గర్భాశయవ్యాధి నిర్ధారణ మరియు గర్భ సంచిని పరీక్షించే అంశాలకు చెందిన 17వ ప్రపంచ సదస్సు

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ: గర్భాశయవ్యాధి నిర్ధారణ మరియు గర్భ సంచిని పరీక్షించే అంశాలకు చెందిన 17వ ప్రపంచ సదస్సు నుద్దేశించి ప్రసంగించిన - డాక్టర్ హర్ష వర్ధన్.. ఆసియాలో మొదటిసారి ఈ సదస్సు నిర్వహించబడుతోంది... ఏ.బి-పి.ఎం.జె.ఏ.వై. మరియు హెచ్.డబ్ల్యూ.సి. ల ద్వారా భారతదేశం అన్ని స్థాయిల్లో క్యాన్సర్ సంరక్షణను బలపరుస్తోంది : 2030 నాటికి గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనపై డాక్టర్ హర్ష వర్ధన్.

Jul 4, 2021 - 13:04
 0

గర్భాశయ వ్యాధి నిర్ధారణ, గర్భ సంచిని పరీక్షించే అంశాలకు చెందిన 17వ ప్రపంచ సదస్సు ప్రారంభ సమావేశంలో, ప్రఖ్యాత వైద్యులు, వైద్య శాస్త్ర ప్రొఫెసర్లు, గర్భాశయ వ్యాధి నిర్ధారణ,  గర్భ సంచిని పరీక్షించే నిపుణులతో కూడిన వైద్య బృందానికి చెందిన ప్రేక్షకులను ఉద్దేశించి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, గత రాత్రి, దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

ఇండియన్ సొసైటీ ఆఫ్ కాల్‌పోస్కోపీ మరియు సర్వైకల్ పాథాలజీ సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

గర్భ సంచిని పరీక్షించడం, గర్భాశయ యొక్క ముందస్తు గాయాల చికిత్సలలో మార్గదర్శక శిక్షణ, మరియు ప్రతిష్టాత్మక ప్రపంచ కాంగ్రెస్‌ ను మొదటిసారి ఆసియాలో  నిర్వహిస్తున్నందుకు, డాక్టర్ హర్ష వర్ధన్, ఇండియన్ సొసైటీ ఆఫ్ కాల్‌పోస్కోపీ మరియు సర్వైకల్ పాథాలజీ సంస్థను,  అభినందించారు.

“గర్భాశయ క్యాన్సర్‌ను తొలగించడం: కార్యాచరణకు పిలుపు” అనే ప్రపంచ కాంగ్రెస్ ఇతివృత్తం, "2030 నాటికి గర్భాశయ క్యాన్సర్‌ ను నిర్మూలించాలన్న" డబ్ల్యూ.హెచ్‌.ఓ. పిలుపుకు అనుగుణంగా ఉందని, ఆయన పేర్కొన్నారు.

గర్భాశయ క్యాన్సర్ అనే అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, “ఇది మహిళల్లో నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్.  ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అర మిలియన్లకు పైగా మహిళలను ప్రభావితం చేస్తోంది. అందులో పావు మిలియన్ మంది మృత్యువాత పడుతున్నారు. 

 మహిళల ఆరోగ్యానికి ఒక పెద్ద ముప్పుగా మారిన, గర్భాశయ క్యాన్సర్‌ కారణంగా,  ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ  మరణించడం విషాదకరం.  విచారకరమైన విషయం ఏమిటంటే, ముందుగానే గుర్తించి, సమర్థవంతంగా చికిత్స  అందించినప్పుడు, గర్భాశయ క్యాన్సర్ అనేది అత్యంత విజయవంతంగా చికిత్స చేయగల క్యాన్సర్  రూపాలలో ఒకటి, అని తెలిసినప్పటికీ, చాలా మంది మహిళలు, గర్భాశయ కాన్సర్ తో బాధపడుతూ, మృతి చెందుతున్నారు. 

 చివరి దశలో నిర్ధారణ అయిన క్యాన్సర్లను కూడా, తగిన చికిత్స, ఉపశమన సంరక్షణ తో  నియంత్రించవచ్చు.  నివారించడానికి, పరీక్షించడానికి, చికిత్స చేయడానికి ఒక సమగ్ర విధానాన్ని పాటించడం ద్వారా, గర్భాశయ క్యాన్సర్‌ ను ఒక తరంలోనే సాధారణ ప్రజారోగ్య సమస్యగా తొలగించవచ్చు.” అని వివరించారు.   

2030 సంవత్సరానికి గర్భాశయ క్యాన్సర్ నివారించాలన్న డబ్ల్యూ.హెచ్.ఓ. లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం చేపట్టిన కీలక పాత్రను డాక్టర్ హర్ష వర్ధన్ ప్రత్యేకంగా వివరిస్తూ, "జాతీయ క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమాన్ని రూపొందించిన కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఒకటి అని నేను గర్వంగా చెప్పగలను.  

ఆసియా లో ఒక నాయకత్వ దేశంగా, 2016 సంవత్సరంలో, గొంతు, రొమ్ము, నోటి మరియు గర్భాశయ క్యాన్సర్ వంటి సాధారణ క్యాన్సర్ల ను పరీక్షించడానికి కార్యాచరణ మార్గదర్శకాలను ప్రారంభించాము.  90 శాతం హెచ్‌.పి.వి. టీకాలు వేయడం ద్వారా, 70 శాతం పరీక్షలు చేయడం ద్వారా, 90 శాతం గర్భాశయ పూర్వ క్యాన్సర్ మరియు క్యాన్సర్‌ కు చికిత్స ద్వారా,  ఉపశమన సంరక్షణ చర్యలను అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా, ఈ ప్రాణాంతకమైన కాన్సర్ ను తొలగించాలనే లక్ష్యాన్ని సాధించడానికి, భారతదేశంతో పాటు మరో 194 దేశాలు కలిసి పనిచేయాలని సంకల్పించాయి.” అని చెప్పారు.  

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం యొక్క రెండు విభాగాల ద్వారా క్యాన్సర్‌ను అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందో కేంద్ర ఆరోగ్య మంత్రి తమ ప్రసంగంలో వివరిస్తూ, "సమర్ధవంతమైన ప్రాధమిక హెచ్.పి.వి. టీకాల నిర్వహణతో పాటు ద్వితీయ నివారణ విధానాలు చాలా గర్భాశయ క్యాన్సర్ కేసులను నివారించగలవన్న విషయం మనందరికీ తెలుసు. నేడు, భారతదేశం అన్ని స్థాయిల్లో క్యాన్సర్ సంరక్షణను బలపరుస్తోంది.  మన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా, క్యాన్సర్  మరియు ముందస్తు గాయాల చికిత్స,  ఆర్థికంగా వెనుకబడిన జనాభాకు అందుబాటులో ఉంది.  

మన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడు సంరక్షణ కేంద్రాలు గా మార్చబడ్డాయి, ఇక్కడ భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించబడుతున్నాయి.  వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బందికి వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికీ, అలాగే, గ్రామీణ ప్రాంతాల నిరుపేద మహిళలకు నాణ్యమైన సంరక్షణను అందించడానికీ వీలుగా,  ప్రతి ఏటా శిక్షణ ఇస్తున్నాము.  గత ఏడేళ్ళలో, 29 కొత్త ఎయిమ్స్ సంస్థలు ప్రారంభించడంతో పాటు, మరో 25 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడం జరిగింది. 

 మన మొత్తం 542 వైద్య కళాశాలలు, 64 పోస్ట్ గ్రాడ్యుయేట్ సంస్థలు, క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్న రోగులకు, అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులకు సమగ్ర సంరక్షణను అందిస్తున్నాయి.  సంరక్షణలో నాణ్యతను జోడించడానికి, భారతదేశం గర్భాశయ కాన్సర్ చికిత్స (గైనో-ఆంకాలజీ) లో సూపర్ స్పెషాలిటీ కోర్సును ప్రవేశపెట్టింది.”  అని చెప్పారు.

ఈ సమావేశం యొక్క శాస్త్రీయ చర్చలు ఆసియా మరియు ఆసియా ఖండం వెలుపల ఉన్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యూహాలను రూపొందించడంలో సహాయపడతాయని పేర్కొంటూ, ఆయన తమ ప్రసంగాన్ని ముగించారు.  ఐ.ఎఫ్‌.సి.పి.సి-2021 ప్రపంచ సదస్సు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. 

ఈ సదస్సు  ప్రసారాన్ని - ఇక్కడ - చూడవచ్చు. 

 https://youtu.be/uC0JZ6KVoAI

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow