాళ్ళతోనూ చేస్తారు. దేవతా మూర్తులను, రాజులు, రాణులు, గురువులు, జంతువులతో కూడిన కథలు, ఇతిహాసాలు, శాసనాలు, మొదలైనవి శిల్పాలలో చోటు చేసుకుంటాయి. శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమాశాస్త్రమని నేర్పే విద్యని ప్రతిమావిద్య అని అంటారు. శిల్పాలను చెక్కేవారిని 'స్తపతి' లేదా 'శిల్పి' అంటారు. రాతి యుగంలో లిపి బొమ్మలను చెక్కడంద్వారా ఆరంభమైనది. మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహాలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు. అంతే కాకుండా భూమిలోని ఖనిజ సంపద ద్వారా లభ్యమైన రాళ్లు ( వజ్రం, వైఢూర్యం, ముత్యం, పగడం, మొదలగు ) ఆభరణములకు ఇంపుగా పొదగడం ద్వారా నైపుణ్యము సంపాదించిరి.

లోహక్రియ (Metalworking)

లోహక్రియ అనేది విభిన్నమైన లోహాలతో పనిచేయడం. ఇది కొన్ని వస్తువులు తయారుచేయడానికి, అతికించి పెద్ద నిర్మాణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం వీరు చేసే అతిక్లిష్టమైన పనులు. ఇందుకోసం భారీ పనిముట్లు అవసరం ఉంటుంది. లోహక్రియ ఒక కళ, అలవాటు, పరిశ్రమ, వ్యాపారం ఇది కంసాలీల పని. లోహసంగ్రహం, విజ్ఞానశాస్త్రం మొదలైన విధాలుగా ప్రాచీనకాలం నుండి నేటివరకు బాగా విస్తరించింది. ఆదిమానవుని కాలంలోనే లోహాలను తన అవసరాలకనుగుణంగా మలిచి వ్యవసాయ పనిముట్లుగా, వేట ఆయుధాలుగా తయారుచేసి ఉపయోగించాడు. బంగారం వంటి ఖరీదైన లోహాలను ఆభరణాలుగా మలిచేవారిని స్వర్ణకారి (బంగారుపనివాడు) (Goldsmith) అంటారు.

కలపతో చేసినవి (Wooden works)

కలపతో ఇండ్లకు కావలసిన ద్వారబంధములు, తలుపులేకాక భవన నిర్మాణాలు, దేవతా మూర్తులను, నగిషీలు (కార్వింగు), వివిధ బొమ్మలు, పెద్ద ఓడలు, వంతెనలు మొదలైనవి నిర్మించడం, వ్యవసాయానికి కావలసిన బండ్లు, నాగళ్లు, పనిముట్ల పిడి తయారుచేయడం, మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహలలో కలపను ఉపయోగించడం ప్రారంభించారు.

వృత్తులు-వివరణ

గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. క్రమేణా ఆ పేరు కాస్తా 'కర్మశాల'గా మారి, 'కమశాల'గా మారి, 'కంసాలి' కులం పేరుగా, ఆ కులంలో పుట్టిన వారిని 'కంసాలి' గా పిలవడం జరుగింది.

1. కమ్మరి : - పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము (అయో కారుడు). ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. కమ్మరి ముడి ఇనుమును సంగ్రహించడం, ఇనుమును తయారు చెయ్యడం, ఆ ఇనుముతో వ్యవసాయానికి కావల్సిన కొడవళ్ళ, కర్రు, పార, పలుగు, గునపం, గొడ్డలి, బండికట్టు మొదలైనవి, దేశానికి కావల్సిన వంతెనలు, పరిశ్రమలు, పడవలు, ఫిరంగులు, కత్తులు ... ఇనుప వస్తువు ప్రతిదీ చేసి ఇచ్చే మొట్ట మొదటి మెటల్ ఇంజనీర్ . ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 10వ కులంగా చెప్పబడుతున్న బయట కమ్మరులకు, విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కుల సాంప్రదాయ కమ్మరులకు ఎటువంటి సంబంధమూ లేదు. షెడ్యూల్డు తెగలలోని కమ్మరులు దేశ దిమ్మరులు. విశ్వబ్రాహ్మణ / విశ్వకర్మ కుల సాంప్రదాయ కమ్మరులు ఆంధ్ర ప్రదేశ్ బి.సి కులాల జాబితాలో 21వ కులంగా నిర్ణయించబడి ఉన్నారు. ఉదా : - ఆ రోజుల్లోనే వీరు చేసిన ఇనుములోని స్వఛ్ఛత ఈ రోజుకీ నేటి విదేశీ ఇంజనీర్లు సైతం రాబట్టలేకున్నారు. ఉదాహరణకి ఢిల్లీ లోని విఠోబా స్థంబమే. తయారు చేసి వందల సంవత్సరాలు ఐనా, అది ఈ రోజుకీ తుప్పు పట్టలేదు. ఆ ఇనుము యొక్క స్వఛ్ఛత ఈరోజుకీ ఎవ్వరూ సాధించలేదు.

2. వడ్రంగి :- పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగము వడ్రంగి కలపతో వస్తువులు తయారుచేయు వృత్తిపనివాడు. వడ్రంగి (దారు కారుడు) వ్యవసాయానికి కావల్సిన కాడి, మేడి, నాగలి, బండి..మొదలైనవీ, ప్రజలు బ్రతకడానికి కావల్సిన ఇల్లు, తలుపు, ద్వారము, దార బంద్రం, పీట, మంచం, కుర్చీలు మొదలగునవి. మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టయిన 'చక్రం'...చక్కతో తయారయ్యే ప్రతిది...పిల్లలు ఆడుకున్నే బొంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు..తయారు చేసే మొట్ట మొదటి వుడ్ ఇంజనీర్.వీరిని వడ్ల కమ్మరి, ఆంగ్లంలో కార్పెంటర్స్ (Carpenters) అని కూడా అంటారు.

3. కంచరి :- పంచ వృత్తులలో మూడవ వృత్తి కంచరి (కాంస్యకారుడు) ప్రజలకు కావల్సిన ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు ... ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని ఇత్తడిగా, రాగిగా, కంచుగా మార్చి కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ, దేవాలయాలలో పంచలోహా విగ్రహాలను మొదలగునవి ... ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.

4. శిల్పి :- శిల్పకారుడు (శిల్పి) అంటే రాళ్ళను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు. ఏదైనా తయారు చేసే వాడు (క్రియేటర్) అని అర్థం. దురదృష్టవశాత్తూ, శిల్పి అంటే శిల్పాలు చెక్కే వాడు అని అర్థం మారిపోయింది. శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నాడు మన భారత దేశంలో మనం చూస్తున్న విగ్రహాలు, అద్భుతమైన దేవాలయాలు, మహా మహా నిర్మాణాలు, వంతెనలు, శిలా శాసనాలు, అజంతా ఎల్లోరా గుహలు, కోటలు, మహల్ లు, చెరువులు, ఏకశిలా రథాలు,...... ఎన్ని చేశారో మహానుభావులు. వీరినే 'స్థపతులు' అని అంటారు. జంతర్ మంతర్, నలందా విశ్వ విద్యాలయం, తాజ్ మహల్, బేలూర్, హాలిబేడు, బాదామి గుహలు, హంపి, అజంత, ఎల్లోరా గుహలు, వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి, త్రివేండ్రం లోని అనంత పద్మనాభ స్వామి, మహా బలిపురం, తిరుపతి, శబరిమల, ఎర్రకోట, గోమఠేశ్వర, మధుర మీనాక్షి, హైదరాబాద్ లోని బుద్ధ విగ్రహంమొదలగునవి...... శిలా నిర్ణయం దగ్గర నుండి విగ్రహాలు చెయ్యడం దగ్గర నుండి, స్థల పరీక్ష దగ్గర నుండి, వాస్తు పూజ దగ్గర నుండి, భవన లేదా దేవాలయ ప్లాన్ దగ్గర నుండి... గృహ ప్రవేశం లేదా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనాధికార పర్యంతం...వీరు చెయ్యలేని, వీరి చెయ్యి లేని పని లేదు. వీరు ప్రపంచ దేశాలలో భరత ఖండాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన పుణ్య మూర్తులు. భారత దేశానికి పర్యాటకం మీద ఆదాయం రావడానికి మూలకారణం వీరి చలవే. వీరి కట్టాడాలలోని నైపుణ్యాన్ని, రహస్యాలను ఈనాటికీ మేటి విదేశీ సైంటిస్ట్ లు సైతం అందుకోలేక పోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు.

5. స్వర్ణకారి : - స్వర్ణకారుడు అంటే ముడి బంగారాన్ని సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి, దాన్ని అనుభవ యోగ్యంగా, ఆభరణాలుగా, శిల్పాలుగా, పాత్రలుగా మార్చగలిగినవాడు . ముడి వెండి నుండి పాత్రలు, పూజకు వాడే వస్తు సామగ్రి, కాళ్ళకు పట్టిలు మొదలగునవి.

ఉప వృత్తులు

విశ్వబ్రాహ్మణులు పంచ వృత్తులతో పాటు పౌరోహిత్యం కూడా చేస్తారు.ఇది వారి కుల వృత్తులలో భాగం.

ఉపకులాలు/ఆశ్రితకులాలు

1. రుంజలు:- తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత (కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు, జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిలో రుంజలు కూడా ఉన్నారు. పంచార్షేయుల(విశ్వ బ్రాహ్మణుల) గోత్రాలను, వంశానామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు. వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ దీని శబ్దం కూడా రెండు, మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. రుంజ కారుడు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. "నా సంసార బరువును అది మోస్తున్నపుడు దీని బరువును మెము మోయలేమా" అని ఆ కళాకారులంటారు. రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా అగమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది. 

2. పనసలు:- Panasa's (పనసలు)

అగ్ని మహాదేవికి విశ్వకర్మ తెజస్సుతో ఆవిర్బవించిన బాలుడు పనసచెట్లలో పెరిగాడు. ఆ బాలుడు వంశకర్తగా కలిగిన కులాలవారే పనసలు. వీరు కూడా పంచార్షేయబ్రాహ్మణ(విశ్వబ్రాహ్మణ) కుటుంబాల ఇల్లకు వార్షికంగా వెళ్లి శబ్దం, గానం చేసి ఆదరణను పొందుతుంటారు, భోజన తాంబుల - దక్షిణలతో జీవితాలను కొనసాగిస్తుండేవారు - క్రమం క్రమంగా వీరి జాడ కనుమరుగవుతున్నది. 

3. పౌరోహిత్యం:-పౌరోహిత్యము ఒక వృత్తి మాత్రమే, పౌరోహిత్యము చేయువానిని పురోహితుడు అని అంటారు, పురోహితుడు అనగా పురజనులకు (ప్రజలకు) హితము పలికెడి వాడు అని అర్థం. అనగా, మనము ఏదైన పనిచేయబోయినప్పుడు, ముందుగా, అతనిని సంప్రదిస్తే, ఆ పని చేయడం లోని మంచి, చెడ్డలను చెప్పి, ఆ పని చేయడం యోగ్యమయిన దయితే, దానిని నిర్వర్తించే విధానం తెలిపేవాడు పురోహితుడు. అందువలన, ఒకపనిని, స్వప్రయోజనాన్ని ఆశించిగాని, లేదా ఇతర కారణముల వలన గాని మన చేత చేయిస్తే, దాని వలన వచ్చే పాపము పురోహితునికే వెడుతుందిగాని, మనకు కాదు. అందువలన, ఏ పనిచేయడానికైనా ముందు పురోహితుని అనుజ్ఞ తీసుకోవాలి. పాలకుడైన వాడు పాలితుల ( ప్రజల ) పాపములకు బాధ్యుడు, పాలకుని పాపములకు పురోహితుడు బాధ్యుడు.

రాజా రాష్ట్రకృతం పాపం రాజ పాపం పురోహితః

అని ఆర్యోక్తి.

పురోహితుడు చేసే పనిని పౌరోహిత్యము అంటున్నారు. పూర్వకాలంలో, రాజ్యానికి శుభములు సమకూడేందుకు, పరరాజుల దండయాత్రల వంటి విషమ పరిస్థితులలోను మంత్రి, పురోహితులతో రాజు సమాలోచనలు జరిపేవాడు. వివాహాది షోడశకర్మలు, పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు, జరుపడానికి సామన్యప్రజలు పురోహితుడునీ తప్పక ఆశ్రయించాలి.

పౌరోహిత్యం

పౌరోహిత్యము చేయువారు కేవలం సప్తార్షేయ బ్రాహ్మణులే కానక్కరలేదు. పంచార్షేయ బ్రాహ్మణ కులస్థులు కూడా వైదిక బ్రహ్మణులే కనుక పంచ వృత్తులతో పాటు పౌరోహిత్యం కూడా వారి వృత్తియే. అలాగే పౌరోహిత్యం గురు ముఖముగా నేర్చుకున్న ఎవ్వరైనను పౌరోహిత్యము చేయవచ్చును, ప్రస్తుతం వివిధ కులాలకు సంబంధించిన వారు కూడా పౌరోహిత్యము నిర్వర్తిస్తున్నారు.

4. వాస్తు:-

5.పాకము:-

విశ్వబ్రాహ్మణ కవులు

మమ్మన: ఈయన శ్రీనాధుని కాలమువారు.ప్రౌఢదేవ రాయల ఆస్థానమున ధర్మాధికారి, విద్యాధికారి పదవులను రెండింటిని అతి దక్షతతో నిర్వహించి ప్రశస్తి గన్నవాడు. ఈయన గాయత్రీ పీఠాధిపతికూడాను. ఆనాడే కాదు, అంతకు మునుపు ముక్కిలి పూర్వము నుండియు గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ పీఠములు మూడును విశ్వబ్రాహ్మణుల పాలనముననే ఉండేవి.మమ్మన ఇంతటి పండితిడు కనుకనే శ్రీనాధుడు గౌడడిండిమ భట్టును జయించుటకు పూనినప్పుడు ఈతని సాయము నర్ధించవలసి వచ్చినది. రాజాస్థానమున ప్రవేశము లభింపక ఇబ్బంది పడుచున్న శ్రీనాధుడు మమ్మన వద్దకు వచ్చి రాజదర్సనం గౌడడిండినభట్టు తోపోటీకి అనుమతికోరినాడు. మమ్మనకవి వంశకర్త యజుర్వేద ప్రస్తుడైన అహభూన ఋషి.ఇతడు సృష్టికర్త అయిన త్వష్ట సంప్రదాయమునకు చెందినవాడు.విశ్వకర్మ పురాణములో అహభూన శబ్దము కలదు.కావున ఈయన విశ్వబ్రాహ్మణుడని రుజువగుచున్నది.

విశ్వకర్మ పురాణకర్త: వేంకటాచార్యుడు: ఈయన మమ్మనాచార్యునికి అయిదవ తరమునకు చెందినవాడు.ఈయన విశ్వకర్మ పురాణకర్త. దీనిని పాటూరును పాలించిన విశ్వబ్రాహ్మణరాజగు పాటూరి బోడన్న కొండనార్యులు శ్రోతలుగా రచించబడినది.ఈ పాటూరి ప్రభువు చరిత్రను ఈ పురాణములో సవిస్తరముగా వివరించబడినది. ఇది 16వ శతాబ్దము చివర రచితమైనట్లు తెలియుచున్నది. ఈ కావ్యమున పది అశ్వాసములలో విశ్వకర్మ మహిమాభివర్ణనము చేయబదినది.

కొమ్మూరి సోమనాధకవి: ఈయన కీ.శే.శ్రీ కొమ్మూరి సంగమేశ్వర కవిగారి పూర్వపురుషుడు.విచిత్ర రామాయణమను పేర రామచరితమును రచించినాడు.దానిని వడ్డెపాటి నిరంజనశాస్త్రిగారు ప్రాచీన విచిత్ర రామాయణము అనుపేర ప్రకటించినారు.ఈయన 17వ శతాబ్దపు కవి.

గద్దె చంద్రశేఖరకవి: ఈతని ఉత్తర హరిశ్చంద్ర చరిత్ర ఇది ఒక ద్విపద కావ్యము.ఈ కవి దేశకాలములు తెలియరాలేదు. ఇతడు మహావీర శైవుడు. సానగ గోత్ర పవిత్రుడు.గద్దె వీరభద్రాచార్యుని కుమారుడు.సాహిత్య రసపోషణుడని బిరుదము నొందిన వాగ్దేవి కటాక్ష సంపన్నుడు. ఈతడు తనకావ్యముని చెంగల్వరాయుని (కుమారస్వామి) కి అంకితము చెశినానని చెప్పుకున్నాడు.1950 లో మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారములో దీనిని ప్రధమముగా లభించినది. ఇది హరిశ్చంద్రుని పూర్వ వృత్తాంతమును తెలుపు కధ.

కిన్నెర చంద్రశేఖరకవి: ఈ కవీశ్వరుడు కంచర్ల ప్రధమాచార్యులవారి పుత్రుడు.ఇతడు భాసు కల్యాణమను పేర సంజ్ఞా సూర్యుల వివాహకధను ద్విపదగా వ్రాసియున్నాడు. ఈతడు విశ్వబ్రాహ్మణ వంశీయుడు కిన్నెర బ్రహ్మయ్య వంశములో జన్మించాడు.కిన్నెర బ్రహ్మయ్య శైవ సాంప్రాదాయములో మహనీయుడని పాల్కూరికి సోమనాధుని బసవ పురాణము తెలుపుచున్నది.ఈయన గురుంచి కర్ణాటకాంధ్ర రాష్ట్రములలో పెక్కు కధలవు ప్రచారములో ఉన్నవి.

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Donate. Buy Us Coffee  

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow