10 దశోపనిషత్తులు గురించి క్లుప్తంగా - శ్రీ చిద్విలాసానంద/ఆనంద్ నాథ్

dasa upanishads explained by Sri chidvilasananda, Anand Nath ji Aghori

Apr 22, 2024 - 14:15
Apr 22, 2024 - 14:17
 0

ఉపనిషత్తులు వేదసారమనీ, వేదరహస్యమనీ వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు వెయ్యిన్నీ ఎనిమిది ఉపనిషత్తులు ఉండేవనీ, ఇప్పుడు నూట ఎనిమిది మాత్రం లభ్యమవుతున్నాయనీ అంటారు. అందులోనూ పది మాత్రం ముఖ్యమైనవనీ, వాటికి మాత్రమే శంకరులు భాష్యం వ్రాశారనీ అంటారు. అవి:

  1. ఈశోపనిషత్తు,
  2. 2. కేనోపనిషత్తు,
  3. 3. కఠోపనిషత్తు,
  4. ప్రశ్నో పనిషత్తు, 
  5. ముండకోపనిషత్తు, 
  6. మాండూ క్యోపనిషత్తు,
  7. తైత్తిరీయోపనిషత్తు,
  8. ఐతరేయోపనిషత్తు,
  9. ఛాందోగ్యోప నిషత్తు,
  10. బృహదారణ్యకోపనిషత్తు.

ఆదిశంకరులు పది ఉపనిషత్తులనెన్నుకొని వాటిపై భాష్యం వ్రాశారు. వాటిని దశోపనిషత్తులంటారు. వాటిలోనున్న, అద్వైత సిద్ధాంతాన్ని ఆయన విశదీకరించారు. వారి తర్వాత వచ్చిన రామానుజాచార్యులు, మధ్వాచార్యులు కూడ ఈ పది ఉపనిషత్తుల మీదే భాష్యాలు వ్రాశారు. కాని వీరు తమ సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమూ, ద్వైతమూ ననుసరించి భాష్యాలు వ్రాశారు.

పది ఉపనిషత్తుల పేర్లనూ వివరిస్తుంది ఈ శ్లోకం -

''ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి

ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ''

ఆదిశంకరులు కూడ భాష్యాన్ని పై క్రమాన్ననుసరించే వ్రాశారు.

ఈశావాస్య ఉపనిషత్తు :

ఈశావాస్య ఉపనిషత్తు శుక్లయజుర్వేద సంహితాంతంలో ఉంటుంది. ''ఈశావాస్యం'' అన్న మాటతో ప్రారంభమవటం వల్ల ఆ ఉపనిషత్తుకి ఆ పేరు వచ్చింది.

ఈశ్వరుడు జగత్తునంతా వ్యాపించియున్నాడనీ, మనం చేసే పన్నులనన్నిటినీ భగవంతునికే అర్పించి, పరమాత్మ తత్వాన్ని అనుభవసిద్ధం చేసుకోవాలనీ ఆరంభంలోనే చెప్తుంది ఈశావాస్య ఉపనిషత్తు.

''ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాంజగత్‌|

తేనత్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్దనమ్‌''

కేనోపనిషత్తు :

దీనినే తలవకార ఉపనిషత్తని కూడా అంటారు. సామవేదంలో జైమిని శాఖలో తలవకార బ్రాహ్మణ ముంటుంది కనుక. ''దొరకని దాని కోసం కేనలో అన్వేషించు'' అని ఒక నానుడి కూడా ఉంది. ఆద్యంతాలు లేని పరమాత్ముని కనుగొనటానికి గర్వోన్నతితో దేవతలు అన్ని చోట్లా వెతికారు. అప్పుడు దివ్యురాలైన అంబిక దేవేంద్రునికి స్వయంగా అనుగ్రహించిన జ్ఞానమే ఈ ఉపనిషత్తులోని విషయం.

పరాశక్తి అయిన అంబిక మన శక్తులన్నీ మహాశక్తి నుండి ఉదయించినవేనని చెప్తుంది. ఇతర భాష్యాలలో వలె ప్రతి పదార్థాన్ని యిచ్చి ఆపకుండా ఆదిశంకరులు ప్రతివాక్యానికీ వేరొక భాష్యం వ్రాశారు. ఈ ఉపనిషత్తుని దృష్టిలో ఉంచుకొనే లోకమాత నుద్దేశిస్తూ వారు వ్రాసిన భక్తిగీతం ''సౌందర్యలహరి''లో ఆది శంకరులిట్లా అన్నారు - ''వేద మాతశిరస్సుపై ఉంచిన పవిత్రమైన నీ పాదాలను నా శిరస్సుపైన కూడ ఉంచు తల్లీ''. వేదాంతం వలె ఉపనిషత్తులని కూడ వేద శిరస్సులనీ, శృతి శిరస్సనీ అంటారు.

అంటే, వేదాలకు శిరస్సని (శృతులకు శిరస్సని) అర్థం. ఉపనిషత్తులే వేదాలకి చివరిభాగాలు, అవే అన్నిటి కన్నా ముఖ్యమైన భాగాలు కూడా (శిరస్సు వలెనే). లోకమాత పాదాలు వేదాల శిరస్సుపై ఉండటమంటే, ఉపనిషత్తులపై ఉండటమనమాట.

జ్ఞానరూపిణిగా లోకమాత కేనోపనిషత్తులోనే సాక్షాత్కరిస్తుంది. లలితా సహస్రనామంలో అంబకి ''సామగానప్రియ'' అన్న నామం కూడా ఉంది. ఆ లోకమాత ఘనతకు సామవేదంలోని ఈ ఉపనిషత్తు ఆవిష్కరిస్తుంది.

''మనకి ఒక పదార్థం కనబడింది'' అన్నప్పుడు ద్వైతభావం బయట పడుతుంది. అంటే చూడబడే పదార్థం (దృక్కు) చూచేది ద్రష్ట. దేహాన్ని వేరే పదార్థం వలె మనం చూడగలుగుతాం. ''నా ఒంట్లో బాగులేద''నో ''బాగుంద''నో అన్నప్పుడు కూడ దేహం ఒక పదార్థమే. అంటే ఈ దేహాన్ని పదార్థంగా చూచేది వేరే ఒకటి ఉన్నదన్న మాట. ఈ చూచేదే ఆత్మ. దీనిని అర్థం చేసుకోలేం, చూడలేం.

ఆత్మ ఎప్పటికీ దృక్కుకాలేదు. ఎప్పుడూ ద్రష్టే. దేహాదులను విడచి ఈ ''నేను'' అన్నది తనంతట తానే సంస్థిత మవ గలదు. కాని దాని ఎరుక కలగట మసాధ్యం - ఎరుక కలిగి ఉండటమంటే అదొక పదార్థమవుతుంది కదా. ఆత్మ విషయంలో ఇది అసంగతం.

ఆత్మని తెలుసుకోవాలంటే, ఆ తెలుసుకొనే వాడు ఆత్మ కంటె భిన్నమవాలి. ఆత్మ కన్నా భిన్నమైనది మన మెరుగ దగినది ఏమైనా ఉందా? లేదు. అందువల్లనే ''ఆత్మని తెలుసుకోవటం'' ''ఆత్మజ్ఞానం'' వంటి మాటలలో ''తెలుసుకోవటం''మన్నది మనం నిత్యవ్యవహారంలో తెలుసుకొన్నట్టు - విషయమూ, గ్రహింపూ వంటి దేమీలేదు. ఆత్మానుభూతిని పొందటమే నిజమైన జ్ఞానం. అందువల్లనే కేనోపనిషత్తు ''నాకు ఆత్మజ్ఞానం కలిగింది. అనే వానికి ఆ జ్ఞానం లేదు. ఆ స్థితిలో ఉంది వేరే ఎరుకలేని వానికే అది ఉంటుంది. దానిని చూచేవాడు నిజంగా చూడలేడు, చూడలేనివాడు చూడగలడు'' అంటుంది.

కఠోపనిషత్తు :

'కఠ ఉపనిషత్‌' 'కఠోపనిషత్‌' 'కఠకోపనిషత్‌' అనబడే ఉపనిషత్తు కృష్ణయజుర్వేదపు కఠకశాఖలోనిది. యమధర్మరాజుకీ నచికేతుడనే బ్రహ్మచారికీ మరణానంతరం ఆత్మ ఏమౌతుందన్న విషయమైన సంవాదమిది. ఒక కథ వలె ప్రారంభించినా ఒక మహాసత్యాన్ని ఆవిష్కరిస్తుంది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఈ ఉపనిషద్వాక్యాలనే మళ్లీ అంటాడు. ఉదా||

'నజాయతేమ్రియతేవాకదాచిన్నాయం భూత్వా `ò భవితా వా న భూయః

అజోనిత్యః శాశ్వతోయంపురాణో నహన్యతే హన్యమానే శరీరే'' (క 2-18)

కంకినుండి గింజలను వేరుచెయ్యాలి. కొబ్బరి ఆకుని తీసివేసి ఈనెను మాత్రం బయట పెట్టాలి. దేహమనే బాహ్య పదార్థం నుండి ఆత్యను నిశ్చయంగా, దృఢంగా వేరు చేయాలి - ఆత్మ తనంతట తానే నిల్వాలి. కామం, కోపం, ద్వేషం, భయం - ఇవన్నీ మనస్సుకి సంబంధించినవే, ఆత్మకి కాదు. ఆకలి దప్పులు దేహానికి సంబంధించినవి. ఆత్మకి కాదు. ఆత్మేతరాలైన వాటిని గుర్తించటం అలవర్చుకోవాలి.

ఈ అభ్యాసం నిరంతరం కొనసాగిస్తే ''నేను'' అంటే దేహము, మనస్సేనన్న భావం సన్నగిల్లి, క్రమంగా పోతుంది. ఈ దేహాన్నీ మనస్సునీ కలుషితం చేసే అపవిత్రత బారి నుండి తప్పించుకొని నిర్మలమైన 'ఆత్మ' కాగలం. ఆత్మని చుట్టి ఉన్న తొడుగువంటిది ఈ శరీరమని భావించాలి. ఈ దేహం మనకొక అన్య పదార్థమన్నట్టు గుర్తెరిగి యుండాలి.

ఈ ప్రపంచంలో ఉంటూ, ఈ శరీరంలోనే మనమున్నామనిపించినప్పుడు ''ఈ శరీరం నేను కాను, ఇది నాది కాదు'' అని అనుకోవటమలవర్చుకోవాలి. అప్పుడు, ముక్తి అన్నది మరణానంతరం సంభవించేదే అనుకోనక్కరలేదు. మోక్ష మంటే మమత నుండి విముక్తే. జీవన్ముక్తుడు ఈ లోకంలోనే ఉంటూ శరీరధ్యాసలేక ఆత్మారాముడై తన ఆనందానికై బాహిర వస్తుజాలాన్ని ఆశ్రయించడు. వేదాలకీ వేదాంతానికీ గల పరమలక్ష్యం మనిషికి విముక్తి కలిగించటమే. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఈ విషయాన్నే అంటాడు :

 ''ఈ దేహం నుండి ప్రాణము పోయే ముందే, ఈ లోకంలో నివసిస్తూనే, కామ క్రోధాలను నిగ్రహించి, యోగ స్థితిలో (అంటే, పరమాత్మతో ఏకత్వంతో) ఉండేవాడు ఆనందాన్ననుభవిస్తాడు''.

అంటే, ఈ లోకంలో ఉంటూనే తన ఆత్మయొక్క నిజతత్త్వాన్ని ఎరిగి, ఆ అనుభవసిద్ధి కలిగి యుంటే దేహం నశించినా ఏమీ కాదు - ఆ దేహమే తాననిగాని, తనదనిగాని, అతడు జీవించి యున్నప్పుడు కూడ భావించక పోవటం వల్ల.

అంటే, మృత్యువు దేహాన్ని తన వశం చేసికొనక ముందే అతడు దేహాన్ని విడిచాడన్నమాట. ''దేహమ''న్న పదంలో మనస్సుకూడా ఉంది. అది మనది కానప్పుడు మృత్యువు కలిగితే మాత్రమేమిటి? దానికి మనపై ఏ విధమైన ప్రభావమూ ఉండదు.

మృత్యువు నుండి విముక్తి చెందటం వల్ల అమరుడవుతాడు. ఈ స్థితిలో ఉండటాన్ని పురుషసూక్తంలోని మంత్రాలు వర్ణిస్తాయి. ఇవి కర్మకాండ భాగంలో ఉన్నాయి. ఈ విషయమే ఉపనిషత్తులలో పదే పదే ప్రస్తావింపబడింది.

మనకి క్లేశాన్ని కలిగించేది శరీరమూ, తద్వారా మనస్సూ. క్లేశం లేకుండా ఉండటం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే - స్వర్గమన్నా, మోక్షమన్నా. ఇది అన్ని మతాలలోనూ ఉంది. కాని అద్వైత సిద్ధాంతం తప్ప మిగిలిన అన్ని ధర్మాలూ ఆ చిదానంద స్థితిని అనుభవించాలంటే వేరే లోకానికి వెళ్లాలని అంటాయి. ఈ లోకంలో ఉంటూనే, దేహం పట్ల మమకారాన్ని పూర్తిగా విడచి, ఆత్మలో లీనమై యుండటం వల్ల పరలోకాల్లో లభించే ఆనందం కంటే అధికమైన ఆనందాన్ని పొందవచ్చని ఆదిశంకరులు నిరూపించారు. బ్రహ్మసూత్రభాష్యాలలో. ''తదేతత్‌ అశరీరత్వం మోక్షాఖ్యమ్‌'' 'అశరీరి' అంటే అశరీరవాణి (ఆకాశం నుండి వినవచ్చేది) అని మనం మాములుగా అర్థం చేసుకొంటాం. కాని 'అశరీరి' అంటే దేహం లేకుండా ఉండటమనే అర్థం. ''ఈ దేహాన్ని నేను'' అన్న ఎరుకలేకుండా ఉండటమే అశరీరత్వమంటే - శరీర లేని స్థితి అన్నమాట. మోక్షాన్ని ఆచార్యుడీ విధంగా నిర్వచించారు కోర్కెలని క్రమంగా తగ్గించి, చివరికి లేకుండా చేసుకుంటే శరీరంపై వ్యామోహం పూర్తిగా నశిస్తుంది. అప్పుడు అంతరాంతరాలలోని ఆత్మ ప్రకాశిస్తుంది. దీని కోసం పరలోకాలకు వెళ్లవలసిన అవసరం లేదు. వేదాలు, వేదాంతమూ ''ఇహైవ, ఇహైవ'' అనటంలో అర్థమిదే!

ఈ ఆనందమయమైన స్థితిని మనం చేరుకోలేక పోవటానికి ముఖ్యమైన అవరోధాలు వాంఛా, కోపమూ అని భగవద్గీత అంటుంది. (భగవద్గీత స్మృతి అని గుర్తుంచుకోవాలి). ఈ మాటలకి ఆధారం, శృతియైన చాందోగ్యోపనిషత్తు

''మఘవర్త్యం వాఇదం శరీరమాత్తం మృత్యునా తదస్యామృతస్యా

శరీరస్యాత్మనోంధిష్ఠానమాత్తో వై సశరీరః ప్రియాప్రియాభ్యాం నవై సశరీరస్య సతః

ప్రియాప్రియయోరపహతిరస్త్య

శరీరంవావ సన్తం నప్రియాప్రియే స్పృశతః''

(చాందోగ్యోపనిషత్‌ - భాష్యం - 8-12-1)

'ప్రియప్రియాలు' అన్న పదాలు వాడబడ్డాయి. ప్రియమంటే వాంఛ, అప్రియమంటే కోపం. ''దేహంలేని జీవికి ప్రియాప్రాయలు లేవు'' అంటుంది చాందోగ్యం. అంటే, వాంఛలనీ, కోపాన్నీ లేకుండా ఉండాలంటే ''నేను శరీరం కాను'' అని భావించాలి.

'నేను', 'నాది' అన్న భావం వల్ల ఆత్మకి కలిగే అనుభూతులను మూడు విధాలుగా వర్ణించటం పరిపాటి. ఇవి గౌణాత్మ, మిథ్యాత్మ, ముఖ్యాత్మ. దీనినే ఒక శ్లోక రూపంలో పెట్టారు. దీనిని తమ బ్రహ్మసూత్ర భాష్యంలో ఉటంకించారు ఆదిశంకరులు.

''గౌణమిథ్యాత్మనోసత్వే పుత్రదేహాది బాధనాత్‌

సద్ర్బహ్మ త్మాహిమిత్యేవం బోధే కార్యం కథం భ##వేత్‌''

(బ్రహ్మ సూత్ర భాష్యం - 1-1-4)

''మనమూ, మన సంతతీ, మన సన్నిహిత మిత్ర వర్గమూ అంతా ఒకటే; వారి వారి సుఖదుఃఖాలు మనవే'' ఈ అనుబంధం గౌణాత్మకి లక్షణం. ''గౌణ'' అంటే గుణం. మనము, మన పిల్లలు, మన మిత్రులూ ఒకరి నుండి మరొకరు వేరని మనకి తెలిసినా మనకీ వాళ్లకీ తేడా లేదన్న భావం బలీయం. శరీరమంటే ఉండే మమకారం ఇంత కంటే బలీయం. - ఇది మిథ్యాత్మ. ఆత్మానుభూతి కలిగి ''నేను బ్రహ్మము కంటె భిన్నము కాను'' అని అనుభవ పూర్వకంగా తెలిసికొంటే బ్రహ్మమే ఆత్మ అవుతుంది. ఇది ''ముఖ్యాత్మ''. మొదటి రెంటినీ (గౌణ, మిథ్య) తీసివేస్తే పిల్లలతో, మిత్రులతో, దేహంతో, ఇంద్రియాలతో - బంధం తెగిపోతుంది. అప్పుడు ''నేను బ్రహ్మస్వరూపుడ''నన్న జ్ఞానోదయం కలుగుతుంది. దీనిని మించినది లేదని చెప్పటమే ఈ శ్లోకం ఉద్దేశం.

''లేవండి, మేల్కోండి'' అని రామకృష్ణ మిషన్‌కి వివేకానందుడిచ్చిన ఉద్బోధ కఠోపనిషత్తునుండే తీసికొనబడింది. ఇటువంటివే ఎన్నో ఉద్బోధలు ఉపనిషత్తుల నుండి గ్రహింపబడ్డాయి. (1) ఆత్మని విద్యవల్లగాని బుద్ధి వల్లగాని అందుకోలేమన్నది (నాయమాత్మా ప్రవచనే నలభ్యో నమేధయా నబహునాశ్రుతేన), (2) ఆత్మ ఈ రథానికి అధిపతి, శరీరం రథం, బుద్ధి సారధి, మనస్సు కళ్లెం, అవయవాలు గుఱ్ఱాలు. (ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు/ బుద్ధిం తు సారథి విద్ధిమనః ప్రగ్రహమేవచః) అనే మంత్రమూ (3) పరమపురుషుడు అంగుష్ఠ మాత్రుడై హృదయ కుహరంలో ఉంటాడన్న సత్యము (4) దీపారాధన చేసేప్పుడు పఠించే మంత్రం - భగవంతుని సన్నిధిలో సూర్యచంద్రులూ, తారలూ, అగ్నీ అన్నీ తమ ప్రకాశాన్ని కోల్పోతాయన్నది - అంటే వారి ప్రకాశానికి మూలాధారం భగవంతుడే అవటంవల్ల అవి భగవంతునిపై కాంతిని ప్రసరింప చేయలేవని అర్థం (5) అల్పమైన మన మేధ ఆ మహనీయమైన బుద్ధి నుండే ఉద్భవించటం వల్ల మనం మేధతో భగవంతుని అవగాహన చేసికోలేము (6) గీతలో శ్రీ కృష్ణ భగవానుని ''తల్లక్రిందులైన చెట్టు'' గురించి (ఊర్ధ్వమూలమధః శాఖ) ప్రస్తావన - అంటే సంసారమనే అశ్వద్ధ వృక్షం (7) మనస్సు నుండి ఉత్పన్నమయే కోర్కెలనన్నిటినీ ధ్వంసం చేస్తే మనిషికి ఇక్కడే బ్రహ్మానందం కలుగుతుందన్న సూక్తి - ఇవన్నీ తరచూ ఉటంకింపబడేవే, ఇవన్నీ కఠోపనిషత్తులోనివే !

ప్రశ్న, ముండక, మాండూక్య :

ఈ మూడు ఉపనిషత్తులూ కఠోపనిషత్తు తరువాత పేర్కొన బడుతాయి.

ప్రశ్న :

ఇది అధర్వవేదంలోనిది. సృష్టి ఎట్లా జరిగింది? దేవతలెవరు? శరీరానికి జీవం ఎట్లా కలుగుతుంది? జాగృత్‌ - స్వప్న - సుషుప్తుల రూపమేమిటి? ఓం కారాన్ని ఆరాధించటం వల్ల ప్రయోజన మేమిటి? పురుషునకీ ఆత్మకీ గల సంబంధమేమిటి? ఈ ఆరుప్రశ్నలకీ సమాధానాలు ఆ ఉపనిషత్తులో ఉండటం వల్ల దానిని ప్రశ్నోపనిషత్తు అంటారు.

ముండక :

అంటే గుండు చేయించుకొన్నతల అని అర్థం. పరిణిత మనస్కులు, మమతారహితులు, సన్న్యాసుల వంటివారు ఆచరించవలసినది ముండకోపనిషత్తు. లయవినాశాలులేని ''అక్షర బ్రహ్మం'' గురించి ఈ ఉపనిషత్తు తెల్పుతుంది. 'అక్షర' అంటే శబ్దమూ, అక్షరమూ అని కూడా అర్థముంది. 'పంచాక్షరం' (అయిదు అక్షరాలు) అష్టాక్షరం (ఎనిమిది అక్షరాలు) గురించి మనం చెప్పుకొంటాం. అక్షరాలకి మూలం ప్రణవం (ఓంకారం). అక్షరబ్రహ్మని చేరుకోవటానికి ఓంకారం ముఖ్య సాధనం. ''ఆత్మ'' అనే శరాన్ని ''ఓంకార'' మనే ధనుస్సు నుండి ''బ్రహ్మ''మనే లక్ష్యాన్ని చేరేట్టు అప్రమత్తంగా ఆ శరమూ లక్ష్యమూ ఒకటే అయేట్టు విడవాలి అంటుంది ఈ ఉపనిషత్తు.

''ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే|

అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భ##వేత్‌'' (మం 2.4)

ఈ ఉపనిషత్తులోనే ప్రసిద్ధమైన ఈ ఉపమానం ఉంటుంది : జీవాత్మ పరమాత్మ అనే రెండు పక్షులు శరీరమనే రావి చెట్టుపై ఉంటాయి. జీవాత్మ అనే పక్షి ఫలాలని ఆరగిస్తుంది (అంటే కర్మ ఫలాలని) పరమాత్మ అనే పక్షి కేవలం సాక్షి వలె ఉండి పోతుంది.

''సత్యమేవ జయతే'' (సత్య మొక్కటే జయిస్తుంది) అన్న మన దేశ ఉద్భోధ ముండకో పనిషత్తులోనిది.

సత్యమేవ జయతే నా నృతం

సత్యేన పంథా వితతో దేవయానః (3.6)

జీవన్ముక్తులైన సన్న్యాసులు దేహాన్ని విడచిన తరువాత (అంటే మరణానంతరం) విముక్తులై యుంటారన్న మంత్ర మొకటి ఉంది. సన్న్యాసులను పూర్ణ కుంభంతో ఆహ్వానించేప్పుడు ఈ మంత్రాన్ని కూడా పఠిస్తారు. అనేక పేర్లు కల నదులు సముద్రంలో కలిసి పోయినప్పుడు ఎట్లా వాటి అస్థిత్వాన్ని, కోల్పోతాయో, ఆ విధంగానే జ్ఞానులు తమ నామరూపాలను కోల్పోయి పరమపురుషునితో ఐక్యమొందుతారు అంటుంది ఈ ఉపనిషత్తు.

యథా నద్యః స్యన్దమానాః సముద్రే

స్తం గచ్ఛన్తి నామరూపే విహాయ |

తథా విద్వాన్నామరూపా ద్విముక్తః

పరాత్పరం పురుషముపైతి దివ్యం |

మాండూక్యోపనిషత్తు :

మండూకమంటే కప్ప. ''కప్ప ఉపనిషత్తు'' అనే పేరెందుకు వచ్చింది? ఒక కారణమిదై ఉండవచ్చు. మెట్లని ఎక్కేటప్పుడు కప్ప ఒక్కొక్క మెట్టునే ఎక్కనక్కర్లేదు - మొదటి మెట్టు నుంచి నాల్గవ మెట్టుకి గంతు వేయగలదు. మేల్కొని ఉండటం (జాగృత్‌) కలలుకనటం (స్వప్న) గాఢ నిద్రలో ఉండటం (సుషుప్తి) ఈ మూడు స్థితులనూ దాటి ఆఖరి, నాల్గవ స్థితి అయిన, తురీయస్థితిని చేరుకోవటానికి మార్గం చూపుతుంది, ఈ ఉపనిషత్తు. ఓం కారాన్ని జపించటం వల్ల నాల్గవ స్థితిని (తురీయ స్థితిని) ఒక్కసారిగా చేరుకోవచ్చు నంటుంది. అందుకనే ఆ పేరు వచ్చిందేమో ఆ ఉపనిషత్తుకి.

కొందరు ఆటవికులు కప్పని ఆరాధిస్తారు - ఈ ఉపనిషత్తు వారికి చెందినదని కొందరంటారు. కప్ప రూపంలో ఉన్న వరుణఋషికి ఈ ఉపనిషత్తు గోచరించిందంటారు.

అన్నిటికన్నా చిన్నదీ ఉపనిషత్తు. పన్నెండు మంత్రాలే ఉంటాయి దీనిలో, కాని ప్రాశస్త్యానికీ, సామర్థ్యానికీ ఈ ఉపనిషత్తుకి ప్రత్యేకమైన స్థానముంది. ప్రణవంలోని నాలుగు భాగాలనూ ఆధారంగా చేసుకొని జీవాత్మా - పరమాత్మా ఒకటేనని నిరూపిస్తుంది. సమస్త సృష్టీ లయమయిపోయే ఆఖరి స్థితిని సుందరము, అద్వితీయము (శివమద్వైతం) అని వర్ణిస్తుంది.

'(ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతురథం మన్యన్తే స ఆత్మా స విజ్ఞేయః) ఆది శంకరుల గురువు గౌడపాదాచార్యుల వారు ఈ ఉపనిషత్తు గురించి తను ''మాండూక్యోపనిషత్‌ కారిక''లో వివరణ ఇచ్చారు. ఈ ఉపనిషత్‌ కారికపైన శంకరుల వారు ఒక భాష్యాన్ని రచించారు.

తైత్తిరీయ ఉపనిషత్తు :

మిగిలిన ఉపనిషత్తులన్నిటికంటె ఎక్కువగా అభ్యసింపబడేది ఈ ఉపనిషత్తే. కర్మానుష్ఠానంలో పఠింపబడే అనేక మంత్రాలు దీనిలోనివే. ఈ ఉపనిషత్తుకి మూడు భాగాలున్నాయి. అవి : శీక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి.

శీక్షావల్లి - విద్యాబోధన గురించి చెప్తుంది. బ్రహ్మ చర్యంలోని సంయమనం, దాని ఔన్నత్యం, వేదాధ్యయన క్రమం, ప్రణవధ్యానం - ఇటువంటి విషయాలగురించి చెప్తుంది. గురువు చేసే ''ఆవహంతి హోమం'' ఈ ఉపనిషత్తులోనిదే. శిష్యులు ఏ సంకోచమూ లేకుండా వచ్చి వేదాధ్యయనం చేయవలెనంటూ ఆవాహనం చేసే హోమమిది.

''సత్యం వద, ధర్మం చర'' వంటి సూక్తులు ఈ ఉపనిషత్తు లోనివే. వేదాద్యయనాన్ని, స్వధర్మపాలననీ ఎప్పుడూ విడువరాదు. ఈ సంప్రదాయాన్ని లోకంలో నిలపటానికి వివాహం చేసుకొని సంతానాన్ని పొందాలి - దాని వల్ల ధర్మం ముందు తరాల వారికి అవిఛ్చనంగా సాగుతుంది. ''మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ'' - తల్లినీ, తండ్రినీ, ఆచార్యుణ్ణీ, అతిథినీ - దైవసమానులుగా ఆరాధించమని చెప్పే మంత్రాలు ఈ ఉపనిషత్తులోనివే.

'ఆనందవల్లి' అనే ఈ ఉపనిషద్భాగంలో బ్రహ్మానందంలో అంతమయే ఆనందానుభూతి క్రమము వర్ణింపబడింది. అన్నమయకోశం - ఆహారం వల్ల పుష్టిని పొందే శరీరం. ప్రాణమయ కోశం - దాంట్లో ఉండే ప్రాణం. మనోమయ కోశం - భావాలని కలిగించే మనస్సు. దానిలో విజ్ఞానమయ కోశం - మంచినీ చెడునీ విచక్షింప చేసే విజ్ఞానం ఇవి నాలుగు కోశాలు. వీటన్నిటికీ మధ్యది ఆనందమయ కోశం. ఇందులో ఆత్మ సహజంగా ఆనందమయంగా ఎట్లా ఉంటుందో వర్ణింపబడింది.

ప్రతి కోశాన్ని ఒక పక్షి వలె వర్ణిస్తుంది. పక్షి యొక్క తల, ఎడమ పక్షం, కుడి పక్షం, శరీరం, తోక - ఉపమానాన్నిస్తుంది. తరచు ఉదహరింపబడే ''యతోవాచో నివర్తన్తే'' అన్నదీ. ''బ్రహ్మానుభూతి పొందిన వానికి ఏ భయమూ లేదు, ఆ స్థితిని అందుకోలేక మనస్సు, వాక్కూ తిరోగమనం చేస్తాయి'' అనే మంత్రాలూ ఈ ఉపనిషత్తులోనివే.

''యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ''

''ఆనందం బ్రహ్మణో విద్వాన్‌ న బిభేతి కదాచన''

భృగువల్లి - వరుణుడు తన కుమారుడైన భృగునికి ఉపదేశించినది భృగువల్లి. ''ఉపదేశించిన'' అంటే కుమారుడిని కూర్చుండబెట్టి పాఠం చెప్పాడని అర్థం కాదు. స్వయంగా చింతనని కొనసాగించి, ఫలితాన్ని అనుభవసిద్ధం చేసికొమ్మని గురువు వరుణుడు. కుమారుని ప్రోత్సహిస్తాడు. స్వయంగా తపస్సు చేసి భృగు అన్నమయకోశ##మే - అంటే దేహమే - చరమసత్యమని గ్రహిస్తాడు. కాని తపస్సునింకా కొనసాగిస్తూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతాడు. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలని దాటి ఆనందమయ కోశాన్ని చేరుతాడు. ఆత్మానందమే పరమసత్యమని గ్రహిస్తాడు.

దేహంతో ఆగిపోయే లోక వ్యవహారం (అన్నమయ్య) అంటే ఈ ఉపనిషత్తుకి చిన్న చూపుకాదు. లోక ధర్మాన్ని పాటిస్తూనే అంతిమ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మ బద్ధంగా జీవిస్తూ ఈ జీవితం ఉన్నత స్థితి నందుకోవటానికి ఒక ఉపాయమనే గ్రహించాలి. అందువల్ల ఆనందమయకోశాన్ని చేరుకున్న తరువాత కూడ ''ఆహారాన్ని చిన్న చూపు చూడక, ఆహారాన్ని వృథాచేయక, అధికాహారోత్పత్తిచేయి'' అని ఈ ఉపనిషత్తు ఉద్బోధిస్తుంది.

''జ్ఞాని తానే ఆహారమూ, భోక్తా-ఆహారానికీ భోక్తకీ సంధాత అనుకొంటూ భగవంతుడూ తానూ ఒకటేనంటూ ఆనందంగా పాడుకొంటాడు'' అని ఈ ఉపనిషత్తు అంతమొందుతుంది.

ఐతరేయ ఉపనిషత్తు :

ఐతరేయ ఉపనిషత్తు ఐతరేయ ఆరణ్యకాంతంలో ఉంటుంది. ఐతరేయ అనే ఋషిచే బయట పడటం వల్ల ఈ ఉపనిషత్తుకి ఆ పేరు వచ్చింది. జీవుడు తండ్రి నుండి తల్లి గర్భస్థమవటం, పాపపుణ్యాల ననుసరించి అనేక లోకాలలో జన్మలనెత్తటం జనన మరణాల నుండి విముక్తి ఆత్మానుభూతి వల్లనే కలగటం - వీటి గురించి ఈ ఉపనిషత్తు చెప్తుంది. తల్లి గర్భంలో ఉండగానే తన పూర్వ జన్మవృత్తాంతాన్ని ఎరిగి అన్ని అడ్డుగోడలనూ దాటి ఆకాశంలో ఎగిరే గరుడుని వలె విముక్తినొందిన వామదేవుడన్న ఋషి కథ ఈ ఉపనిషత్తులోనిదే. ప్రజ్ఞానము - ఆత్మను గురించిన అపరోక్షానుభూతి గురించి ఈ ఉపనిషత్తు సాదకంగా వివరిస్తుంది. ఒకరు జ్ఞానం ద్వారా ముక్తి పొందుతారన్నది సరికాదు. జ్ఞానమే బ్రహ్మ అని వివరిస్తుంది. ''ప్రజ్ఞానం బ్రహ్మ'' అన్నదే ఋగ్వేదపు మహావాక్యం.

చాందోగ్య ఉపనిషత్తు :

దశోపనిషత్తులలోని ఆఖరి రెండూ, అంటే చాందోగ్య, బృహ దారణ్యకాలు - చాలా పెద్దవి. ఈ రెండూ కలిసి మిగిలిన ఎనిమిదింటి కంటే పెద్దవి.

చాందోగ్యోపనిషత్తు సామవేదంలో చాందోగ్య బ్రాహ్మణంలో ఉన్నది. 'చాందోగ్య అంటే సామగానం చేసేవాడని అర్థం. దీనికి సంబంధించినదే ఈ ఉపనిషత్తు.

భగవద్గీతలో కఠోపనిషత్తుని బాగా వినియోగించినట్టే వ్యాసుని బ్రహ్మసూత్రాలకి చాందోగ్యోపనిషత్తు లోని మంత్రాలు ప్రమాణాలంటారు.

చాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు ఎందరో ఋషుల వాక్కుల సముదాయాలు.

చాందోగ్యం ఆదిలో ఓంకారాన్ని ఉద్గీథగా పేర్కొని, ఆ ఓంకార ఉపాసన గురించి వివరాలనిస్తుంది. అక్షివిద్య, ఆకాశ విద్య, మధువిద్య, శాండిల్య విద్య, ప్రాణ విద్య, పంచాగ్ని విద్య వంటి విద్యలనెన్నిటినో ప్రస్తావిస్తుంది. ఈ విద్యలు పరమాత్మ తత్త్వాన్ని తెలిసికోవటానికి ఉపకరిస్తాయి. అంతంలో, దహర విద్య ఉంటుంది. పరమాకాశ స్వరూపమైన పరమాత్మను తన హృదయాకాశంలో దర్శించడమే, అనుభవించడమే దహరవిద్య.

ఈ ఉపనిషత్తులో సత్యం గురించి చెప్పటానికి ఎన్నో ఆసక్తిదాయకమైన ఉపాఖ్యానాలను ఉపయోగించారు. ఇందులో సత్యకాముని కథ ఉంది. అతనికి తన పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. ఈ విషయం దాచడు. ఫలితంగా, గౌతముడు అతను సద్బ్రాహ్మణుడనుకొని శిష్యునిగా స్వీకరిస్తాడు. అంతకి పూర్వమొక గురువు అతనిని ఎన్నో పరీక్షలకు గురిచేస్తాడు - గురుపత్ని కూడ అతని పక్షాన మాట్లాడుతుంది. ఇదంతా పూర్వపు గురుకుల పద్ధతిని మనకళ్ల ఎదుట సినిమా వలె కనబడేట్టు చేస్తుందీ ఉపనిషత్తు. సత్యకామునికి విరుద్ధంగా శ్వేతకేతు వృత్తాంతముంది. ఇతనికి తాను విజ్ఞుడనన్న గర్వమధికం. ఆ బ్రహ్మచారి గర్వాన్ని అణగద్రొక్కిన వాడు అతని తండ్రే, ఉద్దాలక ఆరుణి. జీవాత్మ పరమాత్మలు భిన్నము కావని, ''తత్త్వమసి'' అన్న మహావాక్యార్థాన్ని అతనికి చిట్టచివరికి చెప్పుతాడు. సామవేదపు ముఖ్యోపదేశం, మహావాక్యమూ యిదే. శ్వేతకేతువు వలె గాక నారదమహర్షి అన్ని శాస్త్రాలనీ నిర్దుష్టంగా పఠించినా, ఆత్మ యొక్క తత్త్వం గురించి తెలిసికోవటానికి చాలా శ్రమ పడుతాడు. సనత్‌కుమార యోగి ఆ రహస్యాన్ని ఈ ఉపనిషత్తులోనే బోధిస్తాడు. తైతిరీయ ఉపనిషత్తులో ఆనందం గురించి అన్నమయ కోశంతో ప్రారంభించి క్రమంగా ఊర్థ్వస్థితికి కొనిపోయినట్టే సనత్‌కుమారుడు కూడ ఆహారశుద్ధితో ప్రారంభించి, అంతఃకరణ శుద్ధి వరకూ కొనిపోతాడు - అంతఃకరణ శుధ్దిద్వారా ఆత్మానందానుభూతి సంభవిస్తుంది.

బృహదారణ్యక ఉపనిషత్తు :

అన్ని ఉపనిషత్తులలోను బృహదారణ్యకోపనిషత్తు పెద్దది. ''బృహత్‌'' అంటే 'పెద్ద' అని అర్థం, సాధారణంగా ఏ ఉపనిషత్తైనా ఆరణ్యకం చివర ఉంటుంది. కాని ఈశావాస్య ఉపనిషత్తు శుక్లయజుర్వేద సంహితలోనే ఉంది. ఆ శుక్ల యజుర్వేదంలో మొత్తం ఆరణ్యకంగా, అంటే ఆరణ్యకాంతంలోనే కాక, ఉండేదే బృహదారణ్యకోపనిషత్తు.

దీనికీ రెండు పాఠాలున్నాయి. ఒకటి మాధ్యన్దిన శాఖ, రెండవది కాణ్వశాఖ. ఈ రెండవ దాని పైనే ఆదిశంకరులు భాష్యాన్ని వ్రాశారు.

దీనిలో ఆరు అధ్యాయాలున్నాయి. మొదటి రెండింటినీ కలిపి మధుకాండ అంటారు. ఆ తరువాతి రెంటినీ కలిపి యాజ్ఞవల్క్యుని పేర, మునికాండ అంటారు. ఆఖరి రెంటినీ కలిపి, ఖిలకాండ అంటారు.

మధువంటే ఆనందరసమని అర్థం చేసుకోవచ్చు. సమస్తము బ్రహ్మస్వరూపంగా తెలుసు కొన్న వారికి ప్రపంచం మొత్తం మధుమయంగా కన్పిస్తుంది. ఆత్మ అన్నిటికీ మధువు. అదే మధుకాండ తెలుపుతుంది.

ఆత్మని ''నేతి నేతి'' ('ఇది కాదు, ఇది కాదు') అంటూ చెప్పేది ఈ ఉపనిషత్తులోనే - అంటే ఆత్మను ఏ విధంగానూ వర్ణింపలేమని చెప్పటం. మన మెరిగిన దేనివంటిదీ కాదు ఆత్మ. దీనినే ''నేతి నేతి'' వాదమంటారు. వ్యాకరణ సంధి సూత్రాల ప్రకారం 'న' కి 'ఇతి' చేరిస్తే 'నేతి' అవుతుంది. అంటే ''ఇది కాదు'' అని అర్థం. అంటే ''వర్ణనీయము కానిది'' అని అర్థం. 'నేతి సిద్ధాంతం' ప్రకారం జగత్తునీ, శరీరాన్నీ, మనస్సునీ త్రోసిపుచ్చాలి. పిదప వాగతీతమై, వర్ణనాతీతమైన ఆత్మని అనుభవ సిద్ధం చేసుకోవాలి. ఆ సాక్షాత్కారమైన తరువాత దృశ్యమానమైన జగత్తూ అందులోని జీవరాశులూ అన్నీ ఆనందమయములేనని, ఆత్మాతిరిక్తములు కాదన్న భావమేర్పడుతుంది.

ఈ రోజులలో ప్రార్థనా శ్లోకంగా పాడుకొనే 'అసతోమా సద్గమయ'' అనే దానితో బృహదారణ్యక ఉపనిషత్తు ప్రారంభమవుతుంది. అంటే ''అనిత్యమైన దానినుండి నిత్యమైన దానికి మార్గం చూపు'' అని అర్థం.

మొదటి కాండలో గర్గ్యుడు అన్న బ్రాహ్మణుడు, అజాత శత్రువనే క్షత్రియ ప్రభువు నుండి ఉపదేశం పొందటం గురించి ఉంటుంది. అజాతశత్రువూ, జనకుని వంటి రాజులు బ్రహ్మజ్ఞానులని ఈ ఉపనిషత్తునుంచి తెలుస్తుంది. ఆ విధంగానే, జనకుని విద్వత్‌ సభలలోని చర్చలలో గర్గి వంటి స్త్రీలు పాల్గొన్నారనీ స్త్రీలు కూడ బ్రహ్మవాదులై బ్రహ్మతత్త్వం గురించి చర్చింపగలిగే వారనీ తెలుస్తుంది. ఈ ఉపనిషత్తులోనే యాజ్ఞవల్క్యునికి ఇద్దరు భార్యలున్నట్టు అందులో ఒకామె కాత్యాయని అనీ ఆమె సాధారణ స్త్రీ కాగా రెండవ భార్య మైత్రేయి అనీ ఆమె తత్త్వజ్ఞురాలనీ (బ్రహ్మవాది) ఉంది. యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చేసిన ఉపదేశం ఈ ఉపనిషత్తులో రెండుచోట్ల ఉన్నది. మధుకాండలోను, కొద్ది మార్పులతో మునికాండలోను. ఇది ఉపాఖ్యానికీ, తత్త్వాన్ని జోడించి చెప్పే అద్భుతమైన ఘట్టం.

యాజ్ఞవల్క్యుడు సన్న్యాసి కాగోరి యింటిని విడనాడాలని నిర్ణయించుకొంటాడు. తన ఆస్తిని ఇద్దరి భార్యలకూ పంచిపెడ్తాడు. తన వంతు వచ్చిన ఆస్తికి కాత్యాయని సంతోషిస్తుంది. కాని మైత్రేయి ''ఈ ఆస్తి అంతా ఇవ్వలేని ఆనందాన్ని సన్న్యాసమిస్తుందని మీరు వెళ్లటానికి నిశ్చయించుకొన్నారు. ఆ ఆనందమెటువంటిది? నాకు తెల్పకూడదా?'' అని అడిగింది. దానికి యాజ్ఞవల్క్యుడు. ''నీవెప్పుడూ నాకు ప్రీతి పాత్రురాలివే - ఈ ప్రశ్న అడిగి ఇంకా ప్రియమయ్యావు'' అని ఉపదేశం మొదలు పెట్టుతాడు. ప్రేమా, మమకారమూ గురించి ఆరంభిస్తాడు.

''భర్త పట్ల భార్య ప్రేమ, భార్య పట్ల భర్త ప్రేమ, సంతానం పట్ల ప్రేమ, సంపద పట్ల ప్రేమ - ఇవన్నీ వాటంతటవి జనించవు. అంటే భర్త పట్లా, భార్యపట్లా, పిల్లల పట్లా, సంపద పట్లాను. ఆ ప్రేమించటం తనకు కలిగించే సంతృప్తి వల్లనే జనిస్తాయి. ప్రేమానుభూతి ఆత్మకి సంతృప్తి కలిగిస్తుంది కనుకనే మనిషి ప్రేమలో పడుతాడు. దీని బట్టి ప్రేమా, సంతోషమూ ఆత్మ యొక్క నైజమని తెలియటం లేదా? కేవలం దాని నైజం గురించి తెలిసికోవాలంటే, తనకి దగ్గరైనవి. ప్రియమైనవి అన్నిటినీ విడనాడి సన్న్యాసం స్వీకరించాలి. దాని తత్త్వం తెలిసికొన్న తరువాత, దానిని మినహాయిస్తే ఏమి లేదని తెలుస్తుంది. అప్పుడు అన్నీ దగ్గరే అవుతాయి. అంతకు పూర్వం, ప్రియమైన వాటిపై మమకారమున్నట్టే, అప్రియమైన వాటి పట్ల విముఖతా ఉండేది. వీటన్నిటినీ విడిచి, ఆత్మానుభూతిని పొందితే, ఈ హెచ్చు తగ్గులూ, భేదభావమూ అదృశ్యమవుతాయి. అన్నీ ఆత్మస్వరూపాలే అని తెలుస్తుంది. కొన్నిటిపైన గల విముఖతా, ద్వేషమూ పోయి వాటిపట్ల కూడ ప్రేమ ఏర్పడుతుంది''. ఈ విధంగా కొనసాగుతుంది బోధన.

సన్న్యాసికాకముందు యాజ్ఞవల్క్యుడు జనకమహారాజు విద్వత్‌సభలో కహోళునితో, ఉద్దాలక ఆరుణితో, గర్గితో తాత్త్విక చర్చని జరిపి, తరువాత జనక మహారాజుకి బోధ కలిగించారని మునికాండ తెల్పుతుంది. ''అంతర్యామి'' గురించిన సిద్ధాంతం (అంటే, సూక్ష్మ రూపంలో పరమాత్ముని ఉనికి). యాజ్ఞవల్క్యుడు ఉద్దాలక ఆరుణికి యిచ్చిన సమాధానంలో ఉంది. ఇదే రామానుజాచార్యుల వారు ప్రతిపాదించిన విశిష్టాద్వైతానికి ముఖ్య లక్షణం. ఈ సిద్ధాంతం ప్రకారం జగత్తంతా శరీరానికి పోలిస్తే అందులో పరమాత్మ జీవం వలె ఉంటాడు. దృశ్యమానమైన ప్రపంచమంతా మాయేనని అద్వైతం చెప్తుంది. యాజ్ఞవల్క్యుడు కొంత వరకు ఈ సిద్ధాంతాన్ని ఆమోదించినా, ఎక్కువగా అద్వైతం గురించే చర్చిస్తాడు. మైత్రేయికి తన బోధనను పూర్తి చేసేప్పుడు పూర్తిగా అద్వైతం గురించే చెప్తాడు.

''దృష్టిని, శ్రవణాన్ని, రుచినీ, వాసననీ, ఆలోచననీ ''అది'' ఎట్లా కల్పిస్తుంది? ''అది'' ఎట్లా చూడబడుతుంది, వినబడుతుంది. ఆఘ్రాణింప బడుతుంది. భావింపబడుతుంది. ఏ మాధ్యమంలో'' ఈ విధంగా ప్రశ్నిస్తూ అభిన్నమైన ఏకత్వాన్ని గురించి చెప్తాడు. జనకునికి కూడ అద్వైత బోధనే చేస్తాడు.

ఎక్కడెక్కడో చెదురుగా ఉన్న సందేశాలు ఆఖరి కాండలో చేర్చబడ్డాయి. అందుచేతనే దానిని ''ఖిల'' కాండ అంటారు. (ఏదైనా చెల్లా చెదురైతే, ఖిల మైందంటారు. 'అఖిల'మంటే చెదరిపోక ఒక చోటకి చేర్చబడినది అని అర్థం)

ఖిల కాండలో ఒక ఉపాఖ్యానముంది. సాధకుల అంతస్థుని బట్టి ఒకే సందేశాన్ని మూడు విధాల అన్వయించు కోవచ్చునని చూపుతుంది. ప్రజాపతి నుండి దేవతలు, మానవులు, దానవులు సందేశాన్ని కోరుతారు. తన బోధనగా ''ద'' అన్న అక్షరాన్ని మాత్రం చెప్తాడు. ఆత్మనిగ్రహం లేని దేవతలు దీనిని ''దమయత'' అంటే నిగ్రహం లేక అదుపుగా అర్థం చేసుకొంటారు. ఆస్తిని కూడ బెట్టటమే స్వభావంగా గల మానవులు ''ద'' అంటే ''దానమ''ను కుంటారు. కౄరత్వమే స్వభావంగా గల రాక్షసులు ''ద'' అంటే ''దయధ్వం'' అంటే దయ, కరుణ కలిగి యుండుట మనుకుంటారు!

బృహదారణ్యక ఉపనిషత్తు చివరిలో ఉన్న ఒక మంత్రమంటే నాకు మక్కువ. ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది నాకు. ఆ మంత్రమేమిటి?

అనారోగ్యంతో, జ్వరంతో ఎవరైనా బాధపడుతూంటే అది అతని తపస్సుగా గ్రహించాలి. ఇట్లు ఎవరు జ్వరాది దుఃఖములను సహించుకొని, తాను ఆచరించవలసిన తపస్సుగా భావించి యుండునో ఆతడు ఉత్తమ లోకములను పొందుతాడు.

దీని భావమేమి? ఇక్కడి చెప్పబడే విషయమేమిటి? ఈ మంత్రమిచ్చే సమాశ్వాసమేమిటి? చెప్తాను వినండి. వ్రతాలని ఆచరించి శరీరాన్ని అదుపులో పెడితే శరీరం పట్ల మమకారం పోవటమే కాక, పాపాలకు పరిహారం కూడ జరుగుతుంది. తపస్సు పూర్వజన్మలో చేసిన పాపాలకు కూడ ప్రాయశ్చిత్తమే అవుతుంది. దేహంతో చేసిన పాపాలకు పరిహారం దేహశోషణ వల్లనే చెల్లుబడి అవుతుంది. అందువల్లనే మహాత్ములు కూడ ఈ రకమైన తపస్సు చేసినట్లు పురాణాలలో ఉంది.

విశ్వజనని అంబిక, పరమేశ్వరుని మాటను పాటించక దక్షుని యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ పరాభవింపబడటంతో ఆత్మాహుతి చేసుకొన్నది. హిమవంతుని కుమార్తెగా మళ్లీ జన్మనెత్తింది. భర్త సలహాని పాటించని పాపపరిహారం కాకపోతే తిరిగి తాను భర్తను పొందజాలననుకొంది. దీనినే ఎంతో కోమలంగా, అందంగా కాళిదాసు ''కుమారసంభవం''లో వర్ణించాడు. శీతాకాలంలో హిమాలయశిఖరాలు ఎంత చల్లగా ఉంటాయి! - అటువంటి చలిలో మంచు గడ్డలపైనా, ఘనీభవించిన నీరు గల తటాకాలలో ఆమె నిలబడి తపస్సు కొనసాగించేది. వేసవిలో మండుటెండ ఉండగా తన చుట్టూ నాలుగువైపులా మంటలను ఏర్పర్చుకొని ఆ నడుమ కూర్చుని తపస్సు చేసేది! ఈ నాలుగు మంటలూ, పైన మండే సూర్యుడూ, వీటితో ''పంచాగ్ని తపస్సు'' అయింది. ఎందరో మహనీయులిటువంటి తపస్సు నాచరించారు. అటువంటి కఠోరదీక్షలో సహస్రాంశ##మైనా పూనటానికి సంకల్పంగాని, సమర్థతగాని మనకు లేవు. మన పాపాలెట్లా పోతాయి?

టైఫాయిడ్‌, న్యుమోనియా వంటి జబ్బులు వచ్చినప్పుడు 105-106 డిగ్రీల వరకూ జ్వరం వస్తుంది. శరీరం ఆ తాపానికి తట్టుకోలేక పోతుంది. పంచాగ్ని తపస్సు నెలాగూ చేయలేము - భగవంతుని అనుగ్రహం వల్ల ఆ జ్వరం వచ్చిందనుకోవాలి - ఇదే మనకి ఓదార్పు కావాలి.

అందువల్ల ఏ రోగమైనా, ఏ గాయమైనా తపస్సుగా భావించాలి. అభ్యాసంతో ఈ దృక్పథం బలీయమవుతుంది. అస్వస్థతనీ అనారోగ్యాన్నీ స్థైర్యంతో భరించటమలవడుతుంది. మన ప్రమేయం లేకుండా మన పాపాలను పోగొట్టే ఇటువంటి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. అప్పుడు మీద పడిన బాధను ఉపేక్షింపగల ఉదారమైన స్థితిని ''తితీక్ష''ని చేరిన వారమవుతాము. ఈ విషయాన్నంతా ఉపనిషత్తులోని ఆ మంత్రం క్లుప్తంగా చెప్తుంది. ''ఎన్నో పాపాలను చేశామే - ఏ వ్రతాన్నీ తపస్సునీ ఆచరించటం లేదే, వాటిని చేసే శక్తి లేదే'' అని మనం చింతిస్తున్నప్పుడు భగవంతుడు మనకొరకు లేపనంవలె, ఉపశమనంవలె పంపిన మంత్రమిది.

బృహదారణ్యక ఉపనిషత్తు, దశోపనిషత్తులలో ఆఖరిది. అందులో ఆఖరి అధ్యాయంలో వేదాంతానికే ప్రాధాన్యమివ్వటం, కర్మకాండను వ్యతిరేకించటం కాదని చెప్పటానికా అన్నట్టు పంచాగ్ని విద్య గురించీ, సత్సంతానాన్ని కోరే గృహస్థుల విధుల గురించీ, ప్రస్తావన ఉంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow