శిలాశాసన, సాహిత్య ఆధారాలు -చరిత్ర- తెలుగు భాషా విస్తృతి- భాషాభివృద్ధి - మాండలికాలు
తెలుగు అనేది ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. దీనిని మాట్లాడే ప్రజలు ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణాలో ఉన్నారు. ఇది ఆ రాష్ట్రాలలో అధికార భాష. భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాషా హోదా కలిగిన కొద్ది భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు ఇది కూడా ఉంది.
పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక భాష. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తింపబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు భాషలలో ఇది ఒకటి.
భారతదేశంలో అత్యధికంగా మాతృభాషగా మాట్లాడే భాషలలో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 82 మిలియన్ల మంది మాట్లాడేవారున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మాతృభాషగా మాట్లాడే భాషల ఎథ్నోలాగ్ జాబితాలో 15 వ స్థానంలో ఉంది. ఇది ద్రావిడ భాషా కుటుంబంలో ఎక్కువమంది మాట్లాడే భాష. భారతదేశంలో ఇరవై రెండు షెడ్యూల్ భాషలలో ఇది ఒకటి. ఇది అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష.
తెలుగు భాషలో సుమారు 10,000 పురాతన శాసనాలు ఉన్నాయి. కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని వ్యవహరించాడు. కన్నడ, తెలుగు అక్షరమాలలు చాలా వరకు పోలికగలిగి వుంటాయి.
చరిత్ర ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి -
"దేశ భాషలందు తెలుగు లెస్స"
"ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు",
" పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"
భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదిగా వర్గీకరించారు. అనగా తెలుగు – హిందీ, సంస్కృతం, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషా వర్గానికి (లేదా భారత ఆర్య భాషా వర్గానికి) చెందకుండా, తమిళము, కన్నడం, మలయాళం, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గానికి చెందినదని భాషా శాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'దక్షిణ మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టింది.
ఈ కుటుంబంలో తెలుగుతో పాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి. సామాన్యశకం 1100–1400 మధ్య ప్రాచీన కన్నడ భాష నుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు లిపులు ఆవిర్భవించాయని, అందుకే తెలుగు లిపి, తెలుగు పదాలు కన్నడ లిపిని పోలియుంటాయి అనే సిద్ధాంతం ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు.
ఆర్యభాషలు భారతదేశంలో ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషా చరిత్రకారుల నమ్మకం. నాటి సింధు లోయ నాగరికత నివాసులు ద్రవిడ జాతికి చెందినవారైనందున వారి భాష కూడా ద్రావిడభాషే, లేదా ద్రావిడభాషలకు సంబంధించినదే అయివుంటుందని వారి నమ్మకం. శిలాశాసన, సాహిత్య ఆధారాలు అనేక ఇతర ద్రావిడ భాషలవలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు.
అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు.
ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర సామాన్య శక పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనం తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనం సామాన్య శకం 6వ శతాబ్దం నుండి ఉన్న ఆధారాలను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందింది. శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం "నాగబు". సామాన్య శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడిందిగా గమనించవచ్చు.
ఆంధ్రుల గురించి చెప్పిన పూర్వపు గ్రంథ ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదహరింపబడింది.: పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి ఇది ఉద్యోతనుడు ప్రాకృత భాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:
"అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్ళున్నూ,అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు".
తెలుగు భాషా విస్తృతి తెలుగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలోని యానాంలో అధికార భాష. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు లలో అదనపు అధికార భాషగా గుర్తించబడింది. ఇంకా తమిళనాడులో తెలుగు మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే.
తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశాలోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురం పర్లాకేముండిలలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళ ప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు.
కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవములోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
భాషాభివృద్ధి :- భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలుగు భాషాభివృద్ధికి పునాదులు పడినా, 2020లో ఆంధ్రప్రదేశ్ లో 2022లో తెలంగాణాలో ప్రాథమిక పాఠశాలలో తెలుగు స్థానంలో ఆంగ్లాన్ని బోధనా మాధ్యమంగా మార్చటం, తెలుగు భాషాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారనుంది. ఓట్లకోసం, అధికారం కోసం రాజకీయనాయకులు, విద్యతో సహా అన్ని కీలక రంగాలను శాసిస్తున్న వ్యాపార వర్గాల వల్ల తెలుగుజాతి భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నదని తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు సామల రమేష్ బాబు పేర్కొన్నాడు.
భాష స్వరూపం :- శబ్దము తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదం ఒక అచ్చుతో అంతం అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.
మాండలికాలు : తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
సాగరాంధ్ర భాష: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అని అంటారు.
రాయలసీమ భాష: రాయలసీమ ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అని అంటారు.
తెలంగాణ భాష: తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అని అంటారు.
కళింగాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం లేదా ఉత్తరాంధ్ర మాండలికం అని అంటారు.
What's Your Reaction?






