ఐక్యతా ప్రతిమ

Sep 1, 2021 - 10:49
 0
ఐక్యతా ప్రతిమ

సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో నిర్మిస్తున్న ఒక స్మారక కట్టడం పేరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ. దీనిని తెలుగులో ఐక్యతా ప్రతిమ లేక ఐక్యతా విగ్రహం అని అంటారు. ఈ విగ్రహాన్ని గుజరాత్‌లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు నిర్ణయించి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు.

గుజరాత్‌లో జన్మించిన సర్దార్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయంగా చిరస్థాయిగా నిలపాలని నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంకల్పించి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లో 182 నియోజక వర్గాలున్న నేపథ్యంలో పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉండేట్లుగా నిర్మిస్తున్నారు.

అంటే ఈ విగ్రహం ఎత్తు 597 అడుగుల ఎత్తు ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2989 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం నిర్మాణం అక్టోబర్ 2014లో ప్రారంభించి అక్టోబర్ 2018 లో అనగా 4 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశారు.

దీని కోసం 75వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 5వేల 700 టన్నుల ఉక్కు, 18వేల 500 టన్నుల స్టీలు రాడ్లు, 22వేల 500 టన్నుల రాగి షీట్లు వినియోగించారు. ఈ భారీ విగ్రహాన్ని నిర్ణీత గడువులోపు తయారీ పనులు ముగించేందుకు 2500 మందికి పైగా కార్మికులు పనిచేశారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా నిర్మిస్తున్న సర్ధార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.

ప్రత్యేకతలు : విగ్రహం పైకి వెళ్ళడానికి, దిగడానికి అత్యంత వేగంగా ప్రయాణించే లిఫ్టులు ఏర్పాటు చేయడమైనది. విగ్రహం ఛాతి భాగంలో నదీ తీరానికి 500 అడుగుల ఎత్తున ఒక అద్భుతమైన గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు. ఒకే సారి 200 మంది సందర్శకులు నిలబడి చూచేందుకు వీలుగా ఉండడమే కాకుండా వింధ్యా సాత్పురా పర్వతాల అందాలను, 212 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన సుందరమైన సర్దార్ సరోవర్ డ్యాం, 12 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గరుడేశ్వర్ రిజర్వాయర్ అందాలను తిలకించవచ్చు

ఈ విగ్రహ ఏర్పాటుతో పాటు విజిటింగ్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్, గార్డెన్ హోటల్, అమ్యూజ్‌మెంట్ పార్క్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లాంటివి కూడా అందుబాటులో ఉండేటట్లుగా అలాగే భారీ రెస్టారెంట్లు, పార్కులు, విలాసవంతమైన హోటళ్లు ఏర్పాటు చేసినారు. అలాగే 5 కిలోమీటర్ల బోటు షికారు కేంద్రం ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణ.

ఆవిష్కరణ: ఐక్యతా ప్రతిమను సర్దార్ వల్లభభాయి పటేల్ 143వ జయంతి సందర్భంగా 2018 అక్టోబర్ 31వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్ : విగ్రహ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు "వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్" ను ఏర్పాటు చేశారు. మోడి అధ్యక్షుడిగా పనిచేసే ఈ ట్రస్ట్ లో తెలుగు ఐఎఎస్ అధికారి శ్రీనివాస్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం : గుజరాత్ లో సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్ విగ్రహం ప్రతిష్టాపనకు కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించిందని లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow