ప్రామిసరీనోట్అంటే..!  ప్రోనోటు రాసుకున్నప్పుడు పాటించవలసిన నియమానిబంధనలు ?

ఎంత మొత్తానికి ప్రామిసరి నోటు వ్రాసుకొనవచ్చు ? ప్రామిస‌రీ నోట్ కాల‌ప‌రిమితి ?

Aug 11, 2021 - 09:39
 0
ప్రామిసరీనోట్అంటే..!  ప్రోనోటు రాసుకున్నప్పుడు పాటించవలసిన నియమానిబంధనలు ?

ప్రామిసరీనోట్ (ప్రోనోట్) అంటే రాతపూర్వకమైన పత్రమని అర్థం. ప్రామినరీ నోట్‌లో డబ్బు ఇచ్చే వ్యక్తి (రుణదాత), అప్పు తీసుకున్న వ్యక్తి (రుణగ్రహీత) పూర్తి పేర్లు, చిరునామాలు ఉండాలి. 

మ‌నిషికి అనేక అవ‌స‌రాలు తీర్చే సాధ‌నం డ‌బ్బు..  అందుకే ఆర్ధిక అవ‌స‌రాలు ఉన్న వ్య‌క్తులు ఇత‌రుల నుంచి అప్పులు తీసుకోవ‌డం సాధార‌ణ‌మైపోయింది.  న‌మ్మ‌కంతో ఎటువంటి ష్యూరిటి లేకుండానే అప్పులు ఇచ్చే వారు కొంద‌రైతే  ప్రామిస‌రీ నోటు రాసుకుని రుణ‌మిచ్చేవారు ఇంకొంద‌రు.  

ఇలా రాసుకునే ప్రామిస‌రీ నోట్లు ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి…?   వాటి కాల‌ప‌రిమితి ఎంత‌..? ప్రామిస‌రి నోటు ఎటువంటి ల‌క్ష‌ణాలు క‌లిగి ఉండాలి..?  డ‌బ్బులు న‌ష్ట‌పోకుండా ఉండాలంటే ప్రామిస‌రీ నోటు ఏ విధంగా ఉండాలి వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజలు తమ అవసరాలకోసం అప్పు తీసుకోవడం సహజం. ఈక్రమంలో సెక్యూరిటీ ప్రామిసరి నోట్‌ న్యాయపరంగా చెల్లే విధంగా రాసుకొవడం లేదు. దీంతో అప్పు ఇచ్చిన వారు కోర్టులో దావా వేసినా.. న్యాయపరంగా చెల్లుబాటుకాకపోవడంతో దావాలు వేసినా ఫలితం ఉండ డంలేదు.

అప్పు తీసుకున్న వారు కొంతమంది అప్పునుంచి ఎలా తప్పించుకోవాలని అనేక ఆలోచనలు చేస్తుండడంతో కోర్టులలో ప్రామీసరి నోట్‌ కేసులు పెరిగిపోతున్నాయి.  అప్పు పెద్ద మొత్తమైనా లేక చిన్న మొత్తమైనా, అప్పు తీసుకున్నవారు పరిచయస్తులైనా లేక దగ్గరి వారైనా, బంధువులైనా, ఎవరైనా సరే, డబ్బు అప్పుగా తీసుకున్న వారి దగ్గరనుంచి రుణపత్రాన్ని రాయించుకోవడం చాలా ముఖ్యం

డబ్బు విషయంలో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు.డబ్బు గడ్డి తినిపిస్తుందనే సామెత తెలుగులో ఉండనే ఉంది.

డబ్బు కోసం సొంత వారిని కూడా మోసం చేసిన ఘటనలు మన చుట్టూ రోజు జరుగుతూనే ఉన్నాయి.డబ్బు విషయంలో చిన్న అజాగ్రత్త వహించినా కూడా మోసపోవాల్సి వస్తుంది. నేడు మన అనుకున్న వ్యక్తి కి డబ్బు ఇస్తాం. ఆ డబ్బు ఇచ్చే సమయానికి ఆ వ్యక్తితో విభేదాలు తలెత్తితే ఆ డబ్బును రాబట్టుకోవడంకు చుక్కలు లెక్కపెట్టాల్సిందే. అందుకే మన అనుకున్నా కూడా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డబ్బులు ఎవరికి ఇచ్చినా, ఎంత మొత్తంలో వడ్డీ కి ఇచ్చినా కూడా సరైన పద్దతిలో ప్రామిసరీ నోటును రాయించుకోవాల్సి ఉంటుంది.అలా ప్రామిసరి నోటు రాయించుకుంటేనే ఆ డబ్బుపై ఆశ పెట్టుకోగలం. ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వనంటూ మొండికి వేస్తే కోర్టులో ఆ ప్రామిసరి నోటుతో డబ్బును రాబట్టుకునే అవకాశం ఉంటుంది.

అందుకే ప్రామిసరి నోటు రాసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టులలో చెల్లే విధంగా ప్రామిసరి నోటు ఉండాలని, లేదంటే ఆ డబ్బులకు భద్రత లేనట్లే అంటూ న్యాయవాదులు చెబుతున్నారు.  ప్రామిసరి నోట్లు రాయించుకునే సమయంలో తప్పకుండా పాటించాల్సిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం.

ప్రామిసరి నోట్ల విషయంలో కొందరు తరచు చేసే తప్పులు ఏంటంటే ఆ నోట్లపై స్టాంపులు అతికించక పోవడం, జామీను సంతకం తీసుకోక పోవడం, సాక్షి సంతకం చేయించుకోక పోవడం.ఇక ప్రామిసరి నోటు సొంత దస్తూరితో రాయడం.ఈ నాలుగు తప్పులు చేయడం చేయకుండా ఉండాలి.

ఎంత మొత్తంకు ప్రామిసరి నోటు రాయించుకున్నా కూడా తప్పనిసరిగా స్టాంపులు అతికించాలి. స్టాంపుపై డబ్బు తీసుకున్న వ్యక్తి సంతకం చేయించుకోవాలి.ఇక ప్రామిసరి నోటులో జామీను అనే ఆప్షన్‌ ఉంటుంది. కాని అంతా కూడా దాన్ని పట్టించుకోరు. కాని అదే చాలా కీలకం. తప్పనిసరిగా అప్పు తీసుకున్న వ్యక్తి మరో వ్యక్తిని తన జామీనుగా ఉంచాలి. ఇక సదరు వ్యక్తికి డబ్బు ఇచ్చినట్లుగా డబ్బు ఇచ్చే వ్యక్తి ఒక సాక్షిని కూడా సంతకం చేయించాలి.

ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటీ అంటే డబ్బు తీసుకున్న వ్యక్తి ప్రామిసరి నోటును రాయాల్సి ఉంటుంది. ఒకవేళ అతను రాయకుంటే ఎవరైతే రాస్తారో వారి సంతకం ఉండాలి.అంతే కాని డబ్బు ఇచ్చే వ్యక్తి అస్సలు రాయవద్దు.

ఇక లక్షకు ఒక ప్రామిసరి నోటు చొప్పున రాయించుకుంటే బెటర్‌.మూడు నాలుగు లక్షలకు కలిపి ఒకే ప్రామిసరి నోటును రాయించుకుంటే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. 

వడ్డీ ప్రభుత్వ కండీషన్స్‌కు తగ్గట్లుగా ఉండాలి. అనగా 2 రూపాయలు అలా కాదని అయిదు,  పది రూపాయల వడ్డీని ప్రామిసరి నోటులో రాస్తే ఆ నోటు కోర్టులో చెల్లదు.

ప్రామిసరి_రాస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు

  • రాత‌పూర్వ‌కంగా ఉండాలి.
  • ష‌ర‌తులు లేకుండా ఉండాలి.
  • అప్పు తీసుకునే వారి పేరు స్ప‌ష్టంగా ఉండాలి. అంటే ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రాల్లో భాగంగా ఎలా ఉందో అలా ఉండేలా చూసుకోవాలి.
  • ఎవరి పేరు మీద రాయ‌బ‌డింది, ఎవ‌రికి ఇవ్వాల్సింది రాయాలి.
  • ప్రామిస‌రీ నోటు రాసిన స్థ‌ల‌, తేదీల‌ను పేర్కొనాలి.
  • అప్పు తీసుకున్న సొమ్ము అంకెల్లోనూ, అక్ష‌రాల్లోనూ రాయాలి.
  • రెవెన్యూ స్టాంప్ అంటించి, సంత‌కం చేయాలి.
  • అడిగిన త‌క్ష‌ణం మీకు గానీ మీ అనుమ‌తి పొందిన మ‌రొక‌రికి గానీ సొమ్ము చెల్లించ‌గ‌ల వాడ‌ను అనే భేష‌ర‌తు నిర్వ‌హ‌ణ ఉండేలా చూసుకోవాలి.
  • సాక్షుల వివ‌రాలు ఉంటే మంచిది.
  • దీనికి అటెస్టేష‌న్ అవ‌స‌రం లేదు.
  • న‌గ‌దు ద్వారా ముట్టిన‌దో, చెక్కుద్వారా ముట్టిన‌దో రాయాల్సి ఉంటుంది.
  • ప్రామిస‌రీ నోటులో పోస్టాఫీసు జారీ చేసే రెవెన్యూ స్టాంప్‌ల‌ను అతికించాలి.
  • తీసుకున్న అప్పును తీర్చ‌వ‌ల‌సిన స‌మ‌యంలో తీర్చ‌క‌పోతే, సివిల్ కోర్టులో డ‌బ్బు వ‌సూలు చేయ‌డం కోసం కేసు వేయ‌వ‌చ్చును.

ప్రామిస‌రీ నోట్ కాల‌ప‌రిమితి

 ప్రామిసరీ నోట్‌పై ఉన్న తేదీ నుంచి మూడేళ్లు, ప్రామిసరీ నోట్ రాసిన తేదీ నుంచి మూడేళ్లలోపు రుణగ్రహీత సొమ్ము చెల్లించకుంటే కోర్టులో కేసు దాఖలు చేయవచ్చు. ఆపైకాలం దాటితే కోర్టులో కేసు వేయడానికి వీలు లేదు. మూడేళ్ల కాలంలో రుణగ్రహీత ఏమైనా సొమ్ము చెల్లిస్తే ప్రామిసరీ నోట్ వెనుక ఎంత చెల్లించిందీ రాసి, సంతకం చేసి తేదీ వేయాలి. దీంతో ఆ తేదీ నుంచి తిరిగి మూడేళ్లు ప్రోనోట్‌కు కాలపరిమితి ఉంటుంది.

  •  నోటీసు :-  కోర్టులో కేసు పైల్ చేసే ముందు తప్పకుండా మూడు సంవత్సరాలలోపు మాత్రమే   నోటీసు ఇచ్చి కోర్టులో దావా  వేయాలి.
  •  వడ్డీ :   అప్పుగా తీసుకున్న సొమ్ముకు రూ.2 మాత్రమే వడ్డీగా వసూలు  చేయాలి. అధిక వడ్డీ వసూలు  చేయడం నేరం.

ఎంత మొత్తానికి ప్రామిసరి నోటు వ్రాసుకొనవచ్చు ?

అయిదు లక్షల వరకు మాత్రమే ప్రామిసరి నోట్లను వాడితే బెటర్‌.అంతకు మించి డబ్బు ఇస్తే 100 రూపాయల బాండ్‌ పేపర్‌ను వాడటం ఉత్తమం.

ఇక ప్రామిసరి నోటును డబ్బు తీసుకునే వ్యక్తి కుటుంబ సభ్యుల సమక్షంలో రాయించుకుంటే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రామిసరి నోటు కోర్టుకు వెళ్తే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా రాయించుకుంటే ఆ డబ్బు రావడం అనుమానమే.

రుణగ్రహీత_బాధ్యతలు

ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేస్తే ఇబ్బందులు తప్పవు. తాను అప్పుగా తీసుకున్న సొమ్మును సకాలంలో తీర్చాలి. తన ఆర్థిక శక్తి ఎంత ఉందో అంతవరకే అప్పు తీసుకోవడం మంచిది.

ప్రోనోట్_బదిలీ

 ప్రామిసరీ నోట్‌ను రుణదాత తనకు కావాల్సిన వ్యక్తికి బదిలీ చేయవచ్చు. రుణగ్రహీత  నుంచి అప్పు వసూలు చేసుకునే హక్కును బదిలీ చేయవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow