భట్టిప్రోలు

Mar 4, 2021 - 06:59
Mar 4, 2021 - 11:23
 0
భట్టిప్రోలు
battiprolu

భట్టిప్రోలు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన గ్రామం, అదే పేరు గల మండలానికి కేంద్రము. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3145 ఇళ్లతో, 11092 జనాభాతో 2515 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5518, ఆడవారి సంఖ్య 5574. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1627 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 522. గ్రామం యొక్క జనగణన location code 590426. PIN code : 522 256. STD code - 08648.  ఇది సమీప పట్టణమైన రేపల్లె నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామానికి సమీపంలో కోడిపర్రు, వెల్లటూరు, తాడిగిరిపాడు, పెదపులివర్రు, ఐలవరం గ్రామాలు ఉన్నాయి.

గ్రామ చరిత్ర

భట్టిప్రోలు నిజ నామము ప్రతీపాలపురము. ఆంధ్ర శాతవాహనుల కాలము పూర్వమునుండియే ఉన్న ప్రముఖ నగరము. శాసనముల ప్రకారము కుబేరకుడు అను రాజు ప్రతీపాల పురము పాలించాడు. భట్టిప్రోలు ప్రాముఖ్యత, ప్రస్తావన అచట తవ్వకములలో బయల్పడ్డ బౌద్ధ స్తూపము ద్వారా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాయి. భట్టిప్రోలు ఊళ్ళో ఉన్న చిన్న లంక దిబ్బ, విక్రమార్క కోట దిబ్బ తవ్వగా క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దములో నిర్మించిన బౌద్ధ స్తూపము కనపడింది.

చారిత్రక శిధిలాలు

ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము

క్రీస్తుపూర్వం 3వ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్తూపం చరిత్ర తెలుసుకునేందుకు తొలి నుంచి విదేశీయులే ఆసక్తి కనబరిచారు. క్రీ.శ 1870లో బోస్‌వెల్‌, 1871లో ఇర్లియట్‌, 1882లో రాబర్టు సెవెల్ ‌లు దీన్ని సందర్శించారు. 1892లో అలెగ్జాండర్ ‌రే ఇక్కడ జరిపిన తవ్వకాల్లో రాతి ధాతు కరండాన్ని కనుగొన్నారు. 1969-70 సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరఫున ఆర్‌. సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరిపారు. ఒక విహారపు పునాదులు బయటపడ్డాయి. బుద్ధుని తల ప్రతిమ వెలుగు చూసింది. పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. పురావస్తు శాఖ అంచనా ప్రకారం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఇది నిర్మాణం జరిగిందని తెలుస్తోంది .

ఇక్కడి స్థూపం 132 అడుగులు, వేదిక 148 అడుగుల వ్యాసాలతో ఉంది. 8 అడుగుల ఎత్తు, 8.4 అడుగుల వెడల్పు ప్రదక్షిణా పథం నలుదిక్కులా అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించింది. స్థూప నిర్మాణానికి 45 X 30 X 8 సెంటీమీటర్ల కొలతలున్న ఇటుకలు వాడారు. భట్టిప్రోలు స్థూప తవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బిట్రీష్‌ ప్రభుత్వం భద్రపర్చింది. 1892వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించిన మహాబోధి సొసైటీ ఆఫ్‌ ఇండియాకు నూతన స్థూపంలో నిక్షిప్తం చేసేందుకు వాటిని ఇవ్వటానికి అంగీకరించింది. 1893లో అమెరికాలో జరిగిన విశ్వమత మహాసభలకు హాజరైన శ్రీలంక బౌద్ధ బిక్షువు అనగారిక ధర్మపాల ఈ సంస్థను స్థాపించారు. 1920వ సంవత్సరంలో కలకత్తాలోని శ్రీధర్మరాజిక విహార్‌లోని నూతన స్థూపంలో భట్టిప్రోలులోని బుద్ద ధాతువులున్న స్పటిక పేటికను నిక్షిప్తం చేశారు. అంతటి ప్రాముఖ్యతగల ఈ చారిత్రక ప్రదేశముపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి నిలపి అభివృద్ధి చేయవలిసిన అవసరం ఉంది.

భట్టిప్రోలు లిపి

స్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి. బౌద్ధమతముతోబాటు భట్టిప్రోలు లిపి కూడా దక్షిణ ఆసియా ఖండములో వ్యాపించి బర్మా, మలయా, థాయి, లాఓస్, కాంబొడియా మున్నగు భాషలకు లిపి ప్రదానము చేసింది.

స్వాతంత్రోద్యమంలో గ్రామ విశేషాలు

జాతీయోద్యమంలో భాగంగా, పర్యటనకు వచ్చిన మహాత్మునికి అశేష విరాళాలతో చేయూత నిచ్చిన చైతన్యం, ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించే పెద్దల పంచాయతీ, వెరసి జిల్లాలో భట్టిప్రోలుది ప్రత్యేక స్తానం. 1942లో కావూరుకు వచ్చిన మహాత్మా గాంధీజీ, భట్టిప్రోలుకు చేరుకున్నారు. 1917లో స్థాపించిన మారం వెంకటేశ్వరరావు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉద్యమకారులతో సమావేశం నిర్వహించారు. ఉద్యమానికి బాసటగా ఆ రోజూలలోనే, ఎవరికి తోచిన రీతిలో వారు, తమ ఒంటిపైన ఉన్న స్వర్ణ, రజత ఆభరణాలు, నగదు తీసి మహాత్మునికి అందించారు. భట్టిప్రోలు నుండి మద్దుల వెంకటగిరిరావు, భార్య రామాయమ్మ నేతృత్వంలో 20 మంది ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం, వెంకటగిరిరావు, రామాయమ్మ లను తమిళనాడులోని రాయవెల్లూరు జైలులో ఉంచారు. గర్భవతియిన రామాయమ్మ, జైలులోనే సూత్రాదేవికి జన్మనిచ్చింది. అప్పటినుండి, గ్రామం ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ గుండి పార్వతమ్మ ఆలయం

భట్టిప్రోలు గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెలిసి, భట్టిప్రోలు మరియూ, చుట్టుప్రక్క గ్రామాల పూజలందుకొనుచున్న, భట్టిప్రోలు గ్రామ దేవత, శ్రీ గుండి పార్వతమ్మ ఆలయం శిథిలమవడంతో, రు. 10 లక్షల వ్యయంతో, ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుచున్నవి. ఉగాది పండుగ పురస్కరించుకొని, అమ్మవారిని, 2014,మార్చి-30, ఆదివారం నాడు, భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. తప్పెట్లతో గ్రామవీధులలో అమ్మవారిని ఊరేగించుచుండగా, భక్తులు హారతులు స్వీకరించారు. తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా, ఉగాదిరోజున భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. సోమవారం, ఉగాదినాడు, అమ్మవారిని ఊరేగించిన అనంతరం, దేవాలయ ప్రవేశం చేయించెదరు.

కళ్ళేపల్లి బంగారు మైసమ్మ తల్లి ఆలయం

భట్టిప్రోలులో రైల్వే గేటు ప్రాంతములో మైసమ్మ తల్లి ఆలయం నిర్మాణం పూర్తి అయినది. 2014, జూలై-27, ఆదివారం నాడు, అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకవాహనంపై తప్పెట్లతో ఊరేగించి, భక్తులనుండి హారతులను స్వీకరించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం నాడు భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించెదరు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అమ్మవారు పేరుగాంచడంతో, భక్తుల ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ ఆలయంలో 2014, జూలై-29 నాడు, శ్రావణమాసంలో మొదటి మంగళవారం సందర్భంగా, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మొక్కుబడులు ఉన్నవారు, అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యాలు సమర్పించారు. వచ్చే కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,మే-26వ తేదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహిoచారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించి, భక్తుల నుండి హారతులు స్వీకరించారు.

శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామివారి ఆలయం

1869వ సంవత్సరంలో భటరాజులు దేవస్థానం నిర్మించగా, రాచూరు జమీందారీ వంశీయులు, 12 ఎకరాల మాగాణిభూమిని అందించారు. స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే రథోత్సవం, ఉత్సవాలకు ఆకర్షణీయంగా నిలిచేది. 1938వ సంవత్సరం నుండి ట్రస్టీల ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ జరిగింది. 1993లో ఈ ఆలయం దేవాదాయశాఖ పరిధిలోనికి రావడంతో, అధికారుల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నవి. 2001=5లో గ్రామానికి చెందిన శ్రీ కొడాలి శంకరరావు వంశీయులు కోర్టుద్వారా ట్రస్టీలుగా ఏర్పడి, ఉత్సవాల పర్యవేక్షణలో బాధ్యతలు వహించుచున్నారు. పొన్నమానుసేవ ప్రత్యేకం

పొన్నమానుసేవ ఉత్సవాలలో ప్రత్యేకతగా నిలుచుచున్నది. గతంలో కాగితం పూలతో పొన్నమాను చెట్టును తయారు చేయించి స్వామివారిని పురవీధులలో ఊరేగించేవారు. అద్దేపల్లికి చెందిన శ్రీ తిరువీధుల యుగంధరరావు కుమారులు, స్వామివారికి స్వామివారికి పొన్నమాను చెట్టుని తయారుచేయించి బహూకరించారు. విద్యుద్దీపాల అలంకరణలో స్వామివారిని ఊరేగించుచూ, భక్తులనుండి హారతులు స్వీకరిస్తారు. కళ్యాణమండపానికి ముందు స్వామివారినీ, అమ్మవారినీ ఎదురెదురుగా ఉంచి, చిచ్చుబుడ్లు వగైరా దీపావళి మందుగుండు సామాగ్రిని భారీగా కాలుస్తూ ఐదురోజులు నిర్వహిస్తారు.

వార్షిక బ్రహ్మోత్సవాలు

స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో 6 రోజులపాటు నిర్వహించెదరు. మొదటి రోజు ఉదయం బిందుతీర్ధం, అభిషేకాలతో ప్రారంభించి సాయంత్రం ధ్వజారోహణ చేస్తారు. రెండవ రోజు అమ్మవారికి పుష్పసేవ నిర్వహించి, అద్దేపల్లి వరకు మేళతాళాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. మూడవరోజు పొన్నమాను ఉత్సవం ఉంటుంది. నాల్గవ రోజు ఎదురు కోలు, కనుల పండువగా కళ్యాణం, నిర్వహిస్తారు. ఐదవ రోజు వైభవోపేతంగా, వేలాదిమంది భక్తుల జనసమూహంతో రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆరవ రోజున వసంతోత్సవం నిర్వహించి, ధ్వజారోహణతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.

శ్రీ రామమందిరం

భట్టిప్రోలు గ్రామంలోని కుమ్మరిగుంటవారి వీధిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ సీతా, రామచంద్ర, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఫిబ్రవరి-14వ తేదీ ఆదివారం, రథసప్తమి పర్వదినంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, వైభవంగా నిర్వహించారు. విగ్రహాలను గ్రామ ప్రధాన వీధులలో ఊరేగించారు. ఈ ఆలయంలో వెలసిన ఆదిన వారి ఇలవేలుపు అయిన గంగమ్మ తల్లికి మూడు సంవత్సరాలకొకసారి కొలుపులు నిర్వహించుచున్నారు. తాజాగా, 2017,ఫిబ్రవరి-12వతేదీ ఆదివారం నాడు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కొలుపులు నిర్వహించారు. ఉదయమే అమ్మవారిని కృష్ణానదికి తీసుకొని వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరింపజేసినారు. స్థానిక రైల్వే గేటు వద్ద నుండి తప్పెట్లతో అమ్మవారికి గ్రామోత్సవం నిర్వంచగా, భక్తులు అమ్మవారికి హారతులు సమర్పించారు.

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం. శ్రీ గంగా పార్వతీ సమేత విఠలేశ్వర స్వామివారి ఆలయం. శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం శ్రీ గంగమ్మ తల్లి ఆలయం

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow