టికెట్ ల సమస్య ను వివరించే చిన్న ప్రయత్నం

Dec 28, 2021 - 12:36
Dec 28, 2021 - 23:25
 0
టికెట్ ల సమస్య ను వివరించే చిన్న ప్రయత్నం

ఆంధ్రలో టికెట్ ల సమస్య తారాస్థాయికి చేరుకుంది. నేడో రేపో పరిష్కారం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది ఈ విషయంలో సిఎమ్ జ‌గన్ దే తప్పు అంటూ వాదనలు వినిపిస్తున్నారు. కానీ అసలు ఈ సమస్య ఎలా, ఎక్కడ మొదలైంది అన్నది గమనించడం లేదు. అందుకే టికెట్ ల సమస్య ఎలా పుట్టింది. ఎలా పెరిగింది. ఎలా టర్న్ తీసుకుందీ అన్నది ఓసారి సరిగ్గా పరిశీలిస్తే..

ఆంధ్రలో చిరకాలంగా టికెట్ రేట్ల సవరణ జ‌రగలేదు. గతం ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వదిలేసిందనే వార్తలు వున్నాయి. అలా వదిలేయడం వల్ల ఎప్పటికప్పుడు థియేటర్ కు మూడు వేలు లాయర్ కు ఖర్చు చేసుకుంటే కోర్టుకు దరఖాస్తు చేసుకోవడం, పరిశీలనకు జాయింట్ కలెక్టర్ కు ఆదేశాలు రావడం, అంతా చకచకా జ‌రిగిపోయేవి. సినిమా వస్తే చాలు నూరు, నూట యాభై, రెండు వందలు పెంచేసేవారు. జ‌నం ఇష్టమైన వారు చూసేవారు.

ఇలాంటి నేపథ్యంలో కోర్టు కూడా ప్రభుత్వం ఓ కమిటీ వేసి రేట్లు ఫిక్స్ చేస్తే బెటర్ అనే భావన వెలిబుచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా ఇలా వుండగా వకీల్ సాబ్ వచ్చింది. టికెట్ రేట్ల పెంపకం అనే పాయింట్ మళ్లీ వచ్చింది. అప్పుడు ఓ మంత్రి ఈ టోటల్ వ్యవహారాన్ని సిఎమ్ జ‌గన్ దృష్టి తెచ్చారు.

కొంప ముంచిన పాత జీవో: అలాంటి టైమ్ లో తమిళనాడులో టికెట్ ల రేట్లు అంటూ ఓ జీవోను సిఎమ్ ముందు వుంచినట్లు బోగట్టా. నిజానికి అది పాత జీవో. దాని తరువాత వేరే జీవో తమిళనాడులో అమలులో తెచ్చారు. కానీ ఈ సంగతి ఉద్దేశ పూర్వకంగానో, తెలియకనో దాచి సిఎమ్ ముందు వుంచారు. దానికి ఆయన సై అన్నారు. అక్కడే తప్పిదం జ‌రిగిపోయింది.

అధికారుల మనోభావం: ఇదిలా వుంటే వకీల్ సాబ్ టికెట్ ల విషయంలో ఓ జిల్లా జాయింట్ కలెక్టర్ మీద కోర్టు ధిక్కారణ కేసు పడింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య అది. దాంతో ఐఎఎస్ అధికారుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ టికెట్ రేట్ల వల్ల వచ్చిన సమస్య ఇది వారంతా ఫీలయ్యారు. ముఖ్యంగా సిఎమ్ పేషీలో వున్న ఓ కీలక అధికారి దీనికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

టాలీవుడ్ ప్రయత్నాలు: అప్పటి నుంచి టాలీవుడ్ జ‌నాలు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. వాళ్లు వెళ్లినపుడల్లా సిఎమ్ సానుకూలంగా మాట్లాడుతూనే వున్నారు. కానీ ఆదేశాలు మాత్రం రావడం లేదు. దీని వెనుక ఆ ఐఎఎస్ అధికారి వున్నారని గుసగుసలు వున్నాయి. ఇదిలా వుంటే కొత్త జీవో ఇచ్చినా ప్రభుత్వం థియేటర్లను టికెట్ రేట్ల మీద వత్తిడి చేయలేదు. చూసీ చూడనట్లే వదిలేసింది. బ్యాచులర్, అఖండ, పుష్ప ఆఖరికి వరుడుకావలెను లాంటి చిన్న సినిమాకు కూడా 100, 150 అమ్మేసారు.

అయినా అధికారులు చూసీ చూడనట్లు వదిలేసారు. పట్టించుకోలేదు. అది థియేటర్ జ‌నాలకు తెలుసు, టాలీవుడ్ జ‌నాలకు తెలుసు. మంత్రి పేర్ని నాని కూడా ‘మేమేమీ వత్తిడి చేయలేదు కదా..ఇక మీకు టెన్షన్ ఎందుకు’ అని సినిమా జ‌నాలతో అన్నారని వార్తలు వినిపించాయి.

కోర్టు ఆదేశాలు: ఇలాంటి టైమ్ లో టికెట్ ల జీవోకు కోర్టులో చుక్కెదురైంది. దాంతో సదరు ఐఎఎస్ అధికారికి సర్రుమని ఆగ్రహం వచ్చింది. ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. కొత్త జీవో అమలు కావడం లేదని, కింది స్థాయి అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, ఆ మాటకు వస్తే చాలా థియేటర్లకు అనుమతులే లేవని తెలిసింది.

దాంతో సదరు అధికారి నేరుగా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడి వారినే నేరుగా రంగంలోకి దింపారు. దాంతో తేనెతుట్ట కదిలింది. సూది కోసం సోదికి వెళ్తే అసలు విషయాలు బయటకు వచ్చాయన్న రీతిలో థియేటర్ల కన్నాలు అన్నీ బయటకు వచ్చాయి.

ఇక్కడ మరో గమ్మత్తు వుంది. పాత రేట్ల అమలుపై ఎవరు కోర్టుకు వెళ్లారో, ఎంత మంది వెళ్లారో తెలియదు కానీ 230 మంది వెళ్లారని వార్తలు చలామణీ అయ్యాయి. ఈ మేరకు ఓ లిస్ట్ వాట్సాప్ లో చలామణీలోకి వచ్చింది. కానీ అది ఆ ఙాబితా కాదని థియేటర వర్గాల బోగట్టా.

థియేటర్ల రేట్లు పెంచడానికి కోర్టులో ఫైల్ చేసే లాయర్ ఒకరు వున్నారు. ఆయన థియేటర్ కు మూడు వేల వంతున తీసుకుంటారని టాక్. ఆయన తాను పాత రేట్ల అమలుపై ఆదేశాలు తెచ్చేందుకు కేసు ఫైల్ చేస్తా అని, అందుకు ఆదేశాలు వచ్చిన తరువాత తనకు థియేటర్ కు అయిదు వేల వంతున ఇవ్వాలని కోరారు. ఆ మేరకు థియేటర్ల జాబితా తీసుకున్నారు. ఆ జాబితానే ఈ జాబితా అనే విధంగా వాట్సాప్ లో చలామణీ అయిపోయింది.

మధ్యలో మరో ముచ్చట: ఇదిలా వుంటే జ‌గన్ సానుకూలంగా వున్నారు. నేడో రేపో టికెట్ రేట్లు సవరిస్తారు అనే టైమ్ లో పవన్ కళ్యాణ్ తన గొంతు సవరించుకున్నారు. అది అయిపోయింది మళ్లీ టికెట్ రేట్ల మీద మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ జ‌నాలు సంప్రదింపులు ప్రారంభించారు. హీరో నాని తన స్వరం వినిపించారు. సరే అవన్నీ పక్కన పెట్టి ముందు కింది స్థాయి రేట్లు సవరించి, ఆపైన కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారు ఈ టైమ్ లో రాజ‌కీయ నాయకులు విమర్శలు ప్రారంభించారు.

చూస్తుంటే అందరూ కలిసి దీన్ని పరిష్కరించాలని చూస్తున్నారో? కొనసాగించాలని చూస్తున్నారో అన్నది అనుమానంగా వుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow